సాక్షి, కొత్తగూడెం: అసెంబ్లీ రద్దయి నేటికి 50 రోజులైనా కాంగ్రెస్ కూటమిలో సీట్ల సర్దుబాట్లు, టికెట్ల కేటాయింపు ఓ కొలిక్కి రాలేదు. దీంతో ఆయా పార్టీలకు చెందిన ఆశావహులు ఎడతెరిపి లేకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. జిల్లాలోని అశ్వారావుపేట, కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే విషయంపై ఇప్పటికీ కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ మధ్య స్పష్టత రాలేదు. తమకే టికెట్ వస్తుందంటూ ఆయా పార్టీల నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ.. అంతర్గతంగా మాత్రం తీవ్ర టెన్షన్‌కు లోనవుతున్నారు. ఇల్లెందు, భద్రాచలం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లు ఆశించే వారి మధ్యనే గట్టి పోటీ నెలకొంది. అశ్వారావుపేట, పినపాక, కొత్తగూడెం నియోజకవర్గాల్లో కూటమిలోని మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఇక జిల్లాలో ఏకైక జనరల్ స్థానమైన కొత్తగూడెం సీటు కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు తనకు చివరి అవకాశంగా తీవ్రంగా యత్నిస్తున్నారు.
మరోవైపు రేణుకాచౌదరి ఆశీస్సులతో టీపీసీసీ సభ్యుడు ఎడవల్లి కృష్ణ గట్టి ప్రయత్నం చేస్తున్నారు. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన ఎడవల్లి కృష్ణకు భారీగా ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి 23 వేలకు పైగా ఓట్లు సాధించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాగా, పొత్తులో ఈ సీటు తమకే ఇవ్వాలని సీపీఐ గట్టిగా పట్టుబడుతోంది. మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ(చిన్ని) సైతం కొత్తగూడెం సీటు కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. నేరుగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చిన్నికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్, సీపీఐలను కోరుతున్నారు. దీంతో ఈ సీటుపై ఉత్కంఠ మరింతగా పెరిగింది.
అన్నిచోట్లా అదే పరిస్థితి..
మిగితా స్థానాల్లోనూ ఎవరికి ఎక్కట టికెట్ వస్తుందనే విషయంలో ఏ పార్టీకీ స్పష్టత లేదు. అశ్వారావుపేట టికెట్ కోసం కాంగ్రెస్ నుంచి సున్నం నాగమణి, బాణోత్ పద్మావతి, కోలా కృష్ణమోహన్, కారం శ్రీరాములు పోటీ పడుతుండగా, టీడీపీ మాత్రం ఈ సీటు తమకే వస్తుందని.. మెచ్చా నాగేశ్వరరావు పోటీలో ఉంటారని చెపుతోంది. దీంతో ఈ సీటుపై ఇప్పటివరకు సందిగ్ధం వీడలేదు. పినపాకలో కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందనే ధీమాతో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఇప్పటికే ఒక విడత ప్రచారం పూర్తి చేశారు. అయితే ఈ సీటు కోసం బాణోత్ అశోక్ అనే ఎన్‌ఆర్‌ఐ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ కొత్తగూడెం సీటు సీపీఐకి రాకపోతే పినపాక స్థానం ఆ పార్టీకి కేటాయించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడ కూడా స్పష్టత రాలేదు.
ఇల్లెందు నుంచి కాంగ్రెస్ పోటీ చేయడం ఖాయమైనప్పటికీ ఇక్కడ 31 మంది టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ప్రధానంగా చీమల వెంకటేశ్వర్లు, ఊకె అబ్బయ్య, హరిప్రియ, దళ్‌సింగ్‌నాయక్, డాక్టర్ రామచంద్రునాయక్, మంగీలాల్‌నాయక్ రేసులో ఉన్నారు. ఊకె అబ్బయ్య కొత్తగా పార్టీలో చేరడంతో ఇక్కడ కాంగ్రెస్ మరో సర్వే చేయించింది. భద్రాచలం నియోజకవర్గం నుంచి కారం కృష్ణమోహన్, కృష్ణబాబు, కుర్స వెంకటేశ్వర్లు పోటీ పడుతుండగా, ములుగు మాజీ ఎమ్మెల్యే దనసరి అనసూయ(సీతక్క)ను ఇక్కడ నుంచి పోటీ చేయించేందుకు కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఈ సీటుపై సైతం పూర్తి క్లారిటీ లేకుండా పోయింది.
ప్రత్యర్థులెవరోనని
టీఆర్‌ఎస్ ఎదురుచూపులు..
గత 50 రోజలుగా ప్రచారం చేస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులు తమకు ప్రధాన ప్రత్యర్థులుగా ఎవరు వస్తారో అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఒక విడత ప్రచారం పూర్తి చేసుకుని రెండో విడతలో అడుగు పెట్టినప్పటికీ.. ప్రధాన ప్రత్యర్థిని బట్టి జయాపజయాలు ఆధారపడి ఉంటాయని వారు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment