ముందస్తు ఎన్నికల ప్రచారం జిల్లాలో వేడెక్కుతోంది. షెడ్యూల్ ప్రకటించినా.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ఇంకా 15 రోజుల గడువుండగా.. ప్రచార హంగామా ఊపందుకుంది. జిల్లాలోని నాలుగు శాసనసభ స్థానాల పీఠాల్ని దక్కించుకోవాలనే ఉబలాటాన్ని అన్ని పార్టీలు కనబరుస్తున్నాయి. 2014 ఎన్నికల్లో అనుభవాలు, పరాభవాలు, విజయాలను బేరీజు వేసుకుంటూ ఆయా పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముందస్తు సమరంలో ముందు నిలవాలనే జోరుని ఆయా రాజకీయ పార్టీలు ముమ్మరం చేస్తున్నాయి.
ఎన్నికల తేదీ ఖరారవడంతో ఉన్నఫలంగా ప్రజాక్షేత్రంలో చేసినవి, చేసే అభివృద్ధి పనులను పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. టీఆర్‌ఎస్ పార్టీ మూడు స్థానాలకు అభ్యర్థులను నెలన్నర కిందటే ప్రకటించగా మారో స్థానంపై సస్పెన్స్ కొనసాగుతోంది. కాంగ్రెస్, మహాకూటమి పార్టీల టిక్కెట్లు ఇంకా ఖరారు కావాల్సి ఉండగా, ఆయా పార్టీల నుంచి ఆశావహులు పోటీ పడుతున్నారు. బీజేపీ రెండు, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ మూడు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు అభ్యర్థులు ప్రచారం ఉధృతంగా చేస్తుండటంతో జిల్లాలో ముందస్తు ఎన్నికల సందడి జోరందుకుంది.
సాక్షిప్రతినిధి, కరీంనగర్: జిల్లాలో జిల్లాలో నాలుగు స్థానాలలో రెం డు జనరల్, రెండు షెడ్యూల్ కులాలకు కేటా యించారు. హుజూరాబాద్, కరీంనగర్, మానకొండూరు(ఎస్‌సీ) నియోజకవర్గాల నుంచి టీఆర్‌ఎస్ సిట్టింగ్‌లకే టిక్కెట్లు ఇచ్చింది. హుజూరాబాద్ నుంచి మంత్రి ఈటల రాజేందర్, కరీంనగర్‌లో గంగుల కమలాకర్, మానకొండూరులో రసమ యి బాలకిషన్ టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా ప్రచారం చేస్తున్నారు. మంత్రి ఈటల రాజేందర్ రెండు నెలలుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. చొప్పదండిలో అధికార పార్టీ అభ్యర్థిని ఖరారు చేయనప్పటికీ ఓ వైపు తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మరోవైపు సుంకె రవిశంకర్ ప్రచారం చేసుకుంటున్నారు. హుజూ రాబాద్, కరీంనగర్, మానకొండూరులలో టీఆర్‌ఎస్ సభలు నిర్వహించింది.
కుల సంఘాలతో పాటు అన్ని వర్గాలను కలిసి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, కూటమి స్థానాలు ఇంకా తేలకపోగా కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ, టీడీపీలకు చెందిన ఆశావహులు సైతం ప్రచారంలోకి దిగా రు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్ నుంచి పాడి కౌశిక్‌రెడ్డి, తుమ్మేటి సమ్మిరెడ్డి, ప్యాట రమేష్, టీజేఎస్ నుంచి ఆ పార్టీ జిల్లా కన్వీనర్ ముక్కెర రాజు తమకే టిక్కెటు వస్తుందంటూ ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు. కరీంనగర్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. టీజేఎస్ నుంచి నరహరి జగ్గారెడ్డి ప్రచారంలో ఉన్నారు. మానకొండూరులో కాంగ్రెస్ నుంచి ఆరెపల్లి మోహన్ విస్తృతంగా సభలు, సమావేశాల నిర్వహణ ద్వారా ప్రజలను కలిసి ప్రచారం చేస్తున్నారు.
చొప్పదండిలో కాంగ్రెస్ టికెట్ కోసం డాక్టర్ మేడిపల్లి సత్యం, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, గజ్జెల కాంతం తీవ్రంగా ప్రయత్నం చేస్తుండగా, వారంతా కూడా ఎవరికి వారుగా ప్రచారం చేసుకుంటున్నారు. కాగా.. బీజేపీ నాలుగు స్థానాలకు రెండు స్థానాల్లో అభ్యర్థులను ఇటీవలే ప్రకటించింది. కరీంనగర్‌కు ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌ను ఖరారు చేయగా, మానకొండూరుకు గడ్డం నాగరాజును అభ్యర్థిగా ప్రకటించారు. బండి సంజయ్ కూడా కరీంనగర్‌లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాగా.. సీపీఎం, బహుజన లెఫ్ట్‌ఫ్రంట్‌ల అభ్యర్థులుగా మర్రి వెంకటస్వామి (మానకొండూరు), వసీం అహ్మద్ (కరీంనగర్), కనకం వంశీ (చొప్పదండి)లను అభ్యర్థులుగా ప్రకటించారు.
గెలుపే లక్ష్యంగా ముందుకు..
కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితిలు కూటమి మంత్రంతో ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఆసరాగా చేసుకుని వీలైనన్ని ఎక్కువ ఓట్లను పొందేలా వ్యూహంతో ముందుకెళ్తున్నాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థులు మాత్రం అభివృద్ధే మా నినాదమనే తీరుతోపాటు నాలుగున్నరేళ్లలో చేసి చూపిన ప్రగతికి ఓటర్లు పట్టం గడుతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ గెలుపే లక్ష్యం అంటూ దూసుకెళ్తున్నారు.
గత ఎన్నికలకు మించి మరిన్ని ఓట్లు పొందుతామనే ధీమాను బరిలో నిలిచే అభ్యర్థులు వ్యక్తం చేస్తుండగా, కలిసికట్టుగా ఒకే జట్టుగా ప్రజల మనసును చూరగొనే కూట మికే ఈసారి ఎక్కువ శాతం ఓట్లు వస్తాయని లెక్కలు వేస్తున్నాయి. మరోవైపు బీజేపీ ఒంటరి పోరుతో ప్రత్యర్థులకు దీటైన పోటీ ఇచ్చేలా పట్టున్న స్థానాల్లో గెలిచేలా పావులు కదుపుతోంది. ఇక బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పేరిట ఏర్పడిన కూటమితో పాటే అన్నిచోట్ల స్వతంత్రులు సహా ఇతర పార్టీల అభ్యర్థులు తమ ప్రాధాన్యతను చాటేలా ఓట్లను సంపాదించే పనికి సిద్ధమయ్యారు. మొత్తంగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాటికి జిల్లాలోని నాలుగు స్థానాల్లో రాజకీయ పార్టీల ప్రచారం మరింత హోరెత్తనుంది.
Comments
Please login to add a commentAdd a comment