Telangana: మళ్లీ ‘షేక్‌హ్యాండ్‌’.. ఆసక్తిరేపుతున్న కాంగ్రెస్‌లో చేరికలు | Former MLA Praveen Reddy Joins Congress Party | Sakshi
Sakshi News home page

Telangana: మళ్లీ ‘షేక్‌హ్యాండ్‌’.. ఆసక్తిరేపుతున్న కాంగ్రెస్‌లో చేరికలు

Published Wed, Jul 20 2022 2:04 AM | Last Updated on Wed, Jul 20 2022 1:46 PM

Former MLA Praveen Reddy Joins Congress Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీలో ఘర్‌ వాపసీ కార్యక్రమం చేపట్టినట్టు కనిపిస్తోంది. 2014 తర్వాత పార్టీని వదిలి వెళ్లిన పాత నాయకులను మళ్లీ సొంత గూటికి ఆహ్వానిస్తూ పునర్వైభవం కోసం ప్రయత్నిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడితోపాటు కీలక నేతలంతా కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీలోకి తిరిగి రప్పించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

నెల రోజుల నుంచి పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతున్న హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ఎట్టకేలకు మంగళవారం కాంగ్రెస్‌లో చేరారు. ఢిల్లీలో రాజ్యసభ పక్షనేత, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే నివాసంలో టీపీసీసీ రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఇదే దారిలో ఆ పక్క నియోజకవర్గమైన మానకొండూర్‌ కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత టీఆర్‌ఎస్‌ నేత ఆరేపల్లి మోహన్‌ సైతం పార్టీలోకి మళ్లీ వస్తున్నట్టు సమాచారం.

అదేవిధంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ నుంచి ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్న నలుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ సైతం పార్టీలోకి వస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. రంగారెడ్డి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ఒకరు, మాజీ ఎమ్మెల్సీ ఒకరు త్వరలోనే పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఇకపోతే గతంలో కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్సీలుగా పనిచేసి ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఏమాత్రం సంతృప్తిగా లేని ముగ్గురు మాజీ ఎమ్మెల్సీలు సైతం మళ్లీ కాంగ్రెస్‌ కండువా కప్పుకునేందుకు కీలక నేతలను సంప్రదించినట్టు తెలుస్తోంది. 

రగులుతున్న అసంతృప్తి  
అయితే, ఈ చేరికలపై పార్టీలో కొంతమందిలో అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. హుస్నాబాద్‌లో ప్రవీణ్‌రెడ్డి చేరికతో అక్కడ యాక్టివ్‌గా ఉన్న బొమ్మ శ్రీరామ్‌ చక్రవర్తి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తంచేశారు. అదేవిధంగా మానకొండూర్‌లోనూ ఆ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ సైతం ఆరేపల్లి మోహన్‌ రాకను వ్యతిరేకిస్తున్నట్టు తెలిసింది. ఇటు మహబూబ్‌నగర్‌లోనూ మాజీ ఎమ్మెల్యేల రాక ప్రస్తుత నేతల్లో కాక పుట్టిస్తోంది.

ఒక చేరిక రెండు సవాళ్లుగా మారనున్నట్టు సీనియర్లు చర్చించుకుంటున్నారు. అయితే పార్టీ అధికారంలోకి వస్తేనే అందరికీ మనుగడ ఉంటుందని, అసంతృప్తి రాజకీయాల వల్ల మొత్తానికే ఇబ్బంది ఏర్పడుతుందని ముఖ్యనేతలు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. పార్టీ పునర్వైభవం కోసం తప్పదంటూ ముందుకెళ్తున్నట్టు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement