సాక్షి, ముంబై: బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు పాతికేళ్ల బంధాన్ని తెంచుకుని ప్రతిపక్ష హోదాను ఎంచుకున్న శివసేన భవిష్యత్తులో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో ఒదుదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ మేరకు బీజేపీ వ్యూహాత్మక అస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది. మహానగర పాలక సంస్థ (బీఎంసీ)లో బీజేపీ, శివసేన ఉమ్మడిగా అధికారంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాని బీజేపీ అధికారంలో ఉంటూనే శివసేనపై ప్రతీకారం తీర్చుకోవాలని వ్యూహం పన్నుతోంది.
దీంతో శివసేన నాయకుల్లో, కార్పొరేటర్లలో గుబులు మొదలైంది. బీఎంసీ సభాగృహంలో బిల్లులు, ప్రతిపాదనల మంజూరు విషయంలో బీజేపీ కచ్చితంగా నిలదీసే ప్రయత్నం చేయనుంది. దీంతో బీజేపీని ఎదుర్కోవడం శివసేనకు ఒక సవాలుగా మారనుంది. శాసన సభ ఎన్నికల సమయంలో బీజేపీ, శివసేన మధ్య సీట్లు సర్దుబాటుపై రాజీకుదరకపోవడంతో పాతికేళ్ల బంధం తెగిపోయింది. దీంతో ఇరుపార్టీలు ఒంటరిగానే పోటీ చేశాయి. ఫలితాల తరువాత మద్దతుపై ఇరు పార్టీల నాయకుల మధ్య జరిగిన చర్చలు కూడా బెడిసి కొట్టాయి. తాజాగా గురువారం నాటకీయంగా జరిగిన పరిణామాల మధ్య చివరకు ప్రతిపక్షంలో కొనసాగాలని శివసేన నిర్ణయం తీసుకుంది.
మొదటి శాసన సభ సమావేశంలోనే బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు శివసేన తీవ్ర ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. కాగా బీఎంసీలో పొత్తు తెగతెంపులు చేసుకోవాలని ఇరు పార్టీలు ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. అయినప్పటికీ అధికారంలో ఉంటూనే శివసేనను ఇరకాటంలో పెట్టేందుకు బీజేపీ వ్యూహం పన్నుతోంది. బీఎంసీలో శివసేనకు 75 మంది సంఖ్యా బలముంది. బీజేపీకి చెందిన 31 మంది కార్పొరేటర్లున్నారు.
ఒకవేళ బీజేపీ తెగతెంపులు చేసుకుంటే ఇండిపెండెంట్లు, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎమ్మెన్నెస్)కు చెందిన 27 మంది కార్పొరేటర్ల మద్దతు కూడగట్టుకుని శివసేన ముందుకుపోయే అవకాశముంది. ఈ విషయాన్ని గుర్తించిన బీజేపీ అధికారంలో ఉంటూనే వ్యూహాత్మకంగా పావులు కదపాలని యోచిస్తోంది. దీనివల్ల శివసేన కచ్చితంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు.
బీఎంసీలో కలహాల కాపురం..
Published Fri, Nov 14 2014 11:07 PM | Last Updated on Fri, Mar 29 2019 9:01 PM
Advertisement