సాక్షి, కొత్తగూడెం: నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరుకోవడంతో రాజకీయం మరింత వేడెక్కింది. టీఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థులైన కాంగ్రెస్ కూటమి అభ్యర్థులను ప్రకటించడంతో పోరు షురూ అయింది. కాంగ్రెస్ కూటమి జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు మూడు విడతలుగా అభ్యర్థులను ప్రకటించింది. అయితే పినపాక మినహా మిగిలిన నియోజకవర్గాల్లో అసంతృప్తులు భగ్గుమంటున్నారు. ముఖ్యంగా ఇల్లెందు నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ కోసం ఏకంగా 31 మంది దరఖాస్తు చేసుకున్నారు. తీవ్రమైన పోటీ నేపథ్యంలో తుదివరకు పార్టీ నాయకత్వం అభ్యర్థి ప్రకటనను పెండింగ్‌లో పెట్టి.. తాజాగా శనివారం హరిప్రియ పేరు ప్రకటించింది. దీంతో మిగిలిన ముఖ్యమైన నాయకులతో పాటు వారి అనుచరుల్లో అసంతృప్తి మొదలైంది. పార్టీని నమ్ముకుని మొదటి నుంచీ పనిచేస్తున్న చీమల వెంకటేశ్వర్లుకు టికెట్ రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీఆర్‌ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్‌లో చేరి అనూహ్యంగా టికెట్ రేసులోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య.. తనకు అవకాశం దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అబ్బయ్యకు నియోజకవర్గ వ్యాప్తంగా అనుచరులు ఎక్కువగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థిపై ఈ ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుప్తోంది. మరోవైపు టికెట్ ఆశించి భంగపడిన ఇద్దరు ఆశావహులు మరో జాతీయ పార్టీ నుంచి టికెట్ సాధించేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
‘పేట’లోనూ ఆగ్రహ జ్వాలలు...
అశ్వారావుపేట నియోజకవర్గం పొత్తుల్లో భాగంగా టీడీపీకి కేటాయించడంతో అక్కడి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇప్పటికే అక్కడ టీపీసీసీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి సున్నం నాగమణి నామినేషన్ దాఖలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ అభ్యర్థికి సహకరించేది లేదని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ములకలపల్లి మండలంలోని గుట్టగూడెంలో సున్నం నాగమణి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని ఐదు మండలాల నాయకులు హాజరయ్యారు. సున్నం నాగమణి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే మద్దతు ఇస్తామని అన్ని మండలాల నాయకులు తెలిపారు. టీడీపీకి ఏ మాత్రం బలం లేకున్నా ఈ టికెట్ ఎలా కేటాయిస్తారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ అభ్యర్థికి గడ్డు పరిస్థితే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
- భద్రాచలం కాంగ్రెస్ టికెట్ కోసం నలుగురు దరఖాస్తు చేసుకున్నారు. అందరూ కొత్తవారే అయినప్పటికీ నియోజకవర్గానికి చెందిన వారు కావడంతో స్థానిక నాయకులు మద్దతు పలికారు. అయితే అనూహ్యంగా ఇక్కడ స్థానికేతరుడైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు టికెట్ ఇచ్చారు. దీంతో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తల్లో నిరుత్సాహం ఆవరించింది.
- వైరా నియోజకవర్గం పరిధిలోని జూలూరుపాడు మండలంలో రాజకీయం రసవత్తరంగా ఉంది. ఈ టికెట్‌ను సీపీఐకి కేటాయించడంతో కాంగ్రెస్‌లో అసమ్మతి తలెత్తింది. మరోవైపు సీపీఐలోనూ అసమ్మతి లేచింది. ఆ పార్టీ రెబల్ అభ్యర్థిగా బాణోత్ లాల్‌సింగ్ నామినేషన్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కాగా, ఈ స్థానాన్ని సీపీఐకి కేటాయించడాన్ని నిరసిస్తూ టీపీసీసీ సభ్యుడు లకావత్ గిరిబాబు పార్టీకి రాజీనామా చేశారు. మరో కాంగ్రెస్ నాయకుడు లావుడ్యా రాములు నాయక్ ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేయనున్నారు. జూలూరుపాడు మండలంలోని ఎల్లంకి గార్డెన్స్‌లో నిర్వహించిన సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని పార్టీలకు చెందిన అసమ్మతి నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రాములు నాయక్‌కు మద్దతు ఇస్తామని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment