మహాకూటమి పొత్తు లెక్కలు ఇంకా తేలడం లేదు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కాంగ్రెస్‌పార్టీ పెద్దలు ఆచూతూచి అడుగులు వేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. కూటమిలోని భాగస్వామ్య పార్టీలతో తమ సీట్లకు ఎక్కడ ఎసరు వస్తుందేమోనని హస్తం ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. త్వరలో కూటమి లెక్క, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల టికెట్ల
వ్యవహారం ఓ కొలిక్కి రానుంది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: టికెట్ల ఖరారుపై జరుగుతున్న జాప్యం కాంగ్రెస్‌లో టెన్షన్ పుట్టిస్తోంది. నవంబర్ 1న అభ్యర్థులను ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ పరిణామం ఆశావహుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. సెప్టెంబర్ ఆరో తేదీన అసెంబ్లీని రద్దు చేసిన కొన్ని గంటల్లోనే టీఆర్‌ఎస్ అధిష్టానం అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. దీంతో కాంగ్రెస్ కూడా సాధ్యమైనంత త్వరగా అభ్యర్థులను ఖరారు చేస్తుందని అంతా భావించారు. దానికి తగ్గట్టుగా హడావుడి చేసిన ఆ పార్టీ.. మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు ప్రక్రియను కొలిక్కి తీసుకురాలేకపోయింది.
టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీల మడతపేచీతో హస్తం నేతల తలకు బొప్పి కట్టింది. పార్టీ విస్తృత ప్రయోజనాల దృష్టా కొన్ని సీట్లను వదులుకునేందుకు సిద్ధమైనా.. ఆ స్థానాలేమిటో ముందుగానే లీకైతే అసలుకే ఎసరు వస్తుందని ఆందోళన చెందుతోంది. మహాకూటమి సీట్ల సర్దుబాటు వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్న గులాబీ దళపతి కేసీఆర్ కూడా ఈ అవకాశాన్ని తనకు అనువుగా మలుచుకునే అవకాశముందని అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల ఖరారుపై తొందరపడకూదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. భాగస్వామ్య పక్షాలు కూడా బలహీనపడకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు అధికారపార్టీ వలకు చిక్కకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
ఓవర్ టు ఢిల్లీ!
ఒకవైపు మహాకూటమిలో సీట్ల పంపకంపై తకరారు జరుగుతుండగా.. మరోవైపు కాంగ్రెస్ రేసు గుర్రాలు హస్తిన బాట పట్టాయి. అభ్యర్థుల ఎంపికపై హైదరాబాద్‌లో ఆ పార్టీ స్క్రీనింగ్ కమిటీ తొలి దశ కసరత్తు పూర్తి చేసి.. షార్ట్ లిస్ట్‌ను తయారు చేసింది. తుది జాబితాలో తమ పేరు ఉండేందుకు సర్వశక్తులొడ్డుతున్న ఆశావహులు ఏఐసీసీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. నాలుగైదు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన ఔత్సాహికులు గురువారం నుంచి తిరుగుముఖం పట్టారు. భక్తచరణ్‌దాస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ సభ్యులు హైదరాబాద్‌కు తిరిగి రావడంతో ఆగమేఘాల మీద వెనుదిరిగారు. అ
భ్యర్థుల ఎంపికపై చివరిసారిగా కసరత్తు చేస్తున్న ఆ కమిటీ.. తుది జాబితాను రెండు రోజుల్లో కాంగ్రెస్ అధినాయకత్వానికి అందజేయనుంది. ఆ తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అభ్యర్థుల ఖరారుకు పచ్చజెండా ఊపుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే, అభ్యర్థుల ఎంపికపై సొంతపార్టీలో ఇంత తతంగం జరుగుతుండగా.. టీడీపీ, టీజేఎస్ పొత్తు తమ సీట్లకు ఎక్కడ ఎసరు తెస్తుందోననే గుబులు కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా టీడీపీ కోరుతున్న శేరిలింగంపల్లి, ఉప్పల్, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్.. టీజేఎస్ ప్రతిపాదిస్తున్న మల్కాజిగిరి, తాండూరు నియోజకవర్గాల్లోని ఆశావహులను ఆందోళనకు గురిచేస్తోంది. త్వరలో టికెట్ల వ్యవహారమంతా ఓ కొలిక్కి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment