సాక్షి, సిటీబ్యూరో : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ ముఖచిత్రం ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. హైదరాబాద్,మేడ్చల్ జిల్లాలతో పాటు గ్రేటర్ పరిధిలోకి వచ్చే రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 26 నియోజకవర్గాల నుంచి 35 మంది మాజీ ఎమ్మెల్యేలు మరోసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టేందుకు సై అంటున్నారు. ఒకసారి గెలవడమే గగనమైన ప్రస్తుత తరుణంలో కొందరు నాలుగైదుసార్లు విజయదుందుభి మోగించిఅసెంబ్లీలో అడుగుపెట్టారు. మరికొందరు రెండుమూడు దఫాలు గెలిచివారూ ఉన్నారు. వీరంతా ప్రస్తుతంజరగనున్న ఎన్నికల బరిలో నిలిచి మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. యాకుత్‌పురా నుంచి ఎంఐఎం తరఫున వరుసగా ఐదుసార్లు విజయం సాధించిన ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ఈసారి చార్మినార్ నుంచి బరిలో దిగారు. చార్మినార్ నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన అహ్మద్ పాషా ఖాద్రీ యాకుత్‌పురా నుంచి పోటీ చేస్తున్నారు. ఆయా స్థానాల్లో బరిలో నిలిచిన అభ్యర్థులపై ప్రత్యేక కథనం.
గోషామహల్
ఇక్కడ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు పోటీలో నిలిచారు. పునర్విభజనలో భాగంగా 2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన ముఖేష్‌గౌడ్ విజయబావుటా ఎగరవేశారు. అంతకుముందు ఈ నియోజకవర్గం మహరాజ్‌గంజ్ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉండేది. ఇక్కడి నుంచి 1989, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ముఖేష్‌గౌడ్ రెండుసార్లు గెలవగా, బీజేపీ నుంచి ప్రేమ్‌సింగ్‌రాథోడ్ 1999లో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో గోషామహల్‌లో బీజేపీ నుంచి గెలిచి అందరి దృష్టినీ ఆకర్షించిన రాజాసింగ్ లోధా ప్రస్తుతం అదే పార్టీ నుంచి బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి ముఖేష్‌గౌడ్, టీఆర్‌ఎస్ నుంచి ప్రేమ్‌సింగ్ రాథోడ్ పోటీ పడుతున్నారు.
మల్కాజిగిరి
ఇక్కడినుంచి ఇద్దరు ఎమ్మెల్సీలు మైనంపల్లి హన్మంతరావు, ఎన్.రామచందర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ బరిలో ఉన్నారు. మెదక్ జిల్లాలోని రామాయంపేట సెగ్మెంట్‌కు 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున హన్మంతరావు పోటీ చేసి గెలిచారు. కొన్నేళ్ల పాటు టీడీపీలో కొనసాగిన ఆయన అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. హైదరాబాద్–రంగారెడ్డి– మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ నేత ఎన్.రామచందర్‌రావు గెలవగా, నల్లగొండ–ఖమ్మం–వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థిగా కపిలవాయి దిలీప్‌కుమార్ గెలిచారు. మారిన పరిణామాల నేపథ్యంలో ఆయన టీఆర్‌ఎస్‌ను వీడారు. టీఆర్‌ఎస్ నుంచి మైనపంల్లి, బీజేపీ నుంచి రామచందర్‌రావు, టీజేఎస్ నుంచి దిలీప్‌కుమార్ బరిలో ఉన్నారు.
ఎల్‌బీనగర్
దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్నికల గోదాలో నిలిచారు. 2009లో ఆవిర్భవించిన ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన దేవిరెడ్డి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014లో దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి ఆర్.కృçష్ణయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో మిర్యాలగూడ టికెట్‌ను ఆర్.కృష్ణయ్య కాంగ్రెస్ నుంచి దక్కించుకున్నారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సుధీర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు.
సనత్‌నగర్
ఐదోసారి అసెంబ్లీలో అడుగిడేందుకు తలసాని శ్రీనివాస్‌యాదవ్ సనత్‌నగర్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఆయన టీఆర్‌ఎస్‌లో చేరి కేసీఆర్ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. అంతకుముందు ఆయన సికింద్రాబాద్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1994 ఎన్నికల్లో గెలిచిన తలసాని తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో గెలిచారు. 2004లో ఓటమి పాలైన తలసాని ఇదే నియోజకవర్గానికి 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచారు.
అంబర్‌పేట
ఇక్కడినుంచి హ్యాట్రిక్ కొట్టాలని జి.కిషన్‌రెడ్డి ఉవ్విళ్లూరుతున్నారు. 2009లో పునర్విభజనలో భాగంగా ఆవిర్భవించిన ఈ నియోజకవర్గానికి ఆయనే తొలి ఎమ్మెల్మే. 2014 ఎన్నికల్లోనూ బీజేపీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు ఈ నియోజకవర్గం హిమాయత్‌నగర్ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉండేది. 2004లో జరిగిన ఎన్నికల్లో హిమాయత్‌నగర్ నుంచి గెలిచి కిషన్‌రెడ్డి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
జూబ్లీహిల్స్
పీజేఆర్ తనయుడు పి.విష్ణువర్ధన్‌రెడ్డి మూడోసారి ఎమ్మెల్యే అయ్యేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. పీజేఆర్ మృతితో విష్ణు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2008లో ఖైరతాబాద్‌కు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2009 ఆవిర్భవించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఆయన కాంగ్రెస్ తరఫున గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన మాగంటి గోపినాథ్ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాతి కాలంలో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి గోపీనాథ్ బరిలో ఉండగా, కాంగ్రెస్ నుంచి విష్ణు ప్రత్యర్థిగా ఉన్నారు.
కంటోన్మెంట్
ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగిడేందుకు సాయన్న సిద్ధమయ్యారు. 1994, 1999, 2004, 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. ముందస్తు ఎన్నికల్లో భాగంగా టీఆర్‌ఎస్ నుంచి బరిలో నిలిచారు. కంటోన్మెంట్ నుంచి మారు కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి గెలిచిన సర్వే సత్యనారాయణ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
ఇబ్రహీంపట్నం
2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి బరిలో నిలిచారు. చివరి వరకూ కాంగ్రెస్ టికెట్ ఆశించిన మల్‌రెడ్డి రంగారెడ్డి ఆ పార్టీ నుంచి అవకాశం రాకపోవడంతో బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈయన గతంలో మలక్‌పేట నియోజకవర్గం నుంచి 1994లో టీడీపీ నుంచి గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరి ఇదే నియోజకవర్గం నుంచి 2004 ఎన్నికల్లో గెలిచారు. ఈసారి మంచిరెడ్డి, మల్‌రెడ్డిలలో మూడోసారి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి మరి.
కుత్బుల్లాపూర్
2009లో కొత్తగా ఏర్పడిన ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కూన శ్రీశైలంగౌడ్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలో ఉన్న కేపీ వివేకానంద్ శ్రీశైలం గౌడ్‌ను ఓడించి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన ప్రస్తుతం ఆ పార్టీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా, కాంగ్రెస్ నుంచి శ్రీశైలంగౌడ్ బరిలో ఉన్నారు.
మహేశ్వరం
కొత్తగా ఆవిర్భవించిన మహేశ్వరం నుంచి 2009లో సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ తరఫున గెలిచారు. పునర్విభజనలో భాగంగా చేవెళ్ల నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వు కావడంతో మహేశ్వరం నియోజకవర్గానికి ఆమె మారాల్సి వచ్చింది. ఇంద్రారెడ్డి మరణంతో 2000 సంవత్సరంలో చేవెళ్లకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఆమె తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2004లోనూ ఆమె ఇదే నియోజకవర్గం నుంచి గెలిచారు. ప్రస్తుతం ఆమె నాలుగోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి ఆశ 2014 ఎన్నికల్లో నెరవేరింది. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున మహేశ్వరం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డితో తలపడుతున్నారు.
చాంద్రాయణగుట్ట
ఇక్కడినుంచి అసదుద్దీన్ ఒవైసీ ఐదోసారి ఎమ్మెల్యే అయ్యేందుకు ఎన్నికల గోదాలో ఉన్నారు. 1999లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఆయన చాంద్రాయణగుట్ట నుంచి ఎంఐఎం తరఫున గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం ఆయన 2004, 2009, 2014 వరుస ఎన్నికల్లోనూ
విజయఢంకా మోగించారు.
ముషీరాబాద్
ఇక్కడి నుంచి మూడోసారి గెలిచేందుకు బీజేపీ అభ్యర్థి డాక్టర్ కె.లక్ష్మణ్ సై అంటున్నారు. 1999 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014లోనూ ఆయన బీజీపీ నుంచి గెలిచారు.
శేరిలింగంపల్లి
టీడీపీ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయిన ఆరికెపూడి గాంధీ అనంతర పరిణామాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ముందస్తు ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు.
సికింద్రాబాద్
మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు సికింద్రాబాద్ నుంచి టీఆర్‌ఎస్ తరఫున పద్మారావు బరిలో ఉన్నారు. 2004 జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2008లో జరిగిన ఉప ఎన్నికలో ఓటమి పాలయ్యారు. 2014 ఇదే నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ తరఫున గెలిచి కేసీఆర్ కేబినెట్‌లో మంత్రి అయ్యారు.
చార్మినార్
ఆరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు ముంతాజ్ అహ్మద్‌ఖాన్ సిద్ధమయ్యారు. గతంలో అహ్మద్‌ఖాన్ వరుసగా ఐదుసార్లు యాకత్‌పురా నియోజకవర్గం నుంచి గెలిచారు. 1994లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఏ ఎన్నికల్లోనూ వెనుదిరిగి చూడలేదు. 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో ఎంఐఎం తరఫున గెలిచారు.
రాజేంద్రనగర్
హ్యాట్రిక్ విజయంపై ప్రకాష్‌గౌడ్ దృష్టి సారించారు. 2009లో ఆవిర్భవించిన ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన ఆయన తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లోనూ అదే పార్టీ నుంచి బరిలో నిలిచి రెండోసారి కూడా గెలిచారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు. కార్వాన్ నియోజకవర్గం నుంచి 1985, 1989, 1999 ఎన్నికల్లో వరుస విజయాలు నమోదు చేసిన బద్దం బాల్‌రెడ్డి బీజేపీ అభ్యర్థిగా ఇక్కడినుంచి పోటీచేస్తున్నారు.
ఖైరతాబాద్
ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు దానం నాగేందర్ సిద్ధమయ్యారు. ఆసిఫ్‌నగర్ నుంచి 1994, 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆయనకు అనూహ్య పరిణామాల నేపథ్యంలో 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కలేదు. దీంతో ఆసిఫ్‌నగర్ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన తన ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచినా ఎంఐఎం చేతిలో ఓటమి పాలయ్యారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఖైరతాబాద్ నుంచి గెలిచి మంత్రి అయ్యారు. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన ప్రస్తుతం ఖైరతాబాద్ నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ చింతల రామచంద్రారెడ్డి టీడీపీ మద్దతుతో ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఎన్నికల్లోనూ ఆయన ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
మలక్‌పేట
ఈ నియోజకవర్గం నుంచి అహ్మద్ బలాల హ్యాట్రిక్‌పై దృష్టి సారించారు. ఎంఐఎం నుంచి పోటీ చేసిన ఆయన 2009 ఎన్నికల్లో తొలిసారి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. 2014లో జరిగిన ఎన్నికల్లోనూ రెండోసారి గెలిచారు.
మేడ్చల్
2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ప్రస్తుత ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన నక్కా ప్రభాకర్ గౌడ్
కేఎల్‌ఆర్‌కు గట్టిపోటీ ఇచ్చారు. అన్యూహ పరిణామాల నేపథ్యంలో
టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన మేడ్చల్ టికెట్ ఆశించి భంగపడ్డారు. బీఎస్పీ అభ్యర్థిగా ప్రస్తుతం బరిలో నిలిచారు.
యాకుత్‌పురా
నాలుగోసారి అసెంబ్లీలో అడుగుపెట్టేంందుకు అహ్మద్ పాషా ఖాద్రీ సెగ్మెంట్ మారారు.
చార్మినార్ నుంచి పాషా ఎంఐఎం తరఫున 2004 నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత జరిగిన 2009, 2014 ఎన్నికల్లోనూ ఆయన చార్మినార్ నుంచి గెలిచారు.
పటాన్‌చెరు
పునర్విభజనలో భాగంగా 2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గం నుంచి 2014లో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన గూడెం మహిపాల్‌రెడ్డి తొలిసారిగా అసెంబ్లీలో అడుగిడారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ తరఫున మరోసారి తన అదృష్ణాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఉప్పల్
టీడీపీ బలపర్చిన బీజేపీ అభ్యర్థిగా 2014 ఎన్నికల్లో బరిలో నిలిచిన ఎన్‌వీఎస్‌ఎస్. ప్రభాకర్ తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. ప్రస్తుతం ఆయన బీజేపీ అభ్యర్థిగా ఒంటరిగా తలపడుతున్నారు.
కార్వాన్
కౌసర్ మొహినుద్దీన్ రెండోసారి బరిలో నిలిచారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ ముందస్తు ఎన్నికల్లోనూ అదే పార్టీ నుంచి బరిలో ఉన్నారు.
బహదూర్‌పురా
పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం 2009లో ఆవిర్భవించింది. ఇక్కడ ఎంఐఎం నుంచి గెలిచిన మోజంఖాన్ తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. 2014లోనూ జరిగిన సాధారణ ఎన్నికల్లో మోజంఖాన్ ఎంఐఎం నుంచి గెలిచి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు.
నాంపల్లి
పునర్విభజనలో భాగంగా 2009లో ఈ నియోజకవర్గం ఆవిర్భవించగా, జాఫర్‌ఖాన్ రెండోసారి ఎంఐఎం తరఫున పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో నాంపల్లి నుంచి గెలిచిన ఆయన ముందస్తు ఎన్నికల్లోనూ బరిలో ఉన్నారు.
కూకట్‌పల్లి
మాధవరం కృష్ణారావు రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఆయన తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అనంతర పరిణామాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో చేరి ఆ పార్టీ నుంచి ప్రస్తుత ఎన్నికల బరిలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment