ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు ఆందోళన చేస్తున్న మొవ్వ సత్యనారాయణ అనుచరులు
సాక్షి,సిటీబ్యూరో: మహా కూటమిలో అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి. కూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, టీడీపీలు ప్రకటించిన మొదటి జాబితాలో అవకాశం దక్కని అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఏకంగా కొందరు నిరసనలు, అందోళనలకు దిగుతుండగా, ఇంకొందరు తిరుగుబాటు బావుటా ఎగరవేసేందుకు సిద్ధమవుతున్నారు. కూటమి పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారంపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌లో సిట్టింగ్ స్థానమైన శేరిలింగంపల్లిని టీడీపీకి ఇవ్వడాన్ని తాజా మాజీ ఎమ్మెల్యే జీర్ణించుకోలేకపోతున్నారు. అదేవిధంగా ముషీరాబాద్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్‌కు సర్దుబాటు చేయడం టీడీపీకి మింగుడు పడడంలేదు. ఇదిలాఉండగా కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, అందులో కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాలకు, టీడీపీ మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన స్థానాలకు అభ్యర్థిత్వాలు ఖారారు చేయాల్సి ఉంది. కూటమి సీట్ల సర్దుబాటులో తెలంగాణ జనసమితి కూడా ఒకటి రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం కూడా ఉంది.
శేరిలింగంపల్లిపై శ్రేణుల లొల్లి
ఈ నియోజకవర్గాన్ని టీడీపీ కేటాయించడంపై కాంగ్రెస్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సిట్టింగ్ స్థానమైన శేరిలింగంపల్లిని టీడీపీకి కేటాయించవద్దని ఇప్పటికే గాంధీభవన్ ముందు కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. ఇందుకోసం కార్యకర్తలు ఏకంగా ఆత్మహత్యాయత్నాలకు సైతం సిద్ధమయ్యారు. అయినప్పటకీ కూటమి సీట్ల సర్దుబాటులో టీడీపీ కోటా కింద కాంగ్రెస్ వదులుకోక తప్పలేదు. టీడీపీ తన మొదటి జాబితాలో శేరిలింగంపల్లి స్థానానికి తన అభ్యర్థిని ప్రకటించింది. ఇదీ కాంగ్రెస్‌కు మింగుడుపడని అంశంగా మారింది. ఈ స్థానంపై అధిష్టానం పునరాలోచించాలని, తనకు సీటు కేటాయించకపోతే స్వతంత్రంగా బరిలోకి దిగుతానని తాజా మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ ప్రకటించారు. మంగళవారం తన నివాసంలో అనుచరులతో సమావేశమై కార్యాచరణపై సమాలోచనలు సైతం చేశారు. ఈ సీటు విషయంలో టీడీపీలో కూడా అసంతృప్తి రగులుతోంది. ఇక్కడ మొదటి నుంచి ఇద్దరు అభ్యర్థులు టికెట్ కోసం పొటీపడుతున్నారు. అందులో ఒకరు పారిశ్రామికవేత్త వెనిగళ్ల ఆనంద్ ప్రసాద్ కాగా.. మరొకరు మొవ్వ సత్యనారాయణ. అయితే, ఆ పార్టీ మాత్రం తమ అభ్యర్థిగా వెనిగళ్ల ఆనంద్ ప్రసాద్‌ను ఖరారు చేయడం ఇక్కడి టీడీపీ శ్రేణులకు మింగుడుపడడం లేదు. స్థానికేతరుడైన ఆనంద్‌కు టికెట్ కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ టీడీపీ సీనియర్ నాయకుడు మొవ్వ సత్యనారాయణ తనకు అవకాశం ఇవ్వకపోవడంపై అధిష్టానంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ఎస్‌టీఆర్ ట్రస్ట్‌భవన్ వద్ద ధర్నా చేసి స్థానికేతరులకు టికెట్ ఇస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. అధిష్టానం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయకతప్పదని ‘మొవ్వ’ ప్రకటించారు.
ముషీరాబాద్‌లోనూ అదే తీరు..
ఈ అసెంబ్లీ స్థానం విషయంపై ఇరు పార్టీల్లో ముసలం మొదలైంది. కాంగ్రెస్‌లో అసమ్మతి, టీడీపీలో అసంతృప్తి సెగలు కక్కుతోంది. కాంగ్రెస్ పార్టీలో స్థానికేతరుడైన అభ్యర్థికి ఖరారు చేయడం స్థానిక నేతలకు మింగుడు పడడం లేదు. టికెట్ ఆశించి భంగపడ్డ నగేష్ ముదిరాజ్ తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. మరోవైపు కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్‌కు వదులుకోవడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. ఎంతోకాలంగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న టీడీపీ జిల్లా పార్టీ అద్యక్షుడు ఎమ్మెన్ శ్రీనివాస్‌కు సైతం మొండి చేయి చూపించారు. దీంతో ఇక్కడి కార్యకర్తలు మంగళవారం నగర టీడీపీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. చంద్రబాబు నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, ఇతర నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్యాడర్ ఒత్తిడి మేరకు ఎమ్మెన్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.
కంటోన్మెంట్‌లో అసమ్మతి
ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌లో అసమ్మతి చెల రేగింది. కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ బంధువైన కాంగ్రెస్ అధికార ప్రతినిధి క్రిశాంక్ టికెట్ ఆశించి భంగపడ్డారు. తనకు అవకాశం ఇవ్వకపోవడంతో సర్వేపై రెబల్‌గా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మరో అశావహుడు టీపీసీసీ కార్యదర్శి గణేష్ సైతం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘సర్వే’కు టికెట్ ఇవ్వడాన్ని గణేష్ అభిమానులు, పలువురు కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. పికెట్ చౌరస్తా వద్ద మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసనను తెలియజేశారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పోస్టర్లను సైతం తగలబెట్టారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు గణేశ్ ప్రకటించారు.
టీఆర్‌ఎస్‌లోనూ ‘దానం’ కిరికిరి
టికెట్ల ప్రకటనకు ముందే ఖైరతాబాద్‌లో ఆందోళన తారస్థాయికి చేరింది. ఈ స్థానాన్ని తనకే కేటాయించాలన్న డిమాండ్‌తో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు టీఆర్‌ఎస్ కార్యాలయం నిర్వహించిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు, కార్యకర్తల మధ్య జరిగిన తోపులాటలో గోవర్ధన్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. దీంతో ఓ కార్యకర్త తలపై బండరాయితో మోదుకున్నాడు. దీంతో మరింత కోపోద్రిక్తులైన కార్యకర్తలు ఖైరతాబాద్ సర్కిల్‌లో సెల్‌ఫోన్ టవర్ ఎక్కి ఆందోళన కొనసాగించారు. మంగళవారం రాత్రి వరకు కూడా గోవర్ధన్‌రెడ్డిని ఐసీయూలోనే ఉంచి వైద్యం అందించారు.
స్వతంత్రంగా పోటీకి ‘ఎమ్మెన్’ సిద్ధం
సాక్షి,సిటీబ్యూరో: టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పడినప్పటికీ ఈసారి ముషీరాబాద్ టిక్కెట్ తమ పార్టీకే దక్కుతుందనుకున్న స్థానిక టీడీపీ నేతల అంచనాలు తల్లకిందులయ్యాయి. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాననే ఆశతో ఎంతో కాలంగా ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెన్ శ్రీనివాసరావుకు చుక్కెదురైంది. పంపకాల్లో ముషీరాబాద్‌ను కాంగ్రెస్‌కు కేటాయించడంతో నియోజకవర్గంలోని డివిజన్ల నేతలు, కార్యకర్తలు, జిల్లా నేతలు పార్టీ కార్యాలయంపై తమ ప్రతాపం చూపాలనే ఆలోచనలు చేసినప్పటికీ ఎమ్మెన్ వారించినట్లు తెలిసింది. నాలుగు రోజులు వేచిచూసి, అప్పటికీ పార్టీ తన విషయంలో సరైన నిర్ణయం తీసుకోకుంటే సోమవారం ‘స్వతంత్ర’ అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని తన వర్గానికి నచ్చజెప్పారు. అందుకు తగ్గట్టు పార్టీ శ్రేణులు బూత్, డివిజన్ల వారీగా తమ ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. నగరంలో ఏపార్టీకి లేనిది తమకు 300 బూత్ కమిటీలు తమకున్నాయని, క్యాడర్ బలంగా ఉన్నా టీడీపీకి టికెట్ రాకపోవడం దారుణమని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment