సాక్షి, ముంబై: ‘మహా’కూటమి నేతలకు మంచి రోజులొచ్చాయి. ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధికంగా 42 లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకున్న ఈ రాష్ట్రం నుంచి ఎక్కువ మందికి మంత్రి పదవులు లభించే అవకాశం కనబడుతోంది. ఇందుకనుగుణంగానే శివసేన, బీజేపీ నేతలు పదవులు దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సంఖ్యాబలంగా చూస్తే మహాకూటమిలోని బీజేపీకి 23, శివసేన 18, స్వాభిమాని షేత్కారీ పార్టీ ఒకటి ఇలా మొత్తం 42 స్థానాలు దక్కాయి. దీంతో రాష్ట్రానికి కనీసం ఏడెనిమిది కేబినెట్‌లు, అదే సంఖ్యలో సహాయ మంత్రి పదవులు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. వీటిలో రెండు కేబినెట్‌లు శివసేనకు, మిగిలినవి రాష్ట్రంలోని బీజేపీ నాయకులకు లభిస్తాయని భావిస్తున్నారు. దీంతో అనేక మంది నేతల్లో ఆశలు చిగురించాయి.
శివసేన నేత అనంత్ గీతేకు కేంద్ర కేబినెట్ పదవి లభించే ఆస్కారాలున్నాయని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. చంద్రకాంత్ ఖైరే, ఆనందరావ్ అడసూల్, అనిల్ దేశాయి, శివాజీరావ్ ఆడల్‌రావ్ పాటిల్ పేర్లు అందరికంటే ముందున్నాయి. సంజయ్ రావుత్ బలమైన నాయకుడైనా, ఇటీవలే గుజరాతీ సమాజంపై విమర్శలు గుప్పిస్తూ సామ్నాలో సంపాదకీయం రాసినందుకు ఆయనకు మంత్రి మండలిలో చోటుదక్కే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
వ్యవసాయశాఖ మంత్రిగా ముండే...?
బీజేపీ సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండేకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పదవి లభించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ పలుమార్లు ఈ విషయాన్ని తెలిపారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం రైతుల సమస్యలు పరిష్కరించేందుకు గోపీనాథ్ ముండేకు వ్యవసాయశాఖ మంత్రి పదవిని కట్టబెడతామన్నారు. దీనిపై ముండే మాత్రం ఏమీ చెప్పడం లేదు. పార్టీ ఏ బాధ్యతలిచ్చినా స్వీకరిస్తానని చెబుతున్నారు.
అయితే ముండేకు మాత్రం కేంద్ర రాజకీయాలకంటే రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి ఉందని తెలుస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి సీఎం కావాలనుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నాగపూర్ నుంచి ఎంపీగా గెలిచిన నితిన్ గడ్కారీకి పట్టణాభివృద్ధి శాఖ, రైల్వే శాఖలలో ఏదేని ఒక పదవి లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి. కిరీట్ సోమయ్య, హంసరాజ్ ఆహిర్, హీనా గావిత్‌లకు అవకాశాలు కల్పించేందుకు ఆస్కారం ఉంది. దళితనాయకుడైన ఆర్‌పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవాలేకు సహాయమంత్రి పదవి, రాజు శెట్టికి కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాలని యోచిస్తున్నట్టు సమాచారం.
అయితే ఇంత భారీ మొత్తంలో రాష్ట్రానికి కేంద్రమంత్రి పదవులు వస్తే రాష్ట్రానికి రావాల్సిన నిధులను భారీ మొత్తంలో తెచ్చుకునేందుకు వీలుంటుంది. తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపొచ్చని మహా కూటమి నేతలు భావిస్తున్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపొచ్చని లెక్కలు వేస్తున్నారు. భారీ మొత్తంలో కేంద్ర మంత్రి పదవులు వచ్చినా అందరూ కలిసి ఐకమత్యంగా సమర్థంగా పనిచేస్తేనే రాష్ర్ట భవిష్యత్‌ను మార్చేందుకు వీలుంటుందంటున్నారు.
‘మహా’ చాన్స్!
Published Mon, May 19 2014 11:24 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement