ఖమ్మంమయూరిసెంటర్: ఉద్యమాల ఖిల్లా ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలు ప్రతీసా రి విలక్షణ తీర్పును ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రం అంతా ఒక రకమైన తీర్పు ఉంటే ఇక్కడ మరోవిధంగా ఉంటుంది.ఖమ్మం నియోజకవర్గం నుంచి గెలిచిన శాసనసభ్యుడు ప్రతీ సారి విపక్షంలోనే ఉంటూ వస్తున్నారు. కమ్యూనిస్టుల కంచుకోటగా పేరున్న జిల్లాలో కేంద్ర బిందువైన ఖమ్మం నియోజకవర్గం కీలకంగా ఉంటుంది.ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అనేకసార్లు ఉభ య కమ్యూనిస్టు పార్టీలకు చెందిన వారు గెలవడంతో విపక్షంలో ఉండటం అనివార్యమైంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వారు పలుమార్లు గెలిచినా.. అప్పుడు రాష్ట్రంలో వేరే ప్రభుత్వం రావడం గమ నార్హం. ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగ్గా..మొత్తం 15 మంది ఎన్నుకోబడ్డారు. (1952, 1957 ద్విసభ్య నియోజకవర్గంగా ఖమ్మం ఉంది. దీంతో ఇక్కడి నుంచి ఈ రెండు ఎన్నికల్లో నలుగురిని ఎన్నుకున్నారు) వీరిలో కమ్యూనిస్టులు, వారు బలపరిచిన అభ్యర్థులు మొత్తం 11 సార్లు గెలవడం విశేషం. ఇందులో పీడీఎఫ్, సీపీఐ కలిసి ఏడుసార్లు, సీపీఎం నాలుగుసార్లు, కాంగ్రెస్ నాలుగు సార్లు , టీడీపీ ఒక సారి విజయం సాధించాయి.
ప్రముఖులు గెలుపొందారు
రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖులుగా పిలిచే మంచికంటి రాంకిషన్‌రావు, ఎండీ రజబ్ అలీ, నల్లమల గిరిప్రసాద్, తమ్మినేని వీరభద్రం మొదలగు వారు ఇక్కడి నుంచి గెలిచారు. 1962 ఎన్నికల్లో సీపీఐకి చెందిన నల్లమల గిరిప్రసాద్ గెలిచారు. 1967 ఎన్నికల్లో సీపీఎంకు చెందిన ఎండీ రజబ్ అలీ గెలిచారు. 1972 ఎన్నికల్లో సీపీఐ నుంచి పోటీ చేసిన ఎండీ రజబ్ అలీ తిరిగి గెలుపొందారు. 1978 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కీసర అనంతారెడ్డి గెలుపొందగా అప్పుడు మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉంది. అనంతరం 1983, 1985లో సీపీఎంకు చెందిన మంచికంటి రాంకిషన్‌రావు గెలిచినా అప్పుడు కాంగ్రెసేతర ప్రభుత్వం టీడీపీ అధికారంలోకి వచ్చింది. 1989, 1994లో జరిగిన ఎన్నికల్లో సీపీఐకి చెందిన పువ్వాడ నాగేశ్వరరావు గెలిచాడు. 1989లో కాంగ్రెస్ ప్రభుత్వం, 1994లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
ఖమ్మంలో కాంగ్రెస్..రాష్ట్రంలో టీడీపీ
1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి యూనిస్ సుల్తాన్ గెలిచినా అప్పుడు తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో సుల్తాన్ కూడా విపక్షంలోనే ఉండిపోయాడు. అనంతరం2004 ఎన్నికల్లో రాష్ట్రం అంతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనం చాటినా ఇక్కడ మాత్రం సీపీఎం నుంచి పోటీచేసిన తమ్మినేని వీరభద్రం గెలిచాడు.
ఖమ్మంలో టీడీపీ.. రాష్ట్రంలో కాంగ్రెస్
మరోసారి వైఎస్ రాజశేఖరరెడ్డికి పట్టం కట్టిన 2009 ఎన్నికల్లో ఖమ్మంలో టీడీపీ నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు గెలిచారు. తెలంగా ణ రాష్ట్రం ఆవిర్భావం సందర్భంగా ప్రతిష్టాత్మకం గా జరిగిన 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ గెలిచారు. 2014లో తెలంగాణ నూతన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రసమితి రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టింది. అనంతరం జరిగిన రాజకీయ పరి ణామా ల్లో అజయ్ టీఆర్‌ఎస్‌లో చేరారు.
ఇల్లెందు నియోజకవర్గంలో..
ఇల్లెందు: ఇల్లెందు నియోజకవర్గం ఎస్టీగా అవతరించిన తర్వాత ఇప్పటివరకు 9 దఫాలు ఎన్నికలు జరిగాయి. నలుగురు అభ్యర్థులే గెలుపొందారు. వారంతా విపక్షం వారే. 1978 నుంచి 2014 వరకు జరిగి న ఎన్నికల్లో ఒక దఫా చాపల యర్రయ్య, ఐదు దఫాలు గుమ్మడి నర్సయ్య, రెండు దఫాలు ఊకె అబ్బయ్య, 2014లో కోరం కనకయ్య గెలుపొందారు. 1978లో చాపల ఎర్రయ్య (ఎంఎల్) గెలుపొందారు. గుమ్మడి నర్సయ్య 1983,1985, 1989, 1999, 2004లో గెలిచారు. ఎన్డీ అభ్యర్థి కావడంతో విపక్షంలోనే ఉన్నారు. 1994 ఊకె అబ్బయ్య సీసీఐ నుంచి గెలిచారు. అప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2009లో టీడీపీ నుంచి గెలిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2014లో కోరం కనకయ్య(కాంగ్రెస్) గెలుపొందగా, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలో ఉంది. దీంతో ఆయన అధికార టీఆర్‌ఎస్‌లో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment