సాక్షి, ముంబై: గంపెడాశతో శివసేన, బీజేపీ నేతృత్వంలోని కాషాయకూటమిలో చేరిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) కు ఆ కూటమిలో తమ స్థానం ఏంటనే దానిపై రాందాస్ ఆఠవలే వర్గంలో తీవ్ర సందిగ్ధత నెలకొంది. వచ్చే లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకంలో స్థానాలు కేటాయించే విషయమై కూటమి ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలిపోయాయి. దీంతో కాషాయకూటమి తమ పార్టీకి ఎంతమేర ప్రాధాన్యత ఇస్తుందనేది ఆర్పీఐ కార్యకర్తలకు అంతుచిక్కడం లేదు. ఒకప్పుడు ఒంట రిగానే ఎన్నికల బరిలో దిగిన ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే ఎంపీ అయ్యారు.
ఆ తర్వాత ఆయన ప్రాబల్యం తగ్గిపోవడంతో పలు ప్రధానపార్టీల తో పొత్తు పెట్టుకున్నారు. అయినా అనుకున్నంతమేర ఫలితాలు రాలేదు. చివరకు కాషాయకూటమితో పొత్తుపెట్టుకోవడంతో అది మహాకూటమిగా అవతరించింది. ఆ తర్వాత జరిగిన నగర పాలక సంస్థ (బీఎంసీ) ఎన్నికల్లో ఆర్పీఐ వర్గం ఓట్లు అధికంగా పోలవడంతో కాషాయకూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో భవిష్యత్తులో జరిగే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు డిమాండ్ చేయవచ్చనే ధీమాతో ఆఠవలే ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో సీట్ల పంపకంపై పలుమార్లు శివసేన, బీజేపీ నాయకులతో చర్చలు కూడా జరిగాయి.
ఈ నేపథ్యంలో ఎమ్మెన్నెస్‌ను మహాకూటమిలో చేర్చుకునే అంశాన్ని బీజేపీ నాయకులు తెరమీదకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆర్పీఐ గుండెల్లో దడ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఎవరెన్ని సీట్లు ఆర్పీఐకి వదులుకోవాలనే విషయంపై శివసేన పార్టీ ప్రధాన కార్యాలయమైన సేన భవన్‌లో అనేక సార్లు చర్చలు జరిగాయి. తనను రాజ్యసభకు పంపాలని చేసిన డిమాండ్‌ను కూడా శివసేన నెరవేర్చలేకపోయింది. చివరకు అనేక కారణాలు చూపుతూ బీజేపీ ద్వారా రాజ్యసభ సభ్యత్వం ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చింది. ఇలా శివసేన, బీజేపీ నాయకులు ఆఠవలే నిరాశపడకుండా అనేక హామీలు ఇచ్చారు. ఆయన్ని శాంతపరిచేందుకు‘మహాకూట మి సమన్వయ సమితి’ని కూడా ఏర్పాటు చేశారు. కాని ఇంతవరకు కచ్చితమైన సీట్ల సంఖ్యను ఖరారు చేయలేకపోయారు. దీంతో ఆర్పీఐ కార్యకర్తలు సందిగ్ధంలో పడిపోయారు. బీఎంసీ ఎన్నికల్లో కాషాయకూటమి నాయకులు తమను వాడుకున్నారని ఆర్పీఐ వర్గం ఆరోపిస్తోంది. సీట్ల సర్దుబాటు వెంటనే తేల్చని పక్షంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని గతంలో ఆఠవలే హెచ్చరించారు. అయినప్పటికీ ఆ అంశం ఇప్పటికీ అయోమయంలోనే ఉంది. దీంతో కాషాయకూటమిలో తమ పార్టీ స్థానం ఏంటనే దానిపై ఆఠవలే కార్యకర్తలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
‘కరివేపాకు’ చందమేనా..!
Published Wed, Jan 1 2014 12:15 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement