హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు రెబెల్స్ బెడద అతి పెద్ద తలనొప్పిగా మారింది. రాష్ట్రంలో నియోజకవర్గాలు చిన్నవి. గెలుపు మార్జిన్‌లు కూడా తక్కువే. దీంతో ప్రతీ ఓటు కీలకమే. అందుకే ఎప్పుడు ఎన్నికలు జరిగినా పార్టీల గెలుపోటముల్ని నిర్దేశించే స్థాయిలో రెబెల్స్ ఉంటున్నారు.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో బీజేపీ, కాంగ్రెస్‌లు రెబెల్స్‌ను ఎదుర్కోవడానికి తమ సర్వశక్తుల్ని ధారపోయాల్సి వస్తోంది. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో చాలా స్థానాల్లో రెబెల్ అభ్యర్థుల్ని బుజ్జగించి నామినేషన్ వెనక్కి తీసుకోవడానికి రెండు పార్టీల అగ్రనాయకత్వం చాలా కృషి చేసింది. మాట వినని కొందరు నాయకుల్ని పార్టీ నుంచి బహిష్కరించింది. అయినప్పటికీ చాలా స్థానాల్లో రెబెల్స్ తమ ప్రతాపాన్ని చూపిస్తామని సవాల్ చేస్తున్నారు.
ఇరు పార్టీలకూ డేంజర్‌బెల్స్
ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ గడువు అక్టోబర్ 29న ముగిసిన తర్వాత కాంగ్రెస్‌కు 12 స్థానాల్లోనూ, బీజేపీకి 20 స్థానాల్లోనూ రెబెల్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు. పచ్చడ్, అన్ని, థియోగ్, సులాహ్, చౌపల్, హమీర్‌పూర్, అర్కి స్థానాల్లో కాంగ్రెస్‌కు రెబెల్స్ ముప్పు పొంచి ఉంటే, బీజేపీకి మండి, బిలాస్‌పూర్, కాంగ్రా, ధర్మశాల, ఝాండూటా, చంబా, డెహ్రా, కులు, నలగఢ్, ఫతేపూర్, కిన్నూర్, అన్ని , సుందర్‌నగర్, నచన్, ఇండోరాలో రెబెల్స్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.
► అసెంబ్లీ స్పీకర్‌గా పని చేసిన గంగూరామ్ ముసాఫిర్ పచ్చడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి దయాల్ ప్యారీపై పోటీ పడుతూ కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బ తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి
► థేగ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు రెబెల్ నాయకులు విజయ్ పాల్ ఖాచి, ఇందు వర్మ కంటి అధికారిక అభ్యర్థి కుల్ దీప్ సింగ్ రాథోడ్‌కి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.
► హమీర్‌పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కి ఆశిష్ శర్మ, బీజేపీకి నరేష్ దార్జి తిరుగుబాటు అభ్యర్థులు గుండెల్లో దడ పుట్టిస్తున్నారు.
► కాంగ్రెస్ పార్టీ దివంగత నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ సొంత నియోజకవర్గం అర్కిలో ఆయనకు అత్యంత సన్నిహితుడైన రాజేందర్ ఠాకూర్‌కు టిక్కెట్ నిరాకరించడంతో ఆయన రెబెల్‌గా పోటీ పడుతున్నారు.
► బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించిన మాజీ ఎమ్మెల్యే తేజ్‌వంత్ సింగ్ నేగి (కిన్నూర్), మనోహర్ ధిమన్ (ఇండోరా), కిశోర్ లాల్ (అన్ని), ఎల్ ఠాకూర్ (నలగఢ్), కృపాల్ పర్మార్ (ఫతేపర్) ఇప్పుడు రెబెల్ అభ్యర్థుగా మారి ఎన్నికల్ని హీటెక్కిస్తున్నారు.
► కులులో రాచ కుటుంబానికి చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ సింగ్ కుమారుడు, హితేశ్వర్ సింగ్ రెబెల్ అభ్యర్థిగా పోటీపడుతున్నారు.
5% ఓట్లు రెబెల్స్‌కే..!
గత కొద్ది ఏళ్లుగా ఎన్నికల ఫలితాల తీరు తెన్నుల్ని పరిశీలిస్తే గెలిచిన పార్టీకి, ఓడిపోయిన పార్టీకి మధ్య 5% ఓటింగ్ తేడా కనిపిస్తుంది. దీనికి రెబెల్స్ ప్రధాన కారణం. పార్టీ గెలుపోటములను తమ గుప్పిట్లోకి తీసుకొని శాసించే స్థాయిలో రెబెల్స్ ఉండే ఏకైక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ కావడం విశేషం.
పార్టీ కంటే అభ్యర్థే కీలకం
హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 68 స్థానాలకు గాను చాలా నియోజకవర్గాల్లో వాతావరణం పరిస్థితులు అనుకూలంగా ఉండవు. దీంతో ఈ రాష్ట్రంలోని ఎన్నికల్లో పార్టీల కంటే అభ్యర్థే కీలకంగా ఉంటారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment