దహిసర్‌లో బీజేపీ విజయోత్సవం
బోరివలి, న్యూస్‌లైన్: దహిసర్ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి మనీషా చౌదరి, శివసేన పార్టీ అభ్యర్థి వినోద్ ఘోసాల్కర్‌పై 37 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఆదివారం పలుచోట్ల పార్టీ కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. దౌలత్ నగర్ నుంచి తెలుగు కార్యకర్తలు గాజుల నర్సారెడ్డి, నీరటి భూమన్న, తోకల రాములు, నీరటి మల్లేష్, సుతారి దీపక్, తోకల భీమేష్, చిట్టాపురం రమేష్ తదితరులు మనీషా చౌదరికి పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ బోరివలిలోని గోవింద్ నగర్ నుంచి ప్రేమ్‌నగర్, దేవిదాన్ లేన్, అంబవాడి, దౌలత్‌నగర్ తదితర ప్రాంతాల గుండా ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా మనీషా మాట్లాడుతూ తెలుగు ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చుతానని హామీ ఇచ్చారు. ఇక్కడ రోజువారీ పని చేసే తెలుగు ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పారు. 50 ఏళ్లు పైబడిన వారికి వృద్ధాప్య పింఛన్లు ఇప్పిస్తానని తెలిపారు. ఇళ్లల్లో పని చేసేవారికి గుర్తింపుకార్డులు అందజేస్తానని తెలిపారు.