హుస్నాబాద్ మూడు ముక్కలు!
► సిద్దిపేటలో కలవనున్న హుస్నాబాద్?
► వెల్లడించిన ముఖ్యమంత్రి కేసీఆర్
► జీర్ణించుకోలేకపోతున్న జనం
► భవిష్యత్ కార్యాచరణపై కసరత్తు
హుస్నాబాద్ : హుస్నాబాద్ నియోజకవర్గం మూడు ముక్కలు కానుంది. నియోజకవర్గ కేంద్రంగా ఉన్న హుస్నాబాద్ మండలంతోపాటు కోహెడ మండలం కొత్తగా ఏర్పడే సిద్దిపేట జిల్లాల్లో కలవనుంది. ఇక భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలు వరంగల్ జిల్లాలో, సైదాపూర్, చిగురుమామిడి మండలాలు కరీంనగర్ జిల్లాలోనే కొనసాగనున్నారుు. హుస్నాబాద్‌ను జిల్లాకేంద్రంగా ఏర్పాటు చేయాలని స్థానికంగా ఉద్యమాలు చేస్తున్నా.. సీఎం కేసీఆర్ మాత్రం సిద్దిపేటలో కలిపేందుకే మొగ్గుచూపుతున్నట్లు వార్తలు వస్తుండడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. పరిపాలన సౌలభ్యం కోసమేన కొత్త జిల్లాల ఏర్పాటు అంటున్న కేసీఆర్.. నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేసే రూట్ మ్యాప్‌ను ప్రకటించడంతో ఇక్కడి ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. హుస్నాబాద్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని వారం రోజులుగా చేస్తున్న ఉద్యమాలు సీఎంకు తెలియడం లేదా..? ఇక్కడి ప్రజల ఆకాంక్షను ఆయన దృష్టికి ఎవరూ తీసుకెళ్లడం లేదా..? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్డీవో కార్యాలయంపైనా అనుమానాలు
ప్రస్తుతం నియోజకవర్గంలో ఆరు మండలాలున్నారుు. పరిపాలన సౌలభ్యం కోసమంటూ ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హుస్నాబాద్‌కు ఆర్డీవో కార్యాలయూన్ని మంజూరుచేసింది. కొన్ని అనివార్య కారణాలతో ప్రారంభానికి నోచుకోలేదు. తాజాగా హుస్నాబాద్‌ను సిద్దిపేట జిల్లాలో కలిపితే ఒక్క మండలానికి ఆర్డీవో కార్యాలయూన్ని ఎలా కేటారుుస్తారనే అనుమానం తెరపైకి వస్తోంది. ఆరు మండలాలు కలిసి ఉన్నప్పుడు ఏర్పడని రెవెన్యూ డివిజన్.. ఒక్క మండలంగా మిగిలిపోతే ఎలా ఇస్తారన్న ప్రశ్న ఉదరుుస్తోంది.
సమాలోచనలో అఖిలపక్ష పార్టీలు
కేవలం హుస్నాబాద్ మండలాన్ని సిద్దిపేట జిల్లాలో కలిపే అవకాశముందని సీఎం చెప్పడంతో అఖిలపక్ష నాయకులు సమాలోచనలో పడ్డారు. ఇన్ని రోజులు జిల్లా కావాలని, ఆర్డీఓ కార్యాలయాన్ని మంజూరు చేయాలని డిమాండ్‌తో రోజుకో కార్యక్రమం ద్వారా నిరసన తెలుపుతున్నారు. పిడుగులాంటి వార్త రావడంతో ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. నియోజకవర్గంలోని అన్ని పార్టీల ఆది నాయకులతో సమావేశం నిర్వహించి భవిష్యత్ ప్రణాళికను రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు. అవసరమైతే తెలంగాణ ఉద్యమంలాగా మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టి ఇక్కడి ప్రజల ఆకాంక్షను ప్రభుత్వానికి తెలిసేలా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని భావిస్తున్నారు. త్వరలోనే హుస్నాబాద్‌కు బంద్‌కు పిలుపునివ్వనున్నట్లు అఖిల పక్ష నాయకుల సమాచారం.
.
ఏకాకిగా హుస్నాబాద్?
హుస్నాబాద్ మండలంలోని మీర్జాపూర్, కేశ్వాపూర్, మల్లంపల్లి, మోత్కులపల్లి, ఉమ్మాపూర్, చౌటపల్లి, జిల్లెల్లగడ్డ ప్రాంతాలు గతంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉండేవి. ఆప్పుడు ఈ ఏడు గ్రామాలు అసలే అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడు హుస్నాబాద్‌ను సిద్దిపేటలో విలీనం చేస్తే ఆ గ్రామాల పరిస్థితే పడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. కరీంనగర్ జిల్లాలోనే పెద్ద నియోజకవర్గ కేంద్రంగా ఉన్న హుస్నాబాద్‌ను సిద్దిపేటలో చేర్చి ఒంటరి చేసే ప్రయత్నం జరుగుతోందని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.