హుస్నాబాద్‌ సర్కారీ ఆస్పత్రికి జబ్బు! | Husnabad Hospital Patients Face Problems With Lack Of Doctors | Sakshi
Sakshi News home page

హుస్నాబాద్‌ సర్కారీ ఆస్పత్రికి జబ్బు!

Published Thu, Jul 25 2019 2:33 PM | Last Updated on Thu, Jul 25 2019 2:33 PM

Husnabad Hospital Patients Face Problems With Lack Of Doctors - Sakshi

సాక్షి, హుస్నాబాద్‌: ‘‘ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని యాభై పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేశారు. దీంతో పెద్దాస్పత్రిగా మారింది. అయినా రోగులకు అరకొర సేవలే అందుతున్నాయి. ఇది హుస్నాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి దుస్థితి.’’ 

హుస్నాబాద్‌ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని 50 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేసి నాలుగేళ్లు కావస్తొంది. ఆస్పత్రి కోసం భవనాన్ని సైతం నిర్మించారు.  కానీ ఆస్పత్రిలో సౌకర్యాలులేవు. సరిపడా వైద్యులు, సిబ్బంది లేరు. దీంతో హుస్నాబాద్‌ పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలో కేవలం జ్వరం, దగ్గు సాధారణ జబ్బులకు మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. ప్రతీరోజు 400 నుంచి 500 మంది వరకు అవుట్‌ పేషంట్లు వస్తుంటారు. వారికి అరకొర సేవలు అందుతుండటంతో చేసేదిలేక  ప్రైవేటు ఆస్పత్రులకు  వెళ్తున్నారు.      

హుస్నాబాద్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని దాదాపు నాలుగేళ్ల క్రితం 50 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేశారు. అందుకు తగ్గట్లుగా అత్యాధునికంగా నూతనంగా ఆస్పత్రి భవనాన్ని నిర్మించారు. ఆస్పత్రికి తగ్గట్లుగా సౌకర్యాలు, డాక్టర్లు లేరు. నేటికి వైద్య విధాన పరిషత్‌ పరిధిలోకి తీసుకురాకపోవడమే కాకుండా ఏలాంటి ఆపరేషన్లు చేయకుండా కేవలం జ్వరం, దగ్గు సాధారణ జబ్బులకు మాత్రమే పరీక్షలు చేస్తూ, విషమంగా ఉంటే పట్టణాలకు రెఫర్‌ చేస్తున్నారు. డివిజన్‌ కేంద్రంగా ఉన్న ఈ ఆస్పత్రిలో ప్రతీ రోజు 400 నుంచి 500 మంది వరకు అవుట్‌ పేషంట్లు వస్తుంటారు. డీఎంఅండ్‌హెచ్‌ పరిధిలో రెగ్యులర్‌ డాక్టర్‌ సౌమ్య, మరో ఇద్దరు కాంట్రాక్ట్‌ బేసిక్‌ కింద డాక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. 

గైనకాలజిస్ట్‌ లేక గర్భిణుల అవస్థలు 
ముఖ్యంగా గర్భిణులకు సాధారణ ప్రసవాలు తప్పితే మేజర్‌ సమస్యలు వస్తే, ఆ కేసులను ఇతర ఆస్పత్రులకు పంపిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు గైనకాలజిస్ట్‌ డాక్టర్లు రాగా, వీరు ముగ్గురు రిజైన్‌ చేసి వెళ్లిపోవడంతో ఆస్పత్రిలో గైనకాలజిస్ట్‌ లేక ఇబ్బందులకు గురవుతున్నారు. గైనకాలజిస్టు లేకపోవడంతో గర్భిణులు ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు గైనకాలజిస్ట్‌ ఉన్నప్పుడు ప్రసవాలు అధికంగా నమోదు అయ్యాయి.   

పరీక్షలకే పరిమితమవుతున్న డాక్టర్లు 
రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన వారికి ప్రధమ చికిత్సతో పాటు గాయమైన చోట పట్టి కట్టాల్సి ఉంటుంది. నాలుగు వార్డు బాయ్‌ పోస్టులు ఖాళీగా ఉండటంతో స్వీపర్లే ప్రథమ చికిత్స అందిస్తూ కాలు, చేయికి పట్టికడుతారు. ఆస్పత్రిలో ఐదుగురు డాక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఆర్థోపెడిక్‌ డాక్టర్లు ఇద్దరు, అనస్తీషియా ఒకరు, చిల్ట్రన్‌ స్పెషలిస్టు ఒకరు, డెంటిస్ట్‌ డాక్టర్‌ ఒకరు వైద్య విధాన పరిషత్‌ ద్వారా ఈ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. ఆర్థోపెడిక్‌కు సంబంధించిన కనీసం ఫిజియో«ధెరపి చేసే పరికరాలు లేవు. ఏ శస్ట్ర చికిత్స చేద్దామన్న అందుకు తగ్గ పరికరాలు లేవు. దీంతో డాక్టర్లు కేవలం పరీక్షలు మాత్రమే చేస్తూ మందులు మాత్రమే ఇస్తున్నారు. 

నిరుపయోగంగా ఎక్స్‌రే ప్లాంట్‌ 
హుస్నాబాద్‌ ఆస్పత్రిలో ఎక్స్‌రేప్లాంట్‌ అలంకారప్రాయంగా దర్శనమిస్తుంది.  ప్రాధమిక ఆరోగ్య కేంద్రంగా ఉన్న సమయంలో ఆస్పత్రిలో ఎక్స్‌రే ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. అప్పుడు సైతం రేడియో గ్రాఫర్‌ లేకపోవడం, దానిని వినియోగంలోకి తీసుకురాకలేకపోవడంతో ఎక్స్‌రే ప్లాంట్‌ పని చేయకుండా పోయింది. ఈ ప్లాంట్‌ను ఇనుప సామానుకిందనే పడేశారు. ఆస్పత్రిని అప్‌గ్రేడ్‌ చేశాక కొత్త ఎక్స్‌రే ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నేటి వరకు రేడియోగ్రాఫర్‌ ఎవరు రాకపోవడంతో నిరుపయోగంగానే ఉంది.   

అధికారులకు నివేదిక ఇచ్చాం.. 
ప్రభుత్వ ఆస్పత్రిలో రోజుకు దాదాపు 400 మంది రోగులకు పైగా అవుట్‌ పేషంట్లకు వైద్య సేవలు అందిస్తున్నాం. వైద్య విధాన పరిషత్‌లోకి ఆస్పత్రిని చేరుస్తామని చెబుతున్నారు. దీంతో ఆపరేషన్లతో పాటుగా పూర్తి స్థాయిలో సదుపాయాలు. డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండే అవకాశం ఉంది. వైద్య పరికరాలు అందుబాటులోకి వస్తాయి. వైద్య విధానపరిషత్‌ ద్వారా ఐదు గురు డాక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఎక్స్‌రే ప్లాంట్‌ నిర్వాహణకు రేడియోగ్రాఫర్‌ అవసరముంది. ఈ విషయాల పై ఉన్నతాధికారులకు నివేధికను అందించాం. 
– డాక్టర్‌ సౌమ్య, ప్రభుత్వ వైద్యురాలు, హుస్నాబాద్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement