ఆసిఫ్‌నగర్‌లో జరిగిన సభలో అభివాదం చేస్తున్న ప్రజాఫ్రంట్ నేతలు రాహుల్‌గాంధీ, చంద్రబాబు, ఉత్తమ్, ఆజాద్, కోదండరాం, భట్టివిక్రమార్క, రమణ, ముఖేష్‌గౌడ్
సాక్షి,సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో నగరంలో అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. డిసెంబర్ 7వ తేదీన పోలింగ్ జరగనుండగా.. ప్రచారానికి మాత్రం వారం రోజులే మిగిలి ఉంది. దీంతో ఇప్పటికే టీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయం కోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు సుడిగాలి షెడ్యూల్‌తో హోరెత్తిస్తున్నారు. బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ సభలతో నగరం బిజీ అయింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా అంబర్‌పేట, ముషీరాబాద్ అభ్యర్థులు కిషన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్‌ల విజయాన్ని కాంక్షిస్తూ రోడ్‌షో నిర్వహించడంతో పాటు నగరంలో బీజేపీ అభ్యర్థుల విజయం కోసం సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ వేదికపై సీఎం కేసీఆర్, కాంగ్రెస్ కూటమిపై అమిత్ షా తీవ్ర విమర్శలు చేసి ప్రచార అంకంలో కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపారు. బీజేపీ ముఖ్యనేత, కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ మేడ్చల్ నియోకజవర్గంలో జరిగిన మహిళా సదస్సులో పాల్గొని బీజేపీ
ఆధ్వర్యంలోనే తెలంగాణ వికాసం సాధ్యమని తెలియజెప్పారు.
ప్రజాఫ్రంట్ సైతం దూకుడు
గ్రేటర్‌లో కాంగ్రెస్ ఆధర్వ్యంలోని టీజేఎస్, టీడీపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు, పీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సనత్‌నగర్, నాంపల్లి నియోకజవర్గాల్లో సభలు నిర్వహించారు. ఈ సభల్లో రాహుల్.. నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సనత్‌నగర్ సభలో మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డితో పాటు మల్కాజిగిరి, సికింద్రాబాద్, సనత్‌నగర్, ముషీరాబాద్ అభ్యర్థులు కె.దిలీప్‌కుమార్, కాసాని జ్ఞానేశ్వర్, కూన వెంకటేశ్‌గౌడ్, అనిల్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సభలో రాహుల్ తన ప్రసంగంలో హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్, టీడీపీ చలువేనంటూ టీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే ఎల్బీనగర్‌లో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పాల్గొన్న రోడ్డు షోకు సైతం భారీగా జనం హాజరయ్యారు.
చివరి వారం చాలా కీలకం
ప్రచారానికి కేవలం వారం రోజులే మిగిలి ఉండడంతో అన్ని పార్టీలు బూత్ నుంచి నియోజకవర్గం స్థాయి దాకా ప్రచారాన్ని హోరెత్తించే ప్రణాళికను రూపొందించాయి. ఒక వైపు అగ్రనేతలతో పాటు మరో వైపు ఇంటింటి ప్రచారానికి వ్యూహం రూపొందించాయి. తమ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటికే సిద్ధం చేసుకున్న బూత్‌స్థాయి కమిటీలను పూర్తి స్థాయిలో వినియోగించుకోనున్నారు. ఇదిలా ఉంటే నగరంలో రాత్రి వేళల్లో ప్రచారం, అనుమతి లేకుండా సభలు నిర్వహించినందుకు మూడు కమిషనరేట్లలో ఇప్పటికే 200కు పైగా కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఈ చివరి వారంలో నిబంధనలను మరింత కఠినంగా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
గబ్బర్‌సింగ్ ట్యాక్స్‌కు సీఎం మద్దతు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనిల్ అంబాని కుటుంబానికి రూ.వేలాదికోట్లు పంచిపెట్టింది. గబ్బర్‌సింగ్ ట్యాక్స్ (జీఎస్‌టీ)కు సీఎం కేసీఆర్ మద్దతునిచ్చారు. తెలంగాణలో ప్రజాఫ్రంట్ అధికారంలోకి రాగానే ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం.– రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు (అమీర్‌పేట్ సభలో)
టీఆర్‌ఎస్‌ను ఓడించండి
కేంద్ర పథకాలను తెలంగాణలో అమలు చేయకుండా ప్రజలకు ద్రోహం చేస్తున్న టీఆర్‌ఎస్‌ను ఓడించండి. బలహీనపడుతున్న కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకుని వంద సీట్లలో కూడా పోటీ పడలేని స్థితికి దిగజారింది. తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించిన కోదండరాం వారితో జతకట్టడం విచారకరం. – సుష్మాస్వరాజ్ (కీసర సభలో)
దేశ భవిష్యత్ కోసమే..
టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని నేనెప్పుడూ దూషించలేదు. తెలంగాణలో అభివృద్ధికి ఎప్పుడూ అడ్డు పడలేదు. నగర అభివృద్ధికి రూపకల్పన చేశానన్నానేగాని.. నిర్మించానని ఎప్పుడూ చెప్పలేదు. అయినా హేళన చేసి మాట్లాడుతున్నారు. దేశ భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌తో కలిశాం. తెలంగాణ భవిష్యత్తు కోసం కూటమిని గెలిపించండి.– చంద్రబాబునాయుడు, ఏపీ సీఎం
పాము,ముంగీస ఒకటయ్యాయి
చంద్రబాబు ఢిల్లీకి పోయి రాహుల్‌కు వీణ ఇస్తే, చంద్రబాబుకు ఆయన ఫిడేల్ ఇచ్చారు. డిసెంబర్ 11 తరువాత ఒకరు వీణ, మరొకరు ఫిడేల్ వాయించుకుంటూ కూర్చోవాల్సిందే. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గడ్డాలు పెంచుకొని సన్యాసం తీసుకునే రోజు వస్తుంది. పాము, ముంగీసలాంటి కాంగ్రెస్, టీడీపీలు ఏకమయ్యాయి. – కేటీఆర్ (మొయినాబాద్ రోడ్‌షోలో)
విజ్ఞతతో ఓటేయండి
కేసీఆర్, కేటీఆర్ హైదరాబాద్‌ను అద్దంలాగా చేస్తామన్నారు. తండ్రీకొడుకులను మూసీలో ముంచితే అసలు సంగతి తేలుతుంది. ఈ ఎన్నికల్లో తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజల పక్షాన నాలుగు పార్టీలు కలిసి ప్రజాఫ్రంట్‌గా నిలబడ్డాయి. నలుగురు కుటుంబ సభ్యుల పక్షాన కేసీఆర్ ఎన్నికల్లోకి వస్తున్నాడు. ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి ఓటెయ్యాలి. – రేవంత్‌రెడ్డి (ఎల్‌బీనగర్ రోడ్‌షోలో)
ఎన్‌కౌంటర్‌పై నోరు మెదపరేం?
సీఎం కేసీఆర్ ఆలేరు ఎన్‌కౌంటర్‌పై నోరు ఎందుకు మెదపడం లేదు. ముస్లింల పక్షపాతిగా చెప్పుకునే కేసీఆర్ బూటకపు ఎన్‌కౌంటర్‌ను ఎందుకు తొక్కి పెట్టాడు. బడ్జెట్‌లో సైతం ముస్లిం జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయించలేదు. వాటినీ విడుదల చేయలేదు. 12 శాతం రిజర్వేషన్ పేరిట మభ్యపెట్టి మోసం చేశాడు. ముస్లింలు మేల్కోవాలి.– ఉత్తమ్‌కుమార్ రెడ్డి (అసీఫ్‌నగర్ సభలో)
కేంద్రంలో మోడీ.. రాష్ట్రంలో కేడీ
కేంద్రంలో మోడీ.. రాష్ట్రంలో కేడీ.. ఇద్దరు కలిసి తెలంగాణ ప్రజలకు గోరీ కట్టారు. తెలంగాణలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడకుండా ప్రతి సభలోనూ చంద్రబాబు గురించి మాట్లాడడం మానుకోవాలి.– విజయశాంతి, (కుత్బుల్లాపూర్ సభలో)
పాలన భ్రష్టు పట్టించాడు
కేసీఆర్‌కు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నేరవేర్చుతాడని అధికారం కట్టబెడితే సచివాలయానికి రాకుండా పాలనను భ్రష్టు పట్టించాడు. రూ.300 కోట్లతో భవనం కట్టుకొని దానికే పరిమితమయ్యాడు. బూటకపు హమీలతో నాలుగున్నరేళ్లకే కాడెత్తేశాడు. – ప్రొఫెసర్ కోదండరాం,(అమీర్‌పేట సభలో)
ప్రజల పక్షాన నిలబడుతున్నా..
దేశంలో ఎక్కడ ముస్లిం మైనార్టీలు, దళితులపై దాడులు జరిగినా నేనే వెళ్లి బాధితులను ఓదారుస్తున్నా. అక్కడి పాలకులను ప్రశ్నిస్తున్నా. ఇది మతతత్వ పార్టీ కాదు.. హిందూ ముస్లిం భాయీ భాయి నినాదంతో ముందుకెళ్తోంది.– అసదుద్దీన్ ఓవైసీ (మొహదీపట్నం సభలో)
Comments
Please login to add a commentAdd a comment