‘పోటోల్లు...ఎన్నుపోటోల్లు ఉంటరని దెల్సుగానీ... గీ కోవర్టోల్లు ఎవ్రు మల్లేశా...’కాకా అడిగిండు. అరె గంతమాత్రం దెల్వాదె...బరిసో...కత్తో పట్కుని పక్కకెల్లి పొడుస్తుండ్రేమో మల్ల అన్న. కాకాకి నా మాట నచ్చలె. అరే నువ్ సెప్పింది నాకు సమజవుత లేదు. గా ఎంగటేసుల్నే అడుగుత అనెల్లిపోయిండు. కాకా మాటలిన్నంక జర దిమాక్ పెట్టి ఆలోచిస్తూ కూచున్న. గింతలో గా ఎంకటేసులు వచ్చిండు. అరె తమ్మీ కోవర్టోల్లు అంట ఎవ్రె ఆల్లు అనడిగిన. ‘...అరె కత నీదంక వచ్చినాదె. మన పరమేశన్న నిన్ననే మీటింగ్ బెట్టి సెప్పిండు. పక్కపోట్టుగాల్లున్నరు జరంత జాగ్రత్తగ ఉండాలె. ఆల్లు సానా సైలెంటు గుంటరు... మనతానె ఉంటరు. గీల్లనే కోవర్టోల్లు అంటరు. ఎవ్రయిన ఉంటె జెప్పుండ్రి మాంచి గిప్టు ఇస్త అనికూడా సెప్పిండన్న‘ అన్నడు. ఓహో గదన్నమాట. ఎలచ్చన్ల యవ్వారమని దెల్సింది.
♦ అయిన గీరకం పోటుగాల్లు...గదే కోవర్టోల్లు ఎలచ్చన్లలోనే ఏం కర్మ. రోజు మన సుట్టుపక్కల తిరగాడ్తునే ఉంటరు గాదె. మా పక్కనే ఉంటరు. దోస్తులెక్క కనిపిస్తరు. మంచిగ మాటలు సెబ్తుంటరు. మనం గా మాటల్కి అయిసై ...ఆల్లేం సెబ్తే గంతేనని నమ్ముతం. ఇంగ జూస్కో అక్కడ్నుంచి ఆల్ల ఆట సురు అయితది. కల్లకి బట్టకట్టి సీదా దీస్కొని బోయి గుంతల పడేస్తరు. పడినంక ఆల్లే ‘అయ్యో గిట్లయ్యె ఏంది..’ అంటూ ఏడుస్తూ అంజాన్ కొడ్తుంటరు. ఇలాంటి నమ్మక్ హరామ్‌లు అంత త్వరగ బైట పడ్తారె? మా తమ్మి ఆపీసుల గిట్లనే అయిందంట. ఒకాయన ఆల్ల పైవోన్ని ఏందిబై గిట్ల సతాయిస్తుండు అని అంటే పక్కనున్నోడు దాన్ని పోన్ల రికార్డు జేసి గా ఆపీసరు సెవికాడ పెట్టిండంట! ఇంకేముంది...తిట్టినాయన్కి గా ఆపీసరు నరకం జూపిస్తుం డు! గట్ల రికార్డు జేసినోడు దొరకాలె... సంపి బొందల పెడ్త అంటూ పాపం ఆయన గిప్పట్కీ పండ్లు కొరుకుతునే ఉన్నడంట. రికార్డు జేసినడు సూడు ఆల్లనే పక్కపోటోల్లు...కోవర్టోల్లు అంటరు. మన తెలుగు రాజకీయాల్లో ఒక పెద్ద సారు గూడ గిట్లాంటి పనే జేసి కుర్చీ లాక్కుండని గిప్పటికీ అందరూ అంటరు. జరంత ఆలోచించుండ్రి మీకే సమజవుతది గా పెద్దమనిసి ఎవ్రో!
♦ గీ ఎలచ్చన్లలోనూ కోవర్టులోల్లు మస్తుగ ఉన్నరంట. నా పక్కల తమ్మీలున్నరు. గెట్లయిన గెలుస్ల అని అనుచరుల అండ జూస్కొని బరిలో దిగినోల్లు తలపట్కుంటుండ్రు. మనోడే గదా సీక్రెట్లు ...పోలింగు ప్లాన్లు చర్చిస్తే సాలు ...ఆ యవ్వారం ఎదురు పార్టీవోల్లు పక్కపోటుగాల్లకి పైసలిచ్చి లాగేస్తుండ్రంట. ఏదేనా కొత్తగ ప్లానేసి ఓట్లడుగుదామని ఆలోచిస్తె...గది వెంటనే ఎదుటోన్కి చేరిపోతది. ఆడు టక్కున జేసేస్తుండంట. ఒక కాండేటుకైతే పాపం పోలింగ్ ఏజెంటుని గూడ ఉంచకుండా పట్కుపోయిరంటె ఆలోచించుండ్రి. సిటీ పొలిమేర్ల ఓ పెద్దాయన ప్రత్యర్తుల శిబిరంలో ఇసయం కోసం ఏకంగా పదిలచ్చలు కోవర్టుకి ముట్టజెప్పిండంట. గిట్ల సాపకింద నీరులెక్క ముంచేస్తుంటే కాండేట్లు ఎర్రిమొగాలేస్తుండ్రు. నమ్మినోల్లని ముంచడం పక్కపోటుగాల్ల లచ్చనం అయినంక ఇంగ జేసుడేముంది..అద్రుస్టం ఓట్లల్ల వచ్చేదుంటె... గిట్లాంటి పోటుగాల్లు ఏం జేసినా ఏంగాదె!!–రామదుర్గం మదుసూదనరావు
Comments
Please login to add a commentAdd a comment