సాక్షిప్రతినిధి, ఖమ్మం: మహాకూటమి సీట్ల వ్యవహారంపై టీడీపీలో అయోమయం నెలకొంది. భాగస్వామ్య పక్షాల మధ్య పంపకాల లెక్క తేలకపోవడం ఆ పార్టీ నేతల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టగా.. టీడీపీలో మాత్రం స్తబ్దత నెలకొంది. జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం టీడీపీకి సిట్టింగ్ స్థానం కావడంతో అక్కడి నుంచి కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్ మద్దతుతో టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య బరిలో నిలవడం ఖాయమైంది. ఇక జిల్లాలోని మరికొన్ని స్థానాల్లో పోటీ చేయాలని ఉబలాటపడుతున్న టీడీపీకి మహాకూటమిలోని పొత్తులు పొసగకపోవడంతో కార్యకర్తలకు ఫలానా నియోజకవర్గంలో మేమే పోటీ చేస్తామని స్పష్టత ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మూడు స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్న టీడీపీ ఈ మేరకు మహాకూటమికి జిల్లా నుంచి పోటీ చేసే స్థానాల జాబితాను అందజేసింది. సత్తుపల్లితోపాటు ఖమ్మం, అశ్వారావుపేట నియోజకవర్గాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కేటాయించాలని, కొత్తగూడెం లేదా పినపాక నియోజకవర్గంలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ పార్టీ కూటమి సమన్వయ కమిటీకి వివరించింది. అయితే సత్తుపల్లి ఇప్పటికే మహాకూటమి తరఫున టీడీపీకి ఖరారైనట్లేనని కూటమిలోని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సత్తుపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఆశించిన మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ తాజాగా జనరల్ స్థానమైన పాలేరు నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పట్టుపడుతుండడంతో సత్తుపల్లిలో టీడీపీ పోటీ చేయడం ఖాయమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
‘పేట’ను కోరుతున్న టీడీపీ
అశ్వారావుపేటలో గత ఎన్నికల్లో తాము రెండో స్థానంలో నిలిచామని, గెలుపు అంచుల దాకా వెళ్లిన కారణంగా అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని టీడీపీ బలంగా కోరుతోంది. అశ్వారావుపేటలో గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నుంచి తాటి వెంకటేశ్వర్లు గెలుపొందారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో ఆయన టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తాటిపై టీడీపీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు స్వల్ప తేడాతో ఓటమి చెందిన కారణంగా ఈసారి విజయం సాధించే అవకాశం ఉందన్న ధీమాతో అశ్వారావుపేట స్థానం కోసం బలంగా పట్టుపడుతోంది. ఇక కాంగ్రెస్, టీడీపీలకు చెందిన సీనియర్ నేతలు ప్రధానంగా దృష్టి సారించిన ఖమ్మం నియోజకవర్గంపై ఏర్పడిన పీటముడి ఇప్పటికిప్పుడు తేలేలా లేదన్నది కూటమి భాగస్వామ్య పక్షాల భావన. సంప్రదాయ ఓటుతోపాటు కాంగ్రెస్ ఖమ్మంలో అనేకసార్లు గెలుపొందడం, గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నుంచి పువ్వాడ అజయ్‌కుమార్ విజయం సాధించడం వంటి కారణాలతో ఈ సీటు నుంచి తామే పోటీ చేస్తామని కాంగ్రెస్ పట్టుపడుతోంది.
ఇందుకోసం జిల్లాకు చెందిన నేతలు కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, పోట్ల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకిషోర్ తదితరులు కాంగ్రెస్ టికెట్ కోసం హోరాహోరీ పోరు సలుపుతున్నారు. అయితే ఇదే నియోజకవర్గంపై ఈసారి టీడీపీ కన్నేసింది. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు గెలుపొందారు. అంతకుముందు జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఖమ్మంలో టీడీపీ విజయం సాధించలేదు. అయితే మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా ఖమ్మం నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు బరిలోకి దిగుతారనే ప్రచారం పార్టీ వర్గాల్లో హోరెత్తుతోంది. అయితే కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావహులు ఇప్పటికే కదనరంగంలోకి దిగితే.. నామా మాత్రం పోటీపై తన అంతరంగం తెలియనీయకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. టీడీపీలో కీలక నేతగా ఉన్న నామాను ఖమ్మం నుంచి పోటీ చేయించేందుకు పార్టీ మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఏటికి ఎదురీదాల్సిన పరిస్థితి..
జిల్లాలో 2014 శాసనసభ ఎన్నికల తర్వాత నెలకొన్న రాజకీయ పరిణామాలు, ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఖమ్మం నుంచి పోటీ చేసి ఓటమి చెందిన తుమ్మల నాగేశ్వరరావు అదే ఏడాది సెప్టెంబర్‌లో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పలువురు రాష్ట్ర, జిల్లాస్థాయి ప్రజాప్రతినిధులతోపాటు పలు మండలాల టీడీపీ ముఖ్య నేతలు గులాబీ గూటికి చేరారు. దీంతో జిల్లాలో టీడీపీ రాజకీయంగా ఏటికి ఎదురీదాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ పార్టీ రాజకీయ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాస్థాయి ప్రజాప్రతినిధులే కాకుండా ఆ పార్టీ నుంచి గెలుపొందిన ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, జెడ్పీ చైర్‌పర్సన్, సర్పంచ్‌లు, సహకార సంఘాల అధ్యక్షులు అనేక మంది దశలవారీగా టీఆర్‌ఎస్ గూటికి చేరడంతో జిల్లాలో టీడీపీ బలహీనపడినట్లయింది.
ఈ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తే అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలకు భరోసా కల్పించినట్లు అయ్యేదని, ఇప్పుడు కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉండడంతో టీడీపీ పోటీ చేయని నియోజకవర్గాల్లో పార్టీనే నమ్ముకున్న తమ పరిస్థితి ఏమిటంటూ ద్వితీయ శ్రేణి నేతలు, గతంలో పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేతలు అంతర్గత సమావేశాల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ ఎన్నికల పొత్తుతో ఉమ్మడి జిల్లాలో టీడీపీ పినపాక నియోజకవర్గం మినహా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసింది. అప్పుడు పోటీ చేసిన వారిలో మంత్రి తుమ్మలతో సహా నలుగురు అభ్యర్థులు పార్టీని వీడారు.
మిగిలిన ఐదుగురు అభ్యర్థుల్లో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు, అశ్వారావుపేట నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన మెచ్చా నాగేశ్వరరావుకు మాత్రమే అవకాశం ఉండే పరిస్థితి ఉండడంతో పార్టీ నేతల్లో తమ పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గత ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసిన మద్దినేని బేబి స్వర్ణకుమారి, కొత్తగూడెం నుంచి పోటీ చేసిన కోనేరు సత్యనారాయణకు ఈసారి పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదని పార్టీ వర్గాలే విశ్లేషిస్తున్నాయి.
ఇక భద్రాచలం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన ఫణీశ్వరమ్మ ఈసారి ఏపీ రాష్ట్రంలోని రంపచోడవరం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఒక దశలో నామా నాగేశ్వరరావు ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేశారని ప్రచారం జరగ్గా.. టీడీపీకి ఖమ్మం సీటు కేటాయిస్తే ఆయనే బరిలో ఉంటారని టీడీపీ వర్గాలు తాజా ప్రచారానికి తెరలేపాయి. టీడీపీ కోరుతున్న అశ్వారావుపేట సీటును ఆ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు వదులుకోవడానికి ససేమిరా అంటున్నారు. గత ఎన్నికలకు.. ఇప్పటికి రాజకీయంగా చాలా వ్యత్యాసం ఉందని, టీడీపీకి ఓటు బ్యాంకు గతంలోలా బలంగా లేదని, అనేక మంది ఇప్పటికే టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారని, కాంగ్రెస్‌కు ఈ సీటు కేటాయిస్తేనే విజయావకాశాలు ఉంటాయని కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న ఆశావహులు అధిష్టానానికి తమదైన రీతిలో లెక్కలు చెప్పి మరీ ఒప్పించే ప్రయత్నం చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment