హమ్మయ్య.. పోత్తుల లెక్కలు తేలాయ్‌.! | Congress Yet To Decide On Seat Sharing,Mahabubnagar | Sakshi
Sakshi News home page

హమ్మయ్య.. పోత్తుల లెక్కలు తేలాయ్‌.!

Published Fri, Nov 9 2018 8:53 AM | Last Updated on Fri, Nov 9 2018 8:59 AM

Congress Yet To Decide On Seat Sharing,Mahabubnagar - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌:  నెలరోజులుగా ఊరిస్తున్న మహాకూటమి పొత్తులు, కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలిచే అభ్యర్థుల లెక్కలు ఓ కొలిక్కి వచ్చాయి. రెండు రోజులుగా ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్‌ అధిష్టానం చేపట్టిన ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీ పలు చర్చల అనంతరం జాబితా ఒక రూపం సంతరించుకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూటమిలో భాగంగా టీడీపీకి మాత్రమే సీట్లు కేటాయించనున్నట్లు స్పష్టం చేసింది. టీడీపీకి ఒక్క స్థానంతో సరిపెట్టాలని భావించగా... ఆ పార్టీ మాత్రం మరో స్థానం కావాలని పట్టుబట్టింది. దీంతో చివరకు టీడీపీ కోరిన రెండు స్థానాలకు కాంగ్రెస్‌ పచ్చ జెండా ఊపింది. పొత్తులో భాగంగా టీడీపీకి మహబూబ్‌నగర్, మక్తల్‌ స్థానాలను కేటాయించింది. ఉమ్మడి జిల్లాలో మిగిలిన 12 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులే బరిలో నిలవనున్నారు. ఈ మేరకు బరిలో నిలిచే అభ్యర్థులకు సైతం అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా పలు నియోజకవర్గాల్లో ఉన్న ఆశావహులను ఢిల్లీకి పిలిపించి బుజ్జగించారు. మొత్తం మీద కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలిచే అభ్యర్థులను శనివారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 
 రేసు గుర్రాలకే టిక్కెట్లు 
కాంగ్రెస్‌ అధిష్టానం ముందస్తు ఎన్నికలను పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఓవైపు నామినేషన్లకు గడువు సమీపిస్తుండగా.. అభ్యర్థుల ప్రకటన విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో మాత్రం గెలుపు గుర్రాలనే బరిలో నిలపాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ప్రత్యేకంగా చేపట్టిన సర్వేలు, రిపోర్టుల ఆధారంగా వడపోత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని మొత్తం స్థానాల్లో ఎవరెవరు బరిలో ఉంటే గెలుపు సాధ్యమవుతుందనే లెక్కలు వేసుకుని సర్దుబాట్లు చేసింది. నియోజకవర్గాల్లో ముందు నుంచి పనిచేసుకుంటున్న వారు ఏ మేరకు ప్రభావితం చూపుతున్నారు... కేడర్‌ మనోభావాలు ఏమిటనే విషయాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఆ తర్వాత కూటమి మిత్రపక్షాలను కూడా సర్దుబాటు చేశారు.

 
ఆశావహులకు బుజ్జగింపులు 
ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన వారిని కాంగ్రెస్‌ ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీ రెండు రోజులుగా బుజ్జగిస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు నియోజకవర్గాలకు చెందిన నేతలకు ఏఐసీసీ నేతలు స్వయంగా ఫోన్లు చేసి ఢిల్లీకి పిలిపించారు. ఈ మేరకు మహబూబ్‌నగర్, దేవరకద్ర, మక్తల్, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్‌ నియోజకవర్గాలకు చెందిన నేతలను రప్పించుకున్నారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్, మక్తల్‌ నియోజకవర్గాలకు చెందిన నేతలకు మాత్రం పొత్తులో భాగంగా సీట్లను టీడీపీకి కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా మిత్రపక్షాలకు సహకారం అందించాలని, పార్టీ అధికారంలోకి వస్తే త్యాగానికి తగిన గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున అభ్యర్థిగా ఎవరు ఉన్నా సరే.. మిగతా వారు సహకరించాలని సూచించారు.  

మహబూబ్‌నగర్‌ నుంచి డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, నాయకులు ఎం.సురేందర్‌రెడ్డి, సంజీవ్‌ ముదిరాజ్, ఎన్‌.పీ.వెంకటేశ్, సయ్యద్‌ ఇబ్రహీం, బెక్కరి అనిత మధుసూదన్‌రెడ్డి హాజరయ్యారు. ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీ మాత్రం పొత్తులో భాగంగా మహబూబ్‌నగర్‌ స్థానాన్ని త్యాగం చేయాల్సి వస్తుందని స్పష్టం చేసింది. అయితే కాంగ్రెస్‌ నేతలు మాత్రం... ఉమ్మడి జిల్లా కేంద్రమైనందున ఇతర పక్షాలకు ఈ స్థానాన్ని కేటాయించొద్దని కోరారు. తమలో ఎవరికి టికెట్‌ ఇచ్చినా కలిసి కట్టుగా పనిచేస్తామని విన్నవించారు. కానీ అధిష్టానం మాత్రం టికెట్‌ విషయంలో మరే ఇతర ఆలోచన చేయవద్దని కుండబద్ధలు కొట్టినట్లు సమాచారం. ఫలితంగా ఇక్కడి నుంచి టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ బరిలో నిలవడం దాదాపు ఖాయమైంది. 

 దేవరకద్ర నియోజకవర్గం నుంచి ముగ్గురు నేతలకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న డోకూరు పవన్‌కుమార్, న్యాయవాది జి.మధుసూదన్‌రెడ్డి, మరోనేత కాటం ప్రదీప్‌కుమార్‌గౌడ్‌ను కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌లోకి పిలిపించి మాట్లాడారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి పోటీలో ఉంటారని, గెలిచే వారికే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. అయితే ముగ్గురిలో ఏ ఒక్కరికి టికెట్‌ ఇచ్చినా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అందుకు ముగ్గురు నేతలు సమ్మతి తెలిపారు.  
 మక్తల్‌ నుంచి జెడ్పీటీసీ సభ్యుడు శ్రీహరికి బుజ్జగింపులు చేశారు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించాల్సి వస్తోందని చెప్పారు. పార్టీ అదేశాల మేరకు మిత్రపక్షానికి మద్దతు ఇవ్వాలని సూచించారు. ఫలితంగా మక్తల్‌ నుంచి టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి బరిలో నిలవడం ఖాయ మైనట్లు తెలుస్తోంది. అలాగే నాగర్‌కర్నూల్‌కు చెందిన జెడ్పీటీసీ సభ్యురాలు కొండా మణెమ్మను సైతం సముదాయించారు. అక్కడ సీనియర్‌ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డికి టిక్కెట్టు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక కొల్లాపూర్‌ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన హర్షవర్ధన్‌రెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లే తెలుస్తోంది. ఇక్కడ నుంచి బరిలో దిగాలని భావిస్తున్న జగదీశ్వర్‌రావు ఇదే విషయం స్పష్టం చేసినట్లు సమాచారం.

 
వీరి అభ్యర్థిత్వాలకు పచ్చజెండా 
ఉమ్మడి జిల్లాలో తాజా మాజీలు ఉన్న అయిదు స్థానాలతో పాటు పలు నియోజకవర్గాల అభ్యర్థులకు కాంగ్రెస్‌ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గ ద్వాల నుంచి డీకే.అరుణ, కొడంగల్‌ నుంచి ఎనుముల రేవంత్‌రెడ్డి, నారాయణపేట నుంచి కుం భం శివకుమార్‌రెడ్డి, అలంపూర్‌ నుంచి ఎస్‌.ఏ.సంపత్‌కుమార్, వనపర్తి నుంచి జి.చిన్నారెడ్డి, నాగర్‌కర్నూల్‌ నుంచి నాగం జనార్దన్‌రెడ్డి, అచ్చం పేట నుంచి సీహెచ్‌.వంశీకృష్ణ, కొల్లాపూర్‌ నుంచి బీరం హర్షవర్ధన్‌రెడ్డి, కల్వకుర్తి నుంచి చల్లా వంశీచంద్‌రెడ్డి, జడ్చర్ల నుంచి మల్లు రవి, షాద్‌నగర్‌ నుంచి చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి అభ్యర్థిత్వాలకు ఆమోదం లభించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement