
ముంబై : వలస కూలీల విషయంలో యూపీ సీఎం తీసుకున్న నిర్ణయం సరికొత్త వివాదాలకు దారితీస్తోంది. వలస కూలీలను ఎవరైనా పనిలోకి తీసుకునే ముందు తమ ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ చేసిన వ్యాఖ్యలకు ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే దీటుగా బదులిచ్చారు. యూపీ వాసులతో పనిచేయించుకోవాలంటే అనుమతి కోరాలని యోగి ఆదిత్యానాథ్ పేర్కొంటే ఇక్కడ పనిచేయాలనుకునే వారు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరాల్సిందేనని అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి విషయాలపై తీవ్రంగా దృష్టిసారించాలని, పనిచేసేందుకు ఇక్కడకు వచ్చే ప్రతి కార్మికుడు ప్రభుత్వంతో పాటు స్ధానిక పోలీసుల వద్ద తమ పేర్లను నమోదు చేయించుకోవాలని, వారంతా డాక్యుమెంట్లను, ఫోటోలను సమర్పించాలని ఠాక్రే ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను కట్టుదిట్టంగా చేపట్టాలని సూచించారు. కాగా వలస కూలీల సంక్షేమం కోసం మైగ్రేంట్స్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ అధికారులను ఆదేశించారు. యూపీ నుంచి మానవ వనరులను ఇతర రాష్ట్రాలు కోరుకుంటే నేరుగా పంపడం సాధ్యం కాదని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో వలస కూలీల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. యూపీ ప్రభుత్వం వలస కార్మికులకు బీమా, సామాజిక సంక్షేమం కల్పించే బాధ్యతను చేపడుతుందని చెప్పారు. వారు ఎక్కడ పనిచేసినా వారికి యూపీ ప్రభుత్వం భరోసాగా నిలుస్తుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment