టికెట్లు రాలేదని బరిలో నిలిచిన అసంతృప్తులు
ఐదుగురిని బహిష్కరించిన శివసేన (ఉద్ధవ్)
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామి నేషన్ ప్రక్రియ ముగిసింది. మహాయుతి, మహావికా స్ అఘాడీకి రెబల్స్ సవాలుగా మారారు. ఈ అసెంబ్లీ ఎన్నికలకు ఏకంగా 10,900 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 5,949 నామినేషన్లు ఆమోదం పొందగా, 1,649 తిరస్కరణకు గురయ్యాయి. మరో 3,302 మంది నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. నామినేషన్లను వాపసు తీసుకున్న వారిలో మహాయుతి, మహావికాస్ అఘాడీ తిరుగుబాటు నేతలు కూ డా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ఐదుగురు తిరుగుబాటు నేతలను పార్టీ నుంచి బహిష్కరించింది. నామినేషన్లను వెనక్కి తీసుకోకుంటే చర్యలు తప్పవని మహాయుతి పార్టీలు కూడా రెబల్స్‌ను హెచ్చరించాయి.
మహాయుతిలో తగ్గేదేలేదంటున్నారు..!
బీజేపీ మాజీ ఎంపీ హీనా గవిత్ నందుర్‌బార్ జిల్లాలోని అక్కల్‌కువా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ శివసేన షిండే వర్గానికి చెందిన అమ్షియా పద్వీ మహాయుతి అధికారిక అభ్యర్థిగా ఉన్నారు. అయితే గవిత్ బరిలో నిలవడం మహాయుతికి తలనొప్పిని పెంచింది. మాహిమ్‌లో ఎంఎన్‌ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రే నామినేషన్ వేశారు. అయితే, శివసేన షిండేకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే సదా శరవంకర్‌కూడా పోటీకి దిగారు.
ఇక్కడ అమిత్ ఠాక్రేకు మద్దతు ఇవ్వాలని బీజేపీ మిత్రపక్షాలను కోరుతోంది. నాసిక్‌లోనూ తిరుగుబాటును ఆపడంలో మహాయుతి విఫలమైంది. మహాయుతి అధికారిక అభ్యర్థులపై నంద్‌గావ్ నుంచి సమీర్ భుజ్‌బల్, దేవ్‌లాలీ నుంచి రాజశ్రీ అహిర్‌రావ్, చాంద్‌వాడ్ నుంచి కేదా అహెర్ పోటీలో ఉన్నారు. భివాండి రూరల్ స్థానంలో శివసేన అభ్యర్థి శాంతారామ్ మోరేపై బీజేపీ రూరల్ యూత్ అధ్యక్షురాలు స్నేహా పాటిల్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు.
పార్టీలు ఒత్తిడి చేసినప్పటికీ రెబల్స్ నామినేషన్ ఉపసంహరించుకోవడం లేదు. కల్యాణ్ ఈస్ట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా సులభ గణపత్ గైక్వాడ్‌ను ప్రకటించిన తర్వాత, శివసేనకు చెందిన మహేష్ గైక్వాడ్ రెబల్‌గా పోటీలో ఉన్నారు. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మందా మత్రేని బేలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా ప్రతిపాదించగా... ఇక్క స్వతంత్ర అభ్యర్థిగా శివసేనకు చెందిన విజయ్ నహతా రెబల్‌గా బరిలో ఉన్నారు. ఐరోలి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి గణేష్ నాయక్‌పై శివసేన షిండే వర్గానికి చెందిన విజయ్ చౌగులే నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదు.
శివాజీనగర్‌లో మహాయుతి అనుకోని సవాల్‌ను ఎదుర్కొంటోంది. ఎన్సీపీ (అజిత్ వర్గం) నవాబ్ మాలిక్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే, ఇక్కడ శివసేన(షిండే)కు చెందిన సురేష్ కృష్ణ పాటిల్‌ను కూటమి అధికారిక అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. దేవేంద్ర ఫడ్నవీస్, ఆశిష్ షెలార్ సహా పలువురు బీజేపీ నేతలు మాలిక్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తుండటం గమనార్హం.
ఎంవీఏలోనూ ఇదే తీరు
మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లోని చాలా మంది తిరుగుబాటు నాయకులు ఎన్నికలకు ముందు తమ నామినేషన్లను వాపసు తీసుకునేందుకు ససేమిరా అంటున్నారు. పుణేలో ముగ్గురు సీనియర్ కాంగ్రెస్ నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. శివాజీనగర్, పార్వతి స్థానాల్లో కాంగ్రెస్, కస్బాపేట్ స్థానంలో ఎన్సీపీ (ఎస్పీ) పోటీ చేస్తోంది. కొప్రి పచ్‌పాఖాడీలో కాంగ్రెస్ రెబల్స్ ఠాక్రే వర్గాన్ని ఎదుర్కొంటున్నారు. భివాండీ వెస్ట్‌లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి తన నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదు. కోప్రి పచ్‌పాఖాడీ అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై ఉద్ధవ్ ఠాక్రే బృందం కేదార్ దిఘేను నామినేట్ చేయగా... కాంగ్రెస్‌కు చెందిన మనోజ్ షిండే ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మరోవైపు భివాండీ వెస్ట్ స్థానం నుంచి దయానంద్ చోర్గేను కాంగ్రెస్ నిలపగా.. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రియాజ్ అజ్మీ స్వతంత్రునిగా నామినేషన్ వేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment