మల్లేసన్నా గీ దునియా మొత్తం కరాబయ్యిందే.. అంతా నమ్మక్ హరామ్‌లే..’ ఎంకటేసులు పొద్దుగాల్నే ఏందో మాట్లాడుతుండు. వాని ముచ్చట్లు నాకు కొత్తేం కాదుగాని.. ఉన్నట్లుండి ఎందుకంటుండె. ‘ఏందిరా పొద్దున్నే కతల్ చెబుతున్నవని.. అనడిగిన. ‘ఏం జెప్పాలె.. మొన్నటి దాంక మన పరమేసన్న ఎన్కాల తోకలెక్క తిర్గిండు గదా గా రమేసు. ఏమైందో దెల్వద్ గానీ.. నిన్న మరో కాండేటు కాడ దేలిండు. ఆన్ని జూసినంక నాకైతే బుర్ర గిరగిరా తిర్గిందన్కో..’ ఎంకటేసులు గిట్లంటుంటే నాకు నవ్వాగలె. పాపం గీడింక దునియా సూడలే. గీసారి ఎలచ్చన్ల కొత్తగ తిరుగుతుండు.
♦ గీ నాయకుల కతలే గిట్లుంటాయి. మా ఇంటికాడ ఓ పెద్దమనిసుండు. మంచిగ కద్దరు అంగీ పంచెతో కనిపించేటోడు. ఏడాది కింద ఓ పెద్ద పార్టీల చేరుకునిండు. రోజూ పేపర్ల టీవీల ఎదురు పార్టీ లీడర్లని తిట్టుడే తిట్టుడు. ఆ పార్టీవోల్లని గల్లీల కూడా రానియ్యలె. అనుచరులు గిదే దార్ల నడిసిండ్రు. ఎలచ్చన్ల పార్టీల టికెట్ రాలె. గంతె.. ఎవ్రికి సెప్పా పెట్టకుండ గప్‌చుప్‌గ ఎగస్ పార్టీల చేరిండు. బుజంపై గా పార్టీ కండువ పడిందో లెదో...ఎంటనే గా పార్టీ పెద్దతొ అలయ్ బలయ్‌ల హత్తుకునిండు. ఇంగ జూస్కొండి నిన్నదంక ఉండొచ్చిన పార్టీవోల్లపై ఎగిరెగిరి తిట్టిండు. గల్లీల మాకందరికీ ఆచ్చర్యమైంది. అరె గిదేందిర బై గీ పెద్దమనిసి నిన్నటి దాన్క ఆడుండె.. ఇప్పుడీడ దేలిండనుకున్నం. ఆ తిట్లు ఇని ‘...రాజకీయమంటె గిట్లుంటదా’ అనుకున్నం.
♦ మీకింకో ముచ్చట జెప్పాలె. గుంపుల్గట్టి ఎలచ్చన్ల పోటీ చేసేటోల్ల కత మరీ కతర్నాక్. నిన్నటి దాన్క దుష్మన్లని కొట్టుకున్నోల్లంత కల్సిపోతరు.. ఒకర్నొకరు ఆకాసానికెత్తుకుంటరు. అరె జనాలేమనుకుంటుండ్రన్నదే పట్టదు వాల్లకి. కత ఇంతట్తో ఆగదు. అడ్డొచ్చినోల్లని.. పరేశాన్ చేసేటోల్లని కలిపేసి.. ఆల్లు గుట్టు దోస్తానాలు.. దెల్సుకుండ్రు అంటూ మైకుల్లో అరుసుడే అరుసుడు. మరి పడ్డోడు ఊర్కుంటడ ఏంది? ఆయనా గిదే కత అందుకుంటడు. వీల్లు వాల్లని... వాల్లు వీల్లని.. గుట్టుగ జట్టుకట్టి గూడుపుటాని జేస్తుండ్రని అనుకుంటుండ్రు. ఏది సచ్.. ఏది జూట్ దెల్వక జనాలు తలపట్టుకుండ్రు.
♦ పోయిన్సారి ఎలచ్చన్ల కాంగ్రెస్‌ని తిట్టిపోసిన గా సైకిల్ సారు గీ ఎలచ్చన్ల.. దర్జాగా వాల్లతోనే జట్టు కట్టేసిండు. గిదేంది ఆల్లని దుష్మన్ అంటివి గాదె అనడిగితె.. అరె గట్ల గల్వకపోతె ఎట్ల? మనకి హోదా ఇవ్వలె మరి గుస్సా రాదె? గా కమలమోల్లతో కారాయన గుట్టుగ జట్టు కట్లేదా ఏంది? అని ఎదురు తిరిగిండు. గా గులాబీ బాసు ఈల్లందర్ని ఏకిబారేస్తుండు. మన సైకిల్ సారు కూటమోల్ల మీటింగ్‌ల జనసేన అని నోరు జారేసిండు. కొందరేమో లేద్లేదు.. గది నిజమే.. ఆయన మనసులో ఉన్నదె నోట్లో వచ్చినాది అంటుండ్రు. సివారకరికి గా కూటమోల్ల మీటింగ్‌ల గద్దరన్న కూసున్నడు. గంతే కాదు మీటింగ్ అయినంక తలదీస్కొని బోయి గా బాబు పొట్టల తల పెట్కుని.. మేరా దోస్తు అన్నడు. నిన్నటిదంక జాన్ దుష్మన్ గిప్పుడు దోస్తాన్నెట్లయిండో మల్ల. చూస్తిరా.. ఎవరు ఎవరి ఎన్కాల తిరుగుతుండ్రో.. ఎట్ల లింకులు గలుపుతుండ్రో. మనం మాత్రం ఆగం కావొద్దు.. దిమాక్ పెట్టాలె.. సరైనోల్లని గెలిపించాలె!! – రామదుర్గం మదుసూదనరావు
Comments
Please login to add a commentAdd a comment