అభ్యర్థుల్ని కాదు. నన్ను చూసి ఓటెయ్యండి అంటూ ప్రధాని మోదీ చేసిన ప్రచారం, బీజేపీ జపించిన అభివృద్ధి మంత్రం, డబుల్ ఇంజిన్ సర్కార్ వ్యూహం, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్‌కున్న వ్యక్తిగత ఇమేజ్ ఇవేవీ హిమాచల్ ప్రదేశ్‌లో కమలదళాన్ని కాపాడలేకపోయాయి. స్థానికంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించడంలో అధికార బీజేపీ చూపిన అలసత్వమే ఆ పార్టీ కొంపముంచింది. సరిగ్గా వాటినే కాంగ్రెస్ ప్రచారాస్త్రాలుగా మలుచుకుంది.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి ఎక్కడికక్కడ మోదీకి కౌంటర్లు ఇవ్వడం కాంగ్రెస్‌కి కలిసొచ్చింది. కాంగ్రెస్ తన ప్రచారంలో పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ, అగ్నిపథ్ పథకం, నిరుద్యోగం, యాపిల్ రైతు సమస్యలు వంటివి లేవనెత్తుతూ వాటికి పరిష్కారాలను కూడా చూపించింది. రాష్ట్రంలో 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు కీలక ఓటు బ్యాంకుగా ఉన్నారు. వారంతా పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని ఆందోళనలు చేస్తూ ఉంటే బీజేపీ చూసీ చూడనట్టు వ్యవహరించడం ఆ పార్టీని గట్టి దెబ్బ తీసింది.
మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాత పెన్షన్ పునరుద్ధరణపైనే తొలి సంతకం పెడతానని హామీ ఇవ్వడంతో ఉద్యోగులంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపించారు. ఎగువ హిమాచల్ ప్రదేశ్‌లో అత్యంత కీలకమైన యాపిల్ లాబీ బీజేపీపై అసంతృప్తిగా ఉంది. యాపిల్ పళ్లను నిల్వ చేసే కారా్టన్లపై జీఎస్టీ పెంపు, అదానీ గ్రూప్‌కి తక్కువ ధరకే యాపిల్స్‌ను అమ్ముకోవాల్సి రావడం వంటివి ప్రభుత్వ వ్యతిరేకతని పెంచాయి.
చదవండి: (బీజేపీ రికార్డు విజయం వెనక.. ముచ్చటగా మూడు కారణాలు)
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్ పథకం కూడా మంచుకొండల్లో మంటల్ని రాజేయడం బీజేపీకి మైనస్‌గా మారింది. ఇండియన్ ఆర్మీలో హిమాచల్‌కు చెందిన 1.15 లక్షల మంది సేవలు అందిస్తూ ఉంటే మరో 1.30 లక్షల మంది రిటైర్డ్ అధికారులున్నారు. కాంట్రాక్ట్ పద్ధతుల్లో సైన్యంలో నియామకాలను తీవ్రంగా వ్యతిరేకించిన వీరంతా, ఈ పథకం రద్దుకు ప్రయత్నిస్తామన్న కాంగ్రెస్ వైపు తిరిగిపోయారు. నిరుద్యోగం, అధిక ధరలు కూడా ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలను దెబ్బ తీశాయి.
బీజేపీకి రెబెల్స్ గండి
బీజేపీ పరాజయానికి రెబెల్ అభ్యర్థులు, పార్టీలోని అంతర్గత పోరు కూడా కారణమే. దాదాపుగా 12 స్థానాల్లో బీజేపీ అసమ్మతి నేతలు పోటీలోకి దిగి బీజేపీ ఓటు బ్యాంకును కొల్లగొట్టారు. విజయం సాధించిన ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు బీజేపీ రెబెల్సే. ఇక పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్‌కుమార్ ధుమాల్ మధ్య వర్గపోరు కూడా ఎన్నికల్లో ప్రభావం చూపించింది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment