సాక్షిప్రతినిధి, కరీంనగర్: హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం మహాకూటమిలో వివాదానికి కారణమవుతోంది. పొత్తుల్లో భాగంగా హస్నాబాద్‌ను సీపీఐకి కేటాయించాలని మొదటి నుంచి పట్టుబడుతున్నారు. హుస్నాబాద్ సీటుపై తేల్చకుండా కేవలం మూడు స్థానాలనే కేటాయించనున్నట్లు వస్తున్న లీకులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. హుస్నాబాద్‌పై ఏమీ తేల్చకుండా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న లీకులపై అసహనంతో రగిలారు.
మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ వైఖరిపై ఆయన ఏకంగా మీడియాకెక్కారు. ఆదివారం హైదరాబాద్ సీపీఐ రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు చేసి జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిని ఆహ్వానించారు. ఈనెల 4న నిర్వహించే అత్యవసర సమావేశం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు చాడ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ఈ సందర్భంగా చాడ అభిప్రాయపడటంతో పరిస్థితి అదుపుతప్పే వరకు వచ్చినట్లుగా అవగతమవుతోంది.
అత్యధిక సార్లు సీపీఐదే విజయం.. హుస్నాబాద్‌గా మారినా అందుకే పట్టు..
1957 నుంచి 2004 వరకు మొత్తం 11 పర్యాయాలు ఎన్నికలు జరగగా, ఆరు సార్లు సీపీఐ, ఒకసారి పీడీఎఫ్ అభ్యర్థులు ఇందుర్తి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అలాగే మూడుసార్లు కాంగ్రెస్, ఒక్కసారి కాంగ్రెస్ (ఐ)లు కైవసం చేసుకున్నాయి. 1957లో పి.చొక్కారావు (పీడీఎఫ్), 1962, 1967లలో వరుసగా బొప్పరాజు లక్ష్మీకాంతారావు (కాంగ్రెస్), 1972లో బద్దం ఎల్లారెడ్డి (సీపీఐ), 1978లో దేశిని చిన్నమల్లయ్య విజయం సాధించగా, 1983లో మళ్లీ బి.లక్ష్మీకాంతారావే గెలిచారు. 1985, 1989, 1994లలో వరుసగా సీపీఐ అభ్యర్థిగా గెలుపొందిన దేశిని చిన్న మల్లయ్య హ్యాట్రిక్ సాధించారు. 1999లో బొమ్మా వెంకటేశ్వర్ (కాంగ్రెస్), 2004లో గెలుపొందిన చాడ వెంకటరెడ్డి (సీపీఐ) ఆ పార్టీ శాసనసభ పక్షనేతగా కూడా వ్యవహరించారు.
2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కమలాపూర్, ఇందుర్తి, హుస్నాబాద్ కలిపి హుజూరాబాద్, హుస్నాబాద్‌లుగా మారాయి. హుజూరాబాద్, వీణవంక, జమ్మికుంట, కమలాపూర్ మండలాలతో హుజూరాబాద్, హుస్నాబాద్, సైదాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, చిగురుమామిడి, కోహెడ మండలాలతో హుస్నాబాద్ నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. పునర్విభజన తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి కెప్టెన్ వి.లక్ష్మీకాంతారావు గెలుపొందారు.
ఈ ఎన్నికల్లో పీఆర్‌పీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి, సీపీఐ అభ్యర్థి వెంకటరెడ్డి మూడు, నాలుగు స్థానాలకు చేరారు. 2014లో టీఆర్‌ఎస్ అభ్యర్థి, కెప్టెన్ లక్ష్మీకాంతారావు తనయుడు వొడితెల సతీష్‌కుమార్ చేతిలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎ.ప్రవీణ్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. ఉమ్మడి కరీంనగర్‌లో పట్టున్న ఏకైక స్థానం.. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న చాడ వెంకటరెడ్డి పోటీకి ఆసక్తి చూపుతుండటంతో కూటమిలో ఇప్పుడు ‘హుస్నాబాద్’ చిచ్చు రగులుతోంది.
4న రాష్ట్ర కార్యవర్గం అత్యవసర భేటీ.. ‘కూటమి’లో భవిష్యత్ కార్యాచరణ కలకలం..
పొత్తుల్లో సీపీఐకి కేటాయించే స్థానాలు తేలకపోగా, మూడంటే మూడంటూ కాంగ్రెస్ పార్టీ లీకులు ఇస్తోందంటూ శుక్రవారం చాడ వెంకటరెడ్డి మీడియా సమావేశంలో పేర్కొనడం కూటమిలో కలకలంగా మారింది. సంబంధం లేకుండా అబద్ధాలతో లీకేజీలు ఇస్తున్నారని మండిపడిన వెంకటరెడ్డి, ఈ విషయాన్ని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు, ఉమ్మడి అజెండా ఉండాలని.. గౌరవప్రదమైన ఒప్పందం జరగాలని భావిస్తే.. కూటమిగా ఏర్పడి దాదాపు 50 రోజులు గడిచాయని, ఉమ్మడి అజెండా ఖరారైనా అడుగు ముందుకు పడకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
లీకేజీలతో తమ పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంటోందని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన 4న అత్యవసర రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు చేయడం.. ఆ సమావేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిని ఆహ్వానించడంతో పరిస్థితి సీరియస్‌గా మారింది. కాగా.. ఈ అత్యవసర సమావేశంలో కూటమిలో కొనసాగాలా..? వద్దా? అనే అంశంపై సీపీఐ కీలక నిర్ణయం తీసుకోనుందన్న ప్రచారం ఇప్పుడు కూటమి భాగస్వామ్య పార్టీలలో చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment