కాంగ్రెస్‌లో తారస్థాయికి చేరిన గ్రూపు తగాదాలు | Congress Leaders Fighting For MLA Seats Mahabubnagar | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో తారస్థాయికి చేరిన గ్రూపు తగాదాలు

Published Sat, Oct 27 2018 9:00 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress Leaders Fighting For MLA Seats Mahabubnagar - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ :  ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆది నుంచి బలంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో.. అదే స్థాయిలో గ్రూప్‌ తగాదాలు కూడా ఉన్నాయని చెబుతారు. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టేందుకు అన్ని యత్నాలు చేస్తున్నామని చెబుతున్న ‘హస్తం’ నేతలు ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పార్టీలోని నేతల్లో ఇప్పటికే ఉన్న అంతర్‌యుద్ధం... ఎన్నికలు సమీపిస్తున్న వేళ తారస్థాయికి చేరాయి. జిల్లాలో డీకే.అరుణ, జైపాల్‌రెడ్డి రెండు వర్గాలుగా చీలిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు సాగుతుండడంతో పార్టీ నష్టం జరిగే అవకాశముందని శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మహాకూటమి పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు సీట్లు కేటాయించాలనే సాకుతో డీకే. అరుణ వర్గం నేతలు టికెట్లు ఆశిస్తున్న స్థానాలను ప్రతిపాదిస్తున్నారనే అంశం తాజాగా పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ బలంగా ఉన్న స్థానాలను ఇతరులకు ఎలా కేటాయిస్తారంటూ రెండు రోజులుగా నేతలు వాదనలు, ప్రతివాదనలతో హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ను అట్టుడికిస్తున్నారు. ప్రధానంగా ఏఐసీసీ ప్రతినిధి బృందం శుక్రవారం హైదరాబాద్‌ వచ్చిన క్రమంలో అక్కడ కూడా ఇదే పరిస్థితి ఎదురైనట్లు సమాచారం.

పొత్తుతో చిచ్చు 
టీఆర్‌ఎస్‌ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలో టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు కలిసి మహాకూటమిగా జట్టు కట్టినట్లు చెప్పుకుంటున్నాయి. ఈ మేరకు ఎన్నికల బరిలో నిలిచే విషయంలో కూటమి భాగస్వామ్య పార్టీలకు అవకావం కల్పించాలని సమిష్టిగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పాలమూరు జిల్లాలో కూడా స్థానాల కేటాయింపుపై పలు దఫాలుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే పొత్తులో భాగంగా కేటాయించాల్సిన స్థానాల విషయంలో తఖరారు నెలకొంది. దీంతో జిల్లాలోని రెండు వర్గాలు చెరోవైపు చీలిపోయి ఎదుటి వర్గం వారికి అనుకూలంగా ఉన్న సీట్లను ప్రతిపాదిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీలో సీనియర్‌ అయిన జైపాల్‌రెడ్డి తనదైన శైలిలో చక్రం తిప్పుతూ... డీకే.అరుణ వర్గానికి చెక్‌ పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయా వర్గాలు చెబుతున్నాయి.

కూటమి భాగస్వామ్యంలో భాగంగా దేవరకద్ర, మక్తల్‌ స్థానాలను టీడీపీకి కేటాయించాలంటూ జైపాల్‌రెడ్డి పట్టుబడుతున్నట్లు పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. దీంతో గత కొంత కాలంగా ఆయా నియోజకవర్గాల్లో పనిచేసుకుంటున్న డీకే.అరుణ వర్గానికి చెక్‌ పెట్టొచ్చన్నది వారి భావనగా తెలుస్తోంది. అంతేకాదు రెండు స్థానాలను టీడీపీ నేతలైన రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కొత్తకోట దయాకర్‌రెడ్డికి ఇవ్వాలని కూడా ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ పరిధిలో బీసీలకు అవకాశం ఇవ్వడం కోసం నారాయణపేట నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సరాఫ్‌ కృష్ణకు టికెట్‌ ఇవ్వాలంటూ జైపాల్‌రెడ్డి పట్టుబడుతున్నట్లు తెలిసింది. దీంతో అరుణ మనిషిగా పార్టీలో చేరిన కుంభం శివకుమార్‌రెడ్డికి చెక్‌ పెట్టొచ్చని భావించినట్లు సమాచారం. అలాగే కొల్లాపూర్‌లో కూడా బీరం హర్షవర్ధన్‌రెడ్డికి... జైపాల్‌ వర్గం ఇబ్బందులు సృష్టిస్తోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలా మొత్తం మీద.డీకే అరుణకు పట్టు ఉన్న నాలుగు నియోజకవర్గాలలో చెక్‌ పెట్టేందుకు జైపాల్‌ వర్గం యత్నిస్తోందన్న చర్చ పార్టీలో సాగుతోంది.

రాజధానిలో అరుణ 
పార్టీలో అంతర్గతంగా జైపాల్‌రెడ్డి వేస్తున్న స్కెచ్‌ను పసిగట్టిన డీకే.అరుణ... ఆగమేఘాలపై హైదరాబాద్‌ వెళ్లారని ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. పార్టీలో మొదటి నుంచి ఉంటూ.. గత ఎన్నికల్లో ఓడిపోయినా నాలుగున్నరేళ్లుగా నియోజకవర్గంలో పార్టీని బతికించిన వారికి కాకుండా వేరే వారికి సీట్లను ఎలా కేటాయిస్తారంటూ ఆమె ప్రశ్నించినట్లు సమాచారం. తన వర్గం మనుషులు పనిచేసుకుంటున్న కొల్లాపూర్, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో ఎవరికి ఎంత పట్టుందనే అంశంపై చేసిన సర్వేల నివేదికలను పార్టీ పెద్దలకు అందజేసినట్లు తెలుస్తోంది. ఆయా స్థానాల్లో పనిచేసుకుంటున్న వారిని కాదని వేరే వారికి అవకాశం కల్పిస్తే.. పార్టీ తీవ్రంగా నష్టపోతుందని అరుణ స్పష్టం చేసినట్లు సమాచారం.

మళ్లీ 2004 నాటి పరిస్థితులు? 
పాలమూరులో బలంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ రెండు వర్గాల ఆదిపత్య పోరుతో తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని ద్వితీయశ్రేణి నాయకత్వం ఆవేదన చెందుతోంది. పొత్తులో భాగంగా పార్టీకి బలమున్న స్థానాలను కేటాయిస్తే.. 2004 నాటి పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. 2004లో కూడా టీఆర్‌ఎస్‌తో పొత్తు కారణంగా వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి వర్గంగా ముద్ర పడిన వారికి సీట్లు దక్కకుండా జైపాల్‌రెడ్డి చక్రం తిప్పినట్లు పార్టీ నేతలు ప్రస్తావిస్తున్నారు. అప్పుడు కూడా మహబూబ్‌నగర్‌లో పులి వీరన్న, గద్వాలలో డీకే.అరుణ, అలంపూర్‌లో చల్లా వెంకట్రాంరెడ్డి, కొల్లాపూర్‌లో జూపల్లి కృష్ణారావుకు సీట్లు దక్కకుండా టీఆర్‌ఎస్‌కు కేటాయించినట్లు చెబుతున్నారు. దీంతో ఆయా నేతలందరూ రాజశేఖర్‌రెడ్డి మద్దతుతో ఇండిపెండెంట్లుగా పోటీ చేసి గెలుపొంది అనంతరం పార్టీలో చేరారు. ప్రస్తుతం కూడా కూటమి భాగస్వామ్యంలో భాగంగా సీట్ల కేటాయింపు, తదితర కారణాల వల్ల గత చరిత్ర పునరావృతమవుతుందా అన్న చర్చ కాంగ్రెస్‌ వర్గాల్లో మొదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement