‘సేన’ దిగివచ్చేనా..
ముంబై: బీజేపీ, శివసేన మధ్య పొత్తు వ్యవహారం తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. శివసేనకు చెందిన కేంద్ర మంత్రి అనంత్‌గీతే శనివారం ప్రధాని మోదీతో సమావేశమవ్వాల్సి ఉండగా చివరి నిమిషంలో అది రద్దు అయ్యింది. దీంతో ఆదివారం జరిగే మంత్రివర్గ విస్తరణలో శివసేన బెర్త్ విషయం ఇంకా తేలలేదు. రాష్ట్రంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు తేలితేగాని, కేంద్ర క్యాబినెట్‌లో చేరేదిలేదని శివసేన భీష్మించుకు కూర్చుంది.
బీజేపీ మైనారిటీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే విషయంలో శివసేనకు ఎటువంటి అభ్యంతరం లేకపోయినా బలనిరూపణకు ముందే శాఖలను కేటాయించాలని కోరుతోంది. అయితే బల నిరూపణ తర్వాతే మంత్రి వర్గవిస్తరణ చేపడతామని బీజేపీ అంటోంది. దీంతో రెండు పార్టీల మద్య ప్రతిష్టంభన నెలకొంది. కాగా, శివసేనకు కేంద్రంలో ప్రాతినిధ్యాన్ని పెంచి, రాష్ట్రంలో ఆ పార్టీ మద్దతు పొందేందుకు మార్గం సుగమం చేసేందుకు బీజేపీ అధిష్టానం యత్నిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. చివరి నిమిషంలో ఏమైనా జరగవచ్చని వారు సీఎం ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రస్తావిస్తున్నారు.
ఆ కార్యక్రమానికి హాజరు కాబోమని మొదట ప్రకటించిన శివసేన, చివరి నిమిషంలో హాజరై అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిం దే. ఇదిలా ఉండగా, అంతకుముందు శివసేన పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపికైన ఎంపీ అనిల్ దేశాయ్‌కు, అలాగే అదే పార్టీకి చెందిన సురేష్ ప్రభుకు కేంద్ర పదవి ఇచ్చేందుకు బీజేపీ సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్‌ను విస్తరించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో శివసేన నుంచి మంత్రివర్గానికి పేరు ప్రతిపాదించమని ఆ పార్టీకి ఇప్పటికే బీజేపీ అధిష్టానం కోరింది.
కాగా ఉద్ధవ్ ఠాక్రేకు అత్యంత సన్నిహితుడిగా ముద్ర పడిన అనిల్ దేశాయ్ పేరును పార్టీ నిర్ణయించిందని, అధికారికంగా ప్రకటించడమే తరువాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి నీలమ్ గోరే తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 2012 నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న అనిల్ దేశాయ్ పేరును పార్టీ ప్రతిపాదించిందని తెలిపారు. అయితే పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేదే దీనిపై తుదినిర్ణయమని ఆయన వివరించారు.
ఇదిలా ఉండగా, శివసేనకే చెందిన సురేష్ ప్రభుకు కేబినెట్ హోదా కల్పించేందుకు మోదీ ప్రభుత్వం యోచించడంపై ఆ పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీలో అనేక మంది సీనియర్ ఎంపీలు ఉన్నారని, వారందరినీ కాదని సురేష్ ప్రభుకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తే పార్టీలో అంతర్గత కలహాలకు తావిచ్చినట్లవుతుందని వారు వాదిస్తున్నారు.
అయితే గత ఎన్డీయే ప్రభుత్వంలో సురేష్ ప్రభు పలు కీలక శాఖలకు మంత్రిగా సమర్థవంతంగా పనిచేశారని, అందువల్ల ఇప్పుడు అతని సేవలను తిరిగి ఉపయోగించుకోవాలని మోదీ ఆసక్తి చూపిస్తున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. శివసేనకు చెందిన సీనియర్ నాయకుడొకరు మాట్లాడుతూ..‘ మా పార్టీలో చాలామంది సీనియర్ ఎంపీలు ఉన్నారు. వారికి పార్టీపరంగా తగిన ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం ఉంది. సురేష్ ప్రభుకు మా పార్టీ కోటాలో మంత్రివర్గంలో చోటు కల్పించేందుకు మోదీ సర్కార్ ఎలా కోరుతోందో అర్థం కావడంలేదు.
దీనిపై పార్టీలో అంతర్గతంగా చర్చించుకుని తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది..’అని పేర్కొన్నారు. కాగా పార్టీ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సంజయ్ రావుత్ మాట్లాడుతూ..‘ మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలనేది మోదీ ప్రభుత్వానికి సంబంధించిన అంశం.. గతంలో సురేష్ ప్రభు పేరును ప్రతిపాదించాలని బీజేపీ కోరింది. ఆయన ఇంతకుముందు వాజ్‌పాయ్ సర్కార్‌లో పలు శాఖలకు మంత్రిగా బాగా పనిచేశారు.. అయినా తుది నిర్ణయం మా పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రేదే.. ఆయన నిర్ణయం కోసం వేచి చూస్తున్నా’మని తెలిపారు.
కాగా, కేంద్ర కేబినెట్‌లో సేన తరఫున అనిల్ దేశాయ్ పేరును ఇప్పటికే పార్టీ నిర్ణయించినట్లు రావుత్ స్పష్టం చేశారు. పేర్లను అధికారికంగా శనివారం రాత్రి గాని, లేదా ఆదివారం ఉదయంగాని ఠాక్రే ప్రకటిస్తారని చెప్పారు. అయితే రాష్ట్రంలో పొత్తులపై జరుగుతున్న చర్చలపైనే ఈ వ్యవహారమంతా ఆధారపడి ఉందని రావుత్ స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో బీజేపీతో పొత్తుపై చర్చలు జరుగుతున్నాయి. అవి మా పార్టీకి గౌరవప్రదంగా, ఆమోదయోగ్యంగా ఉంటే సరే.. లేకుంటే మా భవిష్యత్ ప్రణాళికను అప్పుడే నిర్ణయించుకుంటా’మని కుండబద్దలు కొట్టారు. ఇదిలా ఉండగా, బీజేపీ మైనారిటీ ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన అసెంబ్లీలో తన బలం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించడం ద్వారా శివసేన తమకు రాష్ర్టంలో మద్దతు ప్రకటించేలా బీజేపీ అధిష్టానం వ్యవహరిస్తుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.