సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కాంగ్రెస్‌లో కౌంట్‌డౌన్ మొదలైంది. అభ్యర్థుల ఖరారుకు ఆ పార్టీ ముహూర్తం ఖరారు చేస్తోంది. నేడో, రేపో అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఏకాభిప్రాయం ఉన్న అభ్యర్థుల పేర్లను ప్రకటించడానికి రంగం సిద్ధం చేసింది. టికెట్ పోటీ తీవ్రంగా ఉన్న సెగ్మెంట్లు.. టీడీపీ, టీజేఏసీ పట్టుబడుతున్న స్థానాలను ప్రస్తుతానికి పక్కనపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు లైన్‌క్లియర్‌గా ఉన్న సీట్లకు అభ్యర్థులను ప్రకటించనుంది.
గురువారం సోనియాగాంధీ అధ్యక్షతన జరిగే స్క్రీనింగ్ కమిటీ కీలకభేటీ అనంతరం ఈ జాబితాకు విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయడమేగాకుండా ప్రచారాన్ని కూడా ఉధృతంగా కొనసాగిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధినాయకత్వం కూడా ఏకాభిప్రాయం వ్యక్తమవుతున్న సీట్లను ప్రకటించాలని నిర్ణయించింది. ఈ మేరకు పలు దఫాలుగా అభ్యర్థుల కూర్పుపై మల్లగుల్లాలు పడ్డ భక్తచరణ్‌దాస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ.. తుది జాబితాను ఏఐసీసీకి నివేదించింది.
ఈ జాబితాను బుధవారం పార్టీ అధినేత రాహుల్‌గాంధీ పరిశీలించి దాదాపుగా ఆమోదముద్ర వేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలావుండగా, మొదటి జాబితాలో మహేశ్వరం, కల్వకుర్తి, కొడంగల్, పరిగి, షాద్‌నగర్, ఎల్‌బీనగర్, కుత్బుల్లాపూర్, మేడ్చల్ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. ఆశావహుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, తాండూరు, వికారాబాద్ సెగ్మెంట్ల అభ్యర్థులను రెండో జాబితాలో వెల్లడించే వీలుంది.
Comments
Please login to add a commentAdd a comment