husnabad constituency
-
ఆ ఎమ్మెల్యే ఇక రాజకీయాలకు దూరమా?.. ఆ రెండు చోట్ల కొత్త అభ్యర్థులేనా?
మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణలో కొత్త పొత్తులకు దారి తీస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో టీఆర్ఎస్కు పొత్తు కుదిరితే కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ సీపీఐ కోటా కిందకు వెళుతుందనే ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే హుస్నాబాద్ గులాబీ ఎమ్మెల్యే ఎక్కడ పోటీ చేస్తారు? అసలు బరిలో ఉంటారా? లేదా? నాడు కమ్యూనిస్టుల కంచుకోట హుస్నాబాద్ నియోజకవర్గం.. కరీంనగర్ జిల్లాలో వామపక్షాలకు ఒకనాటి కంచుకోట. ఇక్కడ సీపీఐ నాయకులు దేశిని చిన మల్లయ్య ఐదుసార్లు, చాడ వెంకట్ రెడ్డి ఒకసారి విజయం సాధించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి సతీష్‌కుమార్ విజయం సాధించారు. ఇప్పుడు తాజాగా వామపక్షాలతో, టీఆర్ఎస్ పొత్తు గురించి ప్రచారం జరుగుతుండటంతో.. హుస్నాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దారెటు అనే చర్చ మొదలైంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడినప్పటి నుంచీ పార్టీలో కొనసాగుతున్న కేసీఆర్ మిత్రుడు కెప్టెన్ లక్ష్మీకాంత్ రావ్ తనయుడే సతీష్ కుమార్. టీఆర్ఎస్లోని ఈక్వేషన్స్ వల్ల వారి సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్ నుంచి హుస్నాబాద్ కు వెళ్ళి సతీష్‌కుమార్ పోటీ చేసి గెలిచారు. పొత్తు పొడుస్తుందా? కొత్తగా పొత్తు పొడిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే కరీంనగర్ జిల్లాలో సీపీఐ ముందుగా అడిగే స్థానం హుస్నాబాద్ అవుతుంది. గులాబీ దళపతి కేసీఆర్ కొత్తగా దోస్తీ కలిసిన మిత్రపక్షం కోసం హుస్నాబాద్ ఇవ్వడానికి ఒకే అంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ప్రస్తుత టీఆరెఎస్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పరిస్తితి ఏంటనే చర్చ నియోజకవర్గంలోని గులాబీ పార్టీలో జరుగుతోందట. హుస్నాబాద్ నుంచి మళ్లీ సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్‌కు వలస వెళ్లాల్సిన పరిస్తితి ఏర్పడుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సతీష్‌కుమార్ కుటుంబం అంతా అక్కడే రాజకీయంగా ఎదిగింది. కుటుంబ వ్యాపారాలు కూడా అక్కడ ఉన్నాయి. ఈటల రాజేందర్ కోసం గతంలో సతీష్‌కుమార్‌ను హుస్నాబాద్‌కు పంపించారు కేసీఆర్. ప్రస్తుతం ఈటల బీజేపీలో చేరినందున అక్కడ గులాబీ పార్టీలో కొంతవరకు ఖాళీ ఏర్పడిందంటున్నారు. చదవండి: (తెలంగాణలో ఎన్నికల వేడి.. కారు ఫైరింగ్.. అనూహ్యంగా ఎదిగిన కమలం) హుజురాబాద్‌తో లింకు ఈటల రాజీనామా కారణంగా జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్వీ కార్యకలాపాల్లో మళ్లీ నిమగ్నం అయ్యారు. ఆ సీటు ఆశించి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ సీటుకు బదులుగా ఎమ్మెల్సీ సీటు దక్కింది. ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ... తానే హుజూరాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను అంటూ చెప్పుకుంటున్నారు పాడి కౌశిక్‌రెడ్డి. అయితే ఆయన ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్నందున హుజూరాబాద్ సీటు సతీష్ కుమార్‌కు ఇచ్చే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాల్లో టాక్. కాని ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎమ్మెల్సీ పదవిని తీసుకోవాలని కోరుకుంటున్నారట. ఇదే నిజమైతే అటు హుస్నాబాద్ ఇటు హుజూరాబాద్ రెండింటిలోనూ కొత్త అభ్యర్థులు బరిలో దిగుతారని అనుకోవచ్చు. చదవండి: (MLAs Purchase Case: బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్‌కు సిట్ నోటీసులు) -
చర్చనీయాంశంగా మారిన అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి చేరిక
సాక్షిప్రతినిధి, వరంగల్: హుస్నాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, ముల్కనూరు సహకార బ్యాంకు అధ్యక్షుడు, టీఆర్ఎస్ నేత అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ఆ పార్టీని వీడి.. ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లిన ఆయన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే ఉమ్మడి వరంగల్‌లో సీఎం కేసీఆర్ మూడు రోజుల పర్యటన ముగిసిన మరుసటి రోజే మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2019లో గులాబీ తీర్థం అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. జాతీయ స్థాయిలో పేరున్న ముల్కనూర్ రైతు సహకార బ్యాంకు అధ్యక్షుడిగా ఉన్న ఆయనకు.. ఆ ఎన్నికల్లో వైఎస్.రాజశేఖరరెడ్డి నేతృత్వంలో విజయం సునాయాసంగా వరించింది. వైఎస్సార్ మరణం తదనంతర పరిణామాల్లో ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం కాగా.. అతనితో సన్నిహిత సంబంధాలున్న ప్రవీణ్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి అత్యధిక నిధులు సాధించగలిగారు. 2014 ఎన్నికల్లో వొడితెల సతీశ్‌కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో సైతం టికెట్ ఇస్తామనడంతో నియోజకవర్గంలోనే పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు. చివరి నిమిషంలో పొత్తుల్లో భాగంగా వ్యూహాత్మకంగా సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి హుస్నాబాద్ టికెట్ దక్కించుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రవీణ్‌రెడ్డి కొంతకాలం పార్టీకి దూరంగా ఉంటూ.. 2019 ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరారు. టికెట్ పక్కాతోనే.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి హస్నాబాద్ నుంచి 2014 ఎన్నికల్లో ఓటమి చెందగా.. 2018లో కాంగ్రెస్ టికెట్ చేజారింది. వరుసగా రెండు పర్యాయాలు టీఆర్ఎస్ అభ్యర్థిగా వొడితెల సతీశ్‌కుమార్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ప్రవీణ్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరినప్పటికీ.. హుస్నాబాద్ నుంచి టికెట్ లభించే అవకాశం లేదు. ఈటల రాజేందర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ తదనంతరం వచ్చిన హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత వచ్చే ఎన్నికల్లో(2023) వొడితెల సతీశ్‌కుమార్‌ను అక్కడి నుంచి బరిలోకి దింపుతారన్న వార్తలొచ్చాయి. తాజా పరిణామాల నేపథ్యంలో హుస్నాబాద్ టికెట్ సతీశ్కుమార్కే పక్కా అన్న చర్చ జోరందుకోవడంతో ఇక్కడ చాన్స్ లేదని భావించిన ప్రవీణ్‌రెడ్డి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. బీజేపీ నేతలు సైతం సంప్రదింపులు జరిపారన్న ప్రచారం ఉన్నా.. టార్గెట్–2023 లక్ష్యంగా హుస్నాబాద్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు నిర్ణయించుకున్న అల్గిరెడ్డి.. టికెట్ పక్కా చేసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. (క్లిక్: మళ్లీ ‘షేక్‌హ్యాండ్’.. ఆసక్తిరేపుతున్న కాంగ్రెస్‌లో చేరికలు) -
Telangana: మళ్లీ ‘షేక్‌హ్యాండ్’.. ఆసక్తిరేపుతున్న కాంగ్రెస్‌లో చేరికలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో ఘర్ వాపసీ కార్యక్రమం చేపట్టినట్టు కనిపిస్తోంది. 2014 తర్వాత పార్టీని వదిలి వెళ్లిన పాత నాయకులను మళ్లీ సొంత గూటికి ఆహ్వానిస్తూ పునర్వైభవం కోసం ప్రయత్నిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడితోపాటు కీలక నేతలంతా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీలోకి తిరిగి రప్పించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. నెల రోజుల నుంచి పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతున్న హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ఎట్టకేలకు మంగళవారం కాంగ్రెస్‌లో చేరారు. ఢిల్లీలో రాజ్యసభ పక్షనేత, సీనియర్ కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే నివాసంలో టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇదే దారిలో ఆ పక్క నియోజకవర్గమైన మానకొండూర్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత టీఆర్ఎస్ నేత ఆరేపల్లి మోహన్ సైతం పార్టీలోకి మళ్లీ వస్తున్నట్టు సమాచారం. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచి ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్న నలుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ సైతం పార్టీలోకి వస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. రంగారెడ్డి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ఒకరు, మాజీ ఎమ్మెల్సీ ఒకరు త్వరలోనే పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఇకపోతే గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీలుగా పనిచేసి ప్రస్తుతం టీఆర్ఎస్లో ఏమాత్రం సంతృప్తిగా లేని ముగ్గురు మాజీ ఎమ్మెల్సీలు సైతం మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు కీలక నేతలను సంప్రదించినట్టు తెలుస్తోంది. రగులుతున్న అసంతృప్తి అయితే, ఈ చేరికలపై పార్టీలో కొంతమందిలో అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. హుస్నాబాద్‌లో ప్రవీణ్‌రెడ్డి చేరికతో అక్కడ యాక్టివ్‌గా ఉన్న బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తంచేశారు. అదేవిధంగా మానకొండూర్‌లోనూ ఆ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ సైతం ఆరేపల్లి మోహన్ రాకను వ్యతిరేకిస్తున్నట్టు తెలిసింది. ఇటు మహబూబ్‌నగర్‌లోనూ మాజీ ఎమ్మెల్యేల రాక ప్రస్తుత నేతల్లో కాక పుట్టిస్తోంది. ఒక చేరిక రెండు సవాళ్లుగా మారనున్నట్టు సీనియర్లు చర్చించుకుంటున్నారు. అయితే పార్టీ అధికారంలోకి వస్తేనే అందరికీ మనుగడ ఉంటుందని, అసంతృప్తి రాజకీయాల వల్ల మొత్తానికే ఇబ్బంది ఏర్పడుతుందని ముఖ్యనేతలు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. పార్టీ పునర్వైభవం కోసం తప్పదంటూ ముందుకెళ్తున్నట్టు సమాచారం. -
హుస్నాబాద్ సర్కారీ ఆస్పత్రికి జబ్బు!
సాక్షి, హుస్నాబాద్: ‘‘ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని యాభై పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేశారు. దీంతో పెద్దాస్పత్రిగా మారింది. అయినా రోగులకు అరకొర సేవలే అందుతున్నాయి. ఇది హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి దుస్థితి.’’ హుస్నాబాద్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని 50 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసి నాలుగేళ్లు కావస్తొంది. ఆస్పత్రి కోసం భవనాన్ని సైతం నిర్మించారు. కానీ ఆస్పత్రిలో సౌకర్యాలులేవు. సరిపడా వైద్యులు, సిబ్బంది లేరు. దీంతో హుస్నాబాద్ పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలో కేవలం జ్వరం, దగ్గు సాధారణ జబ్బులకు మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. ప్రతీరోజు 400 నుంచి 500 మంది వరకు అవుట్ పేషంట్లు వస్తుంటారు. వారికి అరకొర సేవలు అందుతుండటంతో చేసేదిలేక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. హుస్నాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని దాదాపు నాలుగేళ్ల క్రితం 50 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేశారు. అందుకు తగ్గట్లుగా అత్యాధునికంగా నూతనంగా ఆస్పత్రి భవనాన్ని నిర్మించారు. ఆస్పత్రికి తగ్గట్లుగా సౌకర్యాలు, డాక్టర్లు లేరు. నేటికి వైద్య విధాన పరిషత్ పరిధిలోకి తీసుకురాకపోవడమే కాకుండా ఏలాంటి ఆపరేషన్లు చేయకుండా కేవలం జ్వరం, దగ్గు సాధారణ జబ్బులకు మాత్రమే పరీక్షలు చేస్తూ, విషమంగా ఉంటే పట్టణాలకు రెఫర్ చేస్తున్నారు. డివిజన్ కేంద్రంగా ఉన్న ఈ ఆస్పత్రిలో ప్రతీ రోజు 400 నుంచి 500 మంది వరకు అవుట్ పేషంట్లు వస్తుంటారు. డీఎంఅండ్హెచ్ పరిధిలో రెగ్యులర్ డాక్టర్ సౌమ్య, మరో ఇద్దరు కాంట్రాక్ట్ బేసిక్ కింద డాక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. గైనకాలజిస్ట్ లేక గర్భిణుల అవస్థలు ముఖ్యంగా గర్భిణులకు సాధారణ ప్రసవాలు తప్పితే మేజర్ సమస్యలు వస్తే, ఆ కేసులను ఇతర ఆస్పత్రులకు పంపిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు గైనకాలజిస్ట్ డాక్టర్లు రాగా, వీరు ముగ్గురు రిజైన్ చేసి వెళ్లిపోవడంతో ఆస్పత్రిలో గైనకాలజిస్ట్ లేక ఇబ్బందులకు గురవుతున్నారు. గైనకాలజిస్టు లేకపోవడంతో గర్భిణులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు గైనకాలజిస్ట్ ఉన్నప్పుడు ప్రసవాలు అధికంగా నమోదు అయ్యాయి. పరీక్షలకే పరిమితమవుతున్న డాక్టర్లు రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన వారికి ప్రధమ చికిత్సతో పాటు గాయమైన చోట పట్టి కట్టాల్సి ఉంటుంది. నాలుగు వార్డు బాయ్ పోస్టులు ఖాళీగా ఉండటంతో స్వీపర్లే ప్రథమ చికిత్స అందిస్తూ కాలు, చేయికి పట్టికడుతారు. ఆస్పత్రిలో ఐదుగురు డాక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఆర్థోపెడిక్ డాక్టర్లు ఇద్దరు, అనస్తీషియా ఒకరు, చిల్ట్రన్ స్పెషలిస్టు ఒకరు, డెంటిస్ట్ డాక్టర్ ఒకరు వైద్య విధాన పరిషత్ ద్వారా ఈ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. ఆర్థోపెడిక్‌కు సంబంధించిన కనీసం ఫిజియో«ధెరపి చేసే పరికరాలు లేవు. ఏ శస్ట్ర చికిత్స చేద్దామన్న అందుకు తగ్గ పరికరాలు లేవు. దీంతో డాక్టర్లు కేవలం పరీక్షలు మాత్రమే చేస్తూ మందులు మాత్రమే ఇస్తున్నారు. నిరుపయోగంగా ఎక్స్‌రే ప్లాంట్ హుస్నాబాద్ ఆస్పత్రిలో ఎక్స్‌రేప్లాంట్ అలంకారప్రాయంగా దర్శనమిస్తుంది. ప్రాధమిక ఆరోగ్య కేంద్రంగా ఉన్న సమయంలో ఆస్పత్రిలో ఎక్స్‌రే ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. అప్పుడు సైతం రేడియో గ్రాఫర్ లేకపోవడం, దానిని వినియోగంలోకి తీసుకురాకలేకపోవడంతో ఎక్స్‌రే ప్లాంట్ పని చేయకుండా పోయింది. ఈ ప్లాంట్‌ను ఇనుప సామానుకిందనే పడేశారు. ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేశాక కొత్త ఎక్స్‌రే ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నేటి వరకు రేడియోగ్రాఫర్ ఎవరు రాకపోవడంతో నిరుపయోగంగానే ఉంది. అధికారులకు నివేదిక ఇచ్చాం.. ప్రభుత్వ ఆస్పత్రిలో రోజుకు దాదాపు 400 మంది రోగులకు పైగా అవుట్ పేషంట్లకు వైద్య సేవలు అందిస్తున్నాం. వైద్య విధాన పరిషత్‌లోకి ఆస్పత్రిని చేరుస్తామని చెబుతున్నారు. దీంతో ఆపరేషన్లతో పాటుగా పూర్తి స్థాయిలో సదుపాయాలు. డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండే అవకాశం ఉంది. వైద్య పరికరాలు అందుబాటులోకి వస్తాయి. వైద్య విధానపరిషత్ ద్వారా ఐదు గురు డాక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఎక్స్‌రే ప్లాంట్ నిర్వాహణకు రేడియోగ్రాఫర్ అవసరముంది. ఈ విషయాల పై ఉన్నతాధికారులకు నివేధికను అందించాం. – డాక్టర్ సౌమ్య, ప్రభుత్వ వైద్యురాలు, హుస్నాబాద్ -
కూటమిలో ‘హుస్నాబాద్’ చిచ్చు..!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం మహాకూటమిలో వివాదానికి కారణమవుతోంది. పొత్తుల్లో భాగంగా హస్నాబాద్‌ను సీపీఐకి కేటాయించాలని మొదటి నుంచి పట్టుబడుతున్నారు. హుస్నాబాద్ సీటుపై తేల్చకుండా కేవలం మూడు స్థానాలనే కేటాయించనున్నట్లు వస్తున్న లీకులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. హుస్నాబాద్‌పై ఏమీ తేల్చకుండా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న లీకులపై అసహనంతో రగిలారు. మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ వైఖరిపై ఆయన ఏకంగా మీడియాకెక్కారు. ఆదివారం హైదరాబాద్ సీపీఐ రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు చేసి జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిని ఆహ్వానించారు. ఈనెల 4న నిర్వహించే అత్యవసర సమావేశం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు చాడ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ఈ సందర్భంగా చాడ అభిప్రాయపడటంతో పరిస్థితి అదుపుతప్పే వరకు వచ్చినట్లుగా అవగతమవుతోంది. అత్యధిక సార్లు సీపీఐదే విజయం.. హుస్నాబాద్‌గా మారినా అందుకే పట్టు.. 1957 నుంచి 2004 వరకు మొత్తం 11 పర్యాయాలు ఎన్నికలు జరగగా, ఆరు సార్లు సీపీఐ, ఒకసారి పీడీఎఫ్ అభ్యర్థులు ఇందుర్తి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అలాగే మూడుసార్లు కాంగ్రెస్, ఒక్కసారి కాంగ్రెస్ (ఐ)లు కైవసం చేసుకున్నాయి. 1957లో పి.చొక్కారావు (పీడీఎఫ్), 1962, 1967లలో వరుసగా బొప్పరాజు లక్ష్మీకాంతారావు (కాంగ్రెస్), 1972లో బద్దం ఎల్లారెడ్డి (సీపీఐ), 1978లో దేశిని చిన్నమల్లయ్య విజయం సాధించగా, 1983లో మళ్లీ బి.లక్ష్మీకాంతారావే గెలిచారు. 1985, 1989, 1994లలో వరుసగా సీపీఐ అభ్యర్థిగా గెలుపొందిన దేశిని చిన్న మల్లయ్య హ్యాట్రిక్ సాధించారు. 1999లో బొమ్మా వెంకటేశ్వర్ (కాంగ్రెస్), 2004లో గెలుపొందిన చాడ వెంకటరెడ్డి (సీపీఐ) ఆ పార్టీ శాసనసభ పక్షనేతగా కూడా వ్యవహరించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కమలాపూర్, ఇందుర్తి, హుస్నాబాద్ కలిపి హుజూరాబాద్, హుస్నాబాద్లుగా మారాయి. హుజూరాబాద్, వీణవంక, జమ్మికుంట, కమలాపూర్ మండలాలతో హుజూరాబాద్, హుస్నాబాద్, సైదాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, చిగురుమామిడి, కోహెడ మండలాలతో హుస్నాబాద్ నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. పునర్విభజన తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి కెప్టెన్ వి.లక్ష్మీకాంతారావు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి, సీపీఐ అభ్యర్థి వెంకటరెడ్డి మూడు, నాలుగు స్థానాలకు చేరారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి, కెప్టెన్ లక్ష్మీకాంతారావు తనయుడు వొడితెల సతీష్‌కుమార్ చేతిలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎ.ప్రవీణ్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. ఉమ్మడి కరీంనగర్లో పట్టున్న ఏకైక స్థానం.. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న చాడ వెంకటరెడ్డి పోటీకి ఆసక్తి చూపుతుండటంతో కూటమిలో ఇప్పుడు ‘హుస్నాబాద్’ చిచ్చు రగులుతోంది. 4న రాష్ట్ర కార్యవర్గం అత్యవసర భేటీ.. ‘కూటమి’లో భవిష్యత్ కార్యాచరణ కలకలం.. పొత్తుల్లో సీపీఐకి కేటాయించే స్థానాలు తేలకపోగా, మూడంటే మూడంటూ కాంగ్రెస్ పార్టీ లీకులు ఇస్తోందంటూ శుక్రవారం చాడ వెంకటరెడ్డి మీడియా సమావేశంలో పేర్కొనడం కూటమిలో కలకలంగా మారింది. సంబంధం లేకుండా అబద్ధాలతో లీకేజీలు ఇస్తున్నారని మండిపడిన వెంకటరెడ్డి, ఈ విషయాన్ని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు, ఉమ్మడి అజెండా ఉండాలని.. గౌరవప్రదమైన ఒప్పందం జరగాలని భావిస్తే.. కూటమిగా ఏర్పడి దాదాపు 50 రోజులు గడిచాయని, ఉమ్మడి అజెండా ఖరారైనా అడుగు ముందుకు పడకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. లీకేజీలతో తమ పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంటోందని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన 4న అత్యవసర రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు చేయడం.. ఆ సమావేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిని ఆహ్వానించడంతో పరిస్థితి సీరియస్‌గా మారింది. కాగా.. ఈ అత్యవసర సమావేశంలో కూటమిలో కొనసాగాలా..? వద్దా? అనే అంశంపై సీపీఐ కీలక నిర్ణయం తీసుకోనుందన్న ప్రచారం ఇప్పుడు కూటమి భాగస్వామ్య పార్టీలలో చర్చనీయాంశంగా మారింది. -
హుస్నాబాద్ మూడు ముక్కలు!
► సిద్దిపేటలో కలవనున్న హుస్నాబాద్? ► వెల్లడించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ► జీర్ణించుకోలేకపోతున్న జనం ► భవిష్యత్ కార్యాచరణపై కసరత్తు హుస్నాబాద్ : హుస్నాబాద్ నియోజకవర్గం మూడు ముక్కలు కానుంది. నియోజకవర్గ కేంద్రంగా ఉన్న హుస్నాబాద్ మండలంతోపాటు కోహెడ మండలం కొత్తగా ఏర్పడే సిద్దిపేట జిల్లాల్లో కలవనుంది. ఇక భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలు వరంగల్ జిల్లాలో, సైదాపూర్, చిగురుమామిడి మండలాలు కరీంనగర్ జిల్లాలోనే కొనసాగనున్నారుు. హుస్నాబాద్‌ను జిల్లాకేంద్రంగా ఏర్పాటు చేయాలని స్థానికంగా ఉద్యమాలు చేస్తున్నా.. సీఎం కేసీఆర్ మాత్రం సిద్దిపేటలో కలిపేందుకే మొగ్గుచూపుతున్నట్లు వార్తలు వస్తుండడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. పరిపాలన సౌలభ్యం కోసమేన కొత్త జిల్లాల ఏర్పాటు అంటున్న కేసీఆర్.. నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేసే రూట్ మ్యాప్‌ను ప్రకటించడంతో ఇక్కడి ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. హుస్నాబాద్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని వారం రోజులుగా చేస్తున్న ఉద్యమాలు సీఎంకు తెలియడం లేదా..? ఇక్కడి ప్రజల ఆకాంక్షను ఆయన దృష్టికి ఎవరూ తీసుకెళ్లడం లేదా..? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆర్డీవో కార్యాలయంపైనా అనుమానాలు ప్రస్తుతం నియోజకవర్గంలో ఆరు మండలాలున్నారుు. పరిపాలన సౌలభ్యం కోసమంటూ ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హుస్నాబాద్‌కు ఆర్డీవో కార్యాలయూన్ని మంజూరుచేసింది. కొన్ని అనివార్య కారణాలతో ప్రారంభానికి నోచుకోలేదు. తాజాగా హుస్నాబాద్‌ను సిద్దిపేట జిల్లాలో కలిపితే ఒక్క మండలానికి ఆర్డీవో కార్యాలయూన్ని ఎలా కేటారుుస్తారనే అనుమానం తెరపైకి వస్తోంది. ఆరు మండలాలు కలిసి ఉన్నప్పుడు ఏర్పడని రెవెన్యూ డివిజన్.. ఒక్క మండలంగా మిగిలిపోతే ఎలా ఇస్తారన్న ప్రశ్న ఉదరుుస్తోంది. సమాలోచనలో అఖిలపక్ష పార్టీలు కేవలం హుస్నాబాద్ మండలాన్ని సిద్దిపేట జిల్లాలో కలిపే అవకాశముందని సీఎం చెప్పడంతో అఖిలపక్ష నాయకులు సమాలోచనలో పడ్డారు. ఇన్ని రోజులు జిల్లా కావాలని, ఆర్డీఓ కార్యాలయాన్ని మంజూరు చేయాలని డిమాండ్‌తో రోజుకో కార్యక్రమం ద్వారా నిరసన తెలుపుతున్నారు. పిడుగులాంటి వార్త రావడంతో ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. నియోజకవర్గంలోని అన్ని పార్టీల ఆది నాయకులతో సమావేశం నిర్వహించి భవిష్యత్ ప్రణాళికను రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు. అవసరమైతే తెలంగాణ ఉద్యమంలాగా మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టి ఇక్కడి ప్రజల ఆకాంక్షను ప్రభుత్వానికి తెలిసేలా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని భావిస్తున్నారు. త్వరలోనే హుస్నాబాద్‌కు బంద్‌కు పిలుపునివ్వనున్నట్లు అఖిల పక్ష నాయకుల సమాచారం. . ఏకాకిగా హుస్నాబాద్? హుస్నాబాద్ మండలంలోని మీర్జాపూర్, కేశ్వాపూర్, మల్లంపల్లి, మోత్కులపల్లి, ఉమ్మాపూర్, చౌటపల్లి, జిల్లెల్లగడ్డ ప్రాంతాలు గతంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉండేవి. ఆప్పుడు ఈ ఏడు గ్రామాలు అసలే అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడు హుస్నాబాద్‌ను సిద్దిపేటలో విలీనం చేస్తే ఆ గ్రామాల పరిస్థితే పడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. కరీంనగర్ జిల్లాలోనే పెద్ద నియోజకవర్గ కేంద్రంగా ఉన్న హుస్నాబాద్‌ను సిద్దిపేటలో చేర్చి ఒంటరి చేసే ప్రయత్నం జరుగుతోందని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. -
వెన్నంపల్లిలో రీ పోలింగ్
హుస్నాబాద్, న్యూస్‌లైన్ : హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలం వెన్నంపల్లిలోని 170 పోలింగ్ కేంద్రంలో రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం శనివారం ఆదేశాలు జారీ చేసింది. గత నెల 30న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన ఈవీఎంలో 204 ఓట్లు నమోదైన తరువాత ఈవీఎం మొరాయించింది. దీంతో అధికారులు మరో ఈవీఎంను అక్కడ ఏర్పాటు చేయగా అందులో 210 ఓట్లు పోలయ్యాయి. ఈ పోలింగ్ కేంద్రంలో 471 ఓటర్లు ఉండగా, 414 ఓట్లు పోలయ్యాయి. ముందుగా ఏర్పాటు చేసిన ఈవీఎంలోని 204 ఓట్లు ఎవరికి పడ్డాయనే విషయం ఈవీఎంలో ఫలితాలు చూపించకపోవచ్చనే భావనకు అధికారులు వచ్చారు. ఈ విషయాన్ని ఎన్నికల సం ఘం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అక్కడ ఈ నెల 13న రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించినట్టు నియోజకవర్గ ఎన్నికల ప్రత్యేకాధి కారి ఎన్.మధసూదన్ తెలిపారు. రీ పోలింగ్‌ను ఎంపీకి మాత్రమే జరుగుతుందని చెప్పారు.