బాచుపల్లిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో శ్రీశైలంగౌడ్
సూరారం: అభ్యర్థులు ప్రచారంలోనే బిజీబిజీగా గడుపుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరింత జోరు పెంచారు. ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుత్బుల్లాపూర్ ప్రజాకూటమి అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్ (కాంగ్రెస్)తో ‘సాక్షి’ జోన్ ప్రతినిధులు శనివారం ఒక రోజు ప్రయాణించారు. ఉదయం 6గంటలకు ప్రారంభమైన ఆయన దినచర్య రాత్రి 10గంటల వరకు కొనసాగింది. సభలు, సమావేశాలు, ప్రజలతో ముఖాముఖి, రోడ్ షోలతో బిజీబిజీగా గడిపారు. ఆ వివరాలివీ...
♦ ఉదయం 6గంటలకు దినచర్య ప్రారంభించిన కూన శ్రీశైలంగౌడ్ తొలుత బజార్‌ఘాట్ హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు.
♦ ఉదయం 7గంటలకు బాచుపల్లిలోని కేహెచ్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో విల్లాస్ అపార్టుమెంట్‌వాసులతో సమావేశమయ్యారు.
♦ ఉదయం 9:43గంటలకు టీడీపీ నేత కొలన్ హన్మంతరెడ్డితో కలిసి అల్ఫాహారం తీసుకొని, అక్కడి నుంచి బాచుపల్లిలో బైక్ ర్యాలీకి తరలి వెళ్లారు.
♦ ఉదయం 10:13గంటలకు బాచుపల్లి నుంచి నిజాంపేట, సాయినగర్, రాజీవ్‌గాంధీనగర్, ఇందిరానగర్‌ల మీదుగా బైక్ ర్యాలీ కొనసాగింది.
♦ మధ్యాహ్నం 12:30గంటలకు వివిధ కాలనీల వాసులతో సమావేశమై పలువురితో ఫోన్‌లో మాట్లాడి ప్రచార శైలిని అడిగి తెలుసుకున్నారు.
♦ మధ్యాహ్నం 1:23గంటలకు జీడిమెట్ల డిపో వద్ద సూపర్‌మ్యాక్స్ కార్మికులను కలుసుకొని ప్రజాకూటమి అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు.
♦ మధ్యాహ్నం 2:27గంటలకు బాలానగర్ పారిశ్రామికవాడ వాటర్ ట్యాంక్ పక్కనే ఉన్న ప్రాగా టూల్స్ కార్మికులతో సమావేశమై తనకు మద్దతు తెలపాలని కోరారు.
♦ మధ్యాహ్నం 2:43గంటలకు పక్కనే ఉన్న మల్హోత్ర పరిశ్రమ కార్మికులను కలుసుకొని హస్తం గుర్తుకు ఓటెయ్యాలని అభ్యర్థించారు.
♦ మధ్యాహ్నం 3:23గంటలకు భగత్‌సింగ్‌నగర్‌లో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి బం ధువు గృహప్రవేశానికి వెళ్లి అక్కడే భోజనం చేశారు.
♦ సాయంత్రం 4గంటలకు గాజులరామారం చిత్తారమ్మ ఆలయం వద్ద గెస్ట్‌హౌస్‌లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ టీడీపీ డివిజన్ అధ్యక్షులతో సమావేశమై ఏపీ మాజీ మంత్రి కొండ్రు మురళితో చర్చించారు. అక్కడే కొంపల్లి ప్రాంతానికి చెందిన పలువురితో మాట్లాడారు.
♦ సాయంత్రం 4:30గంటలకు టీడీపీ మహిళా మండలి సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై ప్రచార శైలిని అడిగి తెలుసుకున్నారు.
♦ సాయంత్రం 5:50గంటల నుంచి నిజాంపేటలోని వెంకటసాయి హిల్స్, కేటీఆర్ కాలనీ, బాలాజీ హిల్స్, బండారి లేఅవుట్‌లలో పర్యటిస్తూ రాత్రి 8గంటల వరకు ప్రచారం కొనసాగించారు.
Comments
Please login to add a commentAdd a comment