ఇక్కట్లపాలైన అమెరికాలో భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేకి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అండగా నిలవనుంది.
సాక్షి, ముంబై: ఇక్కట్లపాలైన అమెరికాలో భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేకి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అండగా నిలవనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు రాందాస్ అథవాలే శనివారం వెల్లడించారు. జనవరిలో అమెరికా వెళ్లనున్నట్టు చెప్పారు. ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలుస్తానన్నారు.
కాగా వీసా మోసం ఆరోపణలపై దేవయానిని అరెస్టు చేసి బేడీలు వేయడం, ఆ తరువాత విచారణ పేరు తో ఆమెపట్ల దారుణంగా వ్యవహరించడం తెలి సిందే. అమెరికా వైఖరిని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తం గా వివిధ రంగాల నుంచి తీవ్ర నిరసనలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో దేవయాని తండ్రి ఉత్తమ్ ఖోబ్రగడే శనివారం సాయంత్రం రాందాస్‌ను కలిశారు. అనంతరం రాందాస్ మీడియాతో మాట్లాడుతూ దేవయానికి అండగా నిలిచేందుకే తాను అమెరికా వెళుతున్నానన్నారు. దేవయానిపై నమోదుచేసిన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని, ఆమెపట్ల కఠినంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరనున్నట్టు చెప్పారు. దేవయానికి న్యాయం జరిగేదాకా తమ పార్టీ ఆందోళన ఆగదని రాందాస్ స్పష్టం చేశారు.