
సాక్షి,సిటీబ్యూరో: ఎన్నికల బరిలో పెరిగిన పోటీ.. ఎవరికి వారే అందరి కంటే ముందే రాకెట్‌లా దూసుకుపోవాలన్నట్టు వ్యూహం. తమతమ నియోజకవర్గాల్లో భూచక్రంలా తిరుగుతూ ఎవరికివారే ప్రచార హోరుతో దూకుడు. వెంట చిచ్చుబుడ్డిలా రెచ్చిపోయే అనుచరుల గణం.. నగరంలో నడుస్తున్న రాజకీయంలో ఈ దివాళీ ప్రత్యేకం. ఓట్ల సమరానికి మిగిలింది సరిగ్గా 30 రోజులే. ముంచుకొస్తున్న ముందస్తు ఎన్నికలతో నగరంలో నాయక గణమంతా రకరకాల వ్యూహాలు, ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. నగరంలో టీఆర్‌ఎస్ మెజారిటీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రజాకూటమి సైతం దాదాపు ఖరారైన అభ్యర్థులకు అంతర్గతంగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. ఎంఐఎం, బీజేపీ లీడర్లు ఇప్పటికే ప్రచార హోరులో మునిగి తేలుతున్నారు. దీంతోపాటు ధన్‌తేరస్ రోజున తమ విజయాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేసి, దీపావళి రోజున నేల నుంచి నింగిలోకి దూసుకెళుతూ వెలుగులు విరజిమ్మే రాకెట్ లాంటి ప్రచార దళాలను, భూ చక్రంలా చివరి లక్ష్యం వరకు విరామం లేకుండా తిరిగే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. కాలేది కొద్ది సేపైనా అందరి దృష్టిని ఆకర్షించేచిచ్చుబుడ్డి లాంటి కళా, సోషల్ మీడియా బృందాలను లక్ష్య సాధన దిశగా రంగంలోకి దింపనున్నారు. ఇప్పటికే ఆయా బృందాలను సిద్ధం చేసుకున్న నాయకులు వీధి, అపార్ట్‌మెంట్, వార్డు వారిగా యాక్షన్ ప్లాన్‌తో కదన రంగంలోకి దింపేందుకు సమీప పోలీస్‌స్టేషన్లలో అనుమతులకు దరఖాస్తులు చేశారు.
‘తారా’జువ్వల సందడే సందడి
ఎన్నికల ప్రక్రియంలో నామినేషన్ ప్రక్రియ ఈనెల 12వ తేదీ నుంచి ప్రారంభమవుతుండడంతో స్టార్ సెలబ్రిటీలు, స్టార్ క్యాంపెయినర్లతో నగరం మరింత సందడిగా మారనుంది. నగరంలో 24 నియోకజవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు, తెలంగాణ జిల్లాల ఓటర్లు స్థిరపడ్డ Tకాలనీలు, బస్తీల్లో ఆయా ప్రాంతాల ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనున్నారు. దీనికి తోడు ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ వంటి అగ్రశ్రేణి నేతల ప్రచార సభలు, సదస్సులు నగరంలో నిర్వహించేందుకు ఆయా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. వీరికి అదనంగా సోషల్ మీడియాతో పాటు బస్తీలు, గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రత్యేక కళాబృందాల ప్రదర్శలను ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. మొత్తంగా దీపావళి రోజు నుంచి ఎన్నికల ప్రచార రంగంలోకి దిగుతున్న నేతలంతా విజయమే లక్ష్యంగా కదలుతుండడంతో నిజంగా ఈ దీపావళి ఎవరికి విజయాన్ని అందిస్తుంది.. ఎవరిని దివాళాగా మారుస్తుందన్న విషయం తేలేందుకు ముఫ్పై రోజులు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment