అన్ని పార్టీల లక్ష్యం గెలుపే. పోటీలో దీటైన అభ్యర్థిని నిలిపేందుకే వ్యూహం. ఆలస్యమైనా ఆచితూచి అడుగులేస్తున్న రాజకీయ పక్షాలు. బరిలో నిలిచేందుకు పోటీపడి దరఖాస్తు చేసుకున్నా.. టికెట్ల విషయంలో సమవుజ్జీ అభ్యర్థులను నిలిపే అన్వేషణలో పడ్డాయి. ప్రధాన పార్టీల టికెట్ల పంపకాలు.. మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయ్యాక ప్రధాన నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తే రాజకీయంగా ఉపయోగం ఉంటుందని భావిస్తున్న ఆయా పార్టీలు ఆ దిశగా ఆలోచించి నిర్ణయం తీసుకునే పనిలో నిమగ్నమయ్యాయి.
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, వైరా, భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట, మధిర నియోజకవర్గాల్లో సీపీఎం, బీఎల్‌ఎఫ్ కూటమి తమ అభ్యర్థులను ప్రకటించింది. రెండు విడతలుగా జాబితాను ప్రకటించిన సీపీఎం, బీఎల్‌ఎఫ్.. ఉమ్మడి జిల్లాలో జనరల్ స్థానాలుగా ఉన్న ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు మినహా ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇల్లెందులో మాత్రం తమ అభ్యర్థిని పోటీకి నిలపకుండా సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నుంచి పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు మద్దతు తెలిపింది. భద్రాచలం నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ మిడియం బాబూరావును సీపీఎం, బీఎల్‌ఎఫ్ తరఫున అభ్యర్థిగా ప్రకటించగా.. ప్రచారంలో నిమగ్నమయ్యారు.
ఇక కొత్తగూడెం, ఖమ్మం, పాలేరు స్థానాల నుంచి సీపీఎం, బీఎల్‌ఎఫ్ కూటమి పోటీ చేయడం ఖాయమే అయినా.. ఆయా నియోజకవర్గాల్లో తమకు గల పట్టును నిరూపించుకుని ప్రధాన రాజకీయ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చి విజయం సాధించే స్థాయిలో ఉండాలన్న లక్ష్యంతో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ తరఫున టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడం.. అలాగే మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాలు టీడీపీ, సీపీఐ సైతం ఇవే స్థానాలు కావాలని పట్టుపట్టడంతో ఈ స్థానాలు ఎవరికి ఖరారవుతాయి.. ఎవరు పోటీ చేస్తారనే అంశం ఉత్కంఠకు తెరలేపుతోంది.
దీంతో పార్టీ టికెట్ ఆశించిన ఆశావహులు తమ కూటమి వైపు చూసే అవకాశం ఉందని భావిస్తున్న సీపీఎం, బీఎల్‌ఎఫ్ వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. టీఆర్‌ఎస్ నుంచి మధిర టికెట్ ఆశించిన డాక్టర్ కోట రాంబాబుకు పార్టీ టికెట్ దక్కలేదు. దీంతో ఆయన బీఎల్‌ఎఫ్ తరఫున పోటీ చేసేందుకు సిద్ధం కావడంతో మధిర టికెట్‌ను ఆయనకు కేటాయించారు. ఈ ప్రయోగం మధిరలో విజయవంతం కావడంతో ఖమ్మం, పాలేరు, కొత్తగూడెంలో కూడా ఇదే తరహాలో పలువురు నేతలు బీఎల్‌ఎఫ్, సీపీఎం కూటమికి చేరువయ్యే అవకాశం ఉందని కూటమి భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ కూటమి తరఫున పోటీ చేస్తున్న ఆరు నియోజకవర్గాల అభ్యర్థులు ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టగా.. ఇల్లెందులో గుమ్మడి నర్సయ్యకు మద్దతుగా సీపీఎం, బీఎల్‌ఎఫ్ కూటమి ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది.
ఆశావహులు అనేకం..
ఇల్లెందు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు అనేక మంది ఆశావహులు ఇప్పటికే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పలువురు ప్రచారం సైతం ప్రారంభించారు. మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాల్లో సీట్ల సర్దుబాటులో భాగంగా తమకు అవకాశం రాకపోతే.. కోరుకున్న సీటు చేజారితే ఏమి చేయాలనే అంశంపై ఇప్పటినుంచే ఆశావహులు దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిని తమకు అనుకూలంగా మలచుకోవాలని ఇటు సీపీఎం, బీఎల్‌ఎఫ్ కూటమి.. మరోవైపు భారతీయ జనతా పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ సైతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించగా.. ఇప్పటివరకు జిల్లాలో కేవలం నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. భద్రాచలం నుంచి మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి, పినపాక నుంచి బీజేపీ నేత చందా లింగయ్య కుమారుడు సంతోష్, సత్తుపల్లి నుంచి నంబూరి రామలింగేశ్వరరావు, పాలేరు నుంచి కొండపల్లి శ్రీధర్‌రెడ్డిలను అభ్యర్థులుగా ప్రకటించింది.
రాజకీయంగా అత్యంత కీలకంగా ఉన్న ఖమ్మం, కొత్తగూడెం స్థానాలకు అభ్యర్థులను బీజేపీ సైతం ప్రకటించకపోవడానికి కారణం ప్రధాన రాజకీయ పక్షాల నుంచి అభ్యర్థులు ఖరారు కాకపోవడమేనని, ఆయా పార్టీల జాబితా ఖరారైన తర్వాత అభ్యర్థులను ప్రకటించడం వల్ల రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని బీజేపీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే జనరల్ స్థానాలపై ఖమ్మం, కొత్తగూడెం నుంచి ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఈసారి ఎక్కువ మంది టికెట్లు ఆశించడం.. ఆ పార్టీ వర్గాల్లో ఉత్సాహాన్ని ఇస్తోంది. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ సైతం ఉమ్మడి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో పోటీచేసే అభ్యర్థులను జాబితాను ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఇల్లెందు నుంచి మరోసారి పోటీ చేస్తారని ప్రకటించగా.. జనరల్ స్థానమైన పాలేరు నుంచి పార్టీ సీనియర్ నేత గుర్రం అచ్చయ్యను అభ్యర్థిగా ప్రకటించింది.
అలాగే సత్తుపల్లి, అశ్వారావుపేట, పినపాక నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ.. ఖమ్మం, కొత్తగూడెంలో మాత్రం అభ్యర్థులను ప్రకటించలేదు. రాబోయే రాజకీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఆయా పార్టీలు జనరల్ స్థానాల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారైన తర్వాత తమ అభ్యర్థులను ప్రకటించడం వల్ల రాజకీయంగా ఉపయోగం ఉంటుందని భావిస్తున్న ఆయా పార్టీలు జనరల్ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే విషయంలో వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మహాకూటమి సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటన పూర్తయితే తప్ప జిల్లాలో ప్రధాన రాజకీయ పక్షాల నుంచి ఎవరు ఎక్కడ పోటీ చేస్తారనే అంశంపై పూర్తిస్థాయిలో స్పష్టత లభించే అవకాశం లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment