మేం రెడీ.. | Rachakonda Police Commissioner Special Interview Telangana Elections | Sakshi
Sakshi News home page

మేం రెడీ..

Published Mon, Dec 3 2018 9:27 AM | Last Updated on Wed, Dec 19 2018 11:08 AM

Rachakonda Police Commissioner Special Interview Telangana Elections - Sakshi

పోలింగ్‌ రోజు బయటకు రావడానికి ఒకరకమైన భయం.. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందోనని.. పోలింగ్‌ కేంద్రానికి ఓటు వేయడానికి వెళ్లాలంటే జంకు.. ఇది ఒకప్పటి మాట.. ఇప్పుడా పరిస్థితులు లేవు. ఎన్నికలు జరిగే రోజు (ఈనెల 7) గ్రేటర్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా మూడు కమిషనరేట్లు పకడ్బందీ ఏర్పాటు చేశాయి. అదనపు సిబ్బందిని వినియోగించడంతోపాటు   భద్రతాబలగాలను కూడా రంగంలోకి దింపారు. ఎన్నికల సందర్భంగా తీసుకున్న చర్యల గురించి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు అంజనీ కుమార్, సజ్జనార్,  మహేష్‌ భగవత్‌లు సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. 

సాక్షి, సిటీబ్యూరో : ‘పోలింగ్‌ రోజున నగర వ్యాప్తంగా ఏ చిన్న ఉదంతం జరిగినా.. జరుగుతుందనే సమాచారం ఉన్నా గరిష్టంగా మూడు నిమిషాల్లో అక్కడకు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ రెస్పాన్స్‌ టైమ్‌ టార్గెట్‌ను పూర్తి చేయడానికి స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తున్నాం’ 

రెండు నెలలుగా కసరత్తు
హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలోకి 15 నియోజకవర్గాలు పూర్తిగా, మరో నాలుగు పాక్షికంగా వస్తాయి. వీటిలో దాదాపు 3800 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటుకానున్నాయి. 19 కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయి. వీటితో సహా మొత్తం 11 వేల మంది పోలీసుల్ని  వినియోగిస్తున్నాం. గతానికి భిన్నంగా ఈసారి ఓ ప్రత్యేక మహిళా బెటాలియన్‌ సైతం అందుబాటులోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల క్రతువు సజావుగా పూర్తి చేయడానికి అవసరమైన కసరత్తును దాదాపు రెండు నెలలుగా చేస్తున్నాం. ఫ్లాగ్‌ మార్చ్‌లతో పాటు ఆయా పోలింగ్‌ స్టేషన్లు, కీలక ప్రాంతాలను అనునిత్యం సందర్శిస్తూనే ఉన్నాం. పోలింగ్‌ కోసమే ప్రత్యేకంగా 10 వేల సీసీ కెమెరాలు వినియోగిస్తున్నాం. 

రూ.21 కోట్లు సీజ్‌ చేశాం
అసాంఘికశక్తులతో పాటు రౌడీషీటర్లను బైండోవర్‌ చేశాం. 2014తో పోలిస్తే ఈ ఏడాది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వర్క్‌ గణనీయంగా పెరిగింది. గత ఎన్నికల నేపథ్యంలో మొత్తమ్మీద రూ.12 లక్షలు మాత్రమే స్వాధీనమయ్యాయి. ఈసారి ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో రూ.21 కోట్లు సీజ్‌ చేశాం. ఈ చర్యలను ఇటీవల నగరాన్ని సందర్శించిన కేంద్ర ఎన్నికల కమిషనర్‌ సైతం ప్రశంసించారు. మొత్తమ్మీద మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ (ఎంసీసీ) ఉల్లంఘనలకు సంబంధించి 112 కేసులు నమోదు చేశాం. ఇప్పటికే నాలుగు కేసుల్లో అభియోగపత్రాల దాఖలు సైతం పూర్తయింది. మిగిలిన కేసుల్లోనూ ఎన్నికల తర్వాత దాఖలు చేస్తాం. పోలింగ్‌ సజావుగా సాగడానికి, ఓటర్లపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చేయడానికి నేర చరితులంతా అదుపులో ఉండాలి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం పెండింగ్‌లో ఉన్న నాన్‌–బెయిలబుల్‌ వారెంట్లను ఎగ్జిక్యూట్‌ చేయమని స్పష్టం చేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న నగర పోలీసులు ఇప్పటి వరకు 3800 ఎన్‌బీడబ్ల్యూలు ఎగ్జిక్యూట్‌ చేశారు. ఈ చర్యల్ని కొనసాగిస్తున్నారు. 

డిపాజిట్‌ చేయని ఆయుధ లైసెన్సులు రద్దు
ఎన్నికల నేపథ్యంలో నగరంలో ఉన్న అన్ని లైసెన్సెడ్‌ ఆయుధాలను డిపాజిట్‌ చేయాల్సిందిగా స్పష్టం చేశాం. కేవలం బ్యాంకుల భద్రతకు వినియోగించే వాటితో పాటు స్పోర్ట్స్‌ మెన్స్‌ వాడే వాటికి మాత్రమే మినహాయింపు ఇచ్చాం. వీటితో పాటు మరికొందరు సైతం ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో మినహాయింపు కోరారు. అలా కాకుండా ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆయుధాలను డిపాజిట్‌ చేయని వారి లైసెన్సుల్ని రద్దు చేయాలని నిర్ణయించుకున్నాం. సెక్టార్ల వారీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల్ని ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తున్నాం.  ఇప్పటి వరకు సిటీలో 38 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాం. ఈ తరహా ప్రాంతాలను గుర్తించాం. అక్కడ కేంద్ర బలగాలు పహారాలో ఉంటాయి. వీటితో పాటు కీలక ప్రాంతాల్లోనూ వాటినే మొహరిస్తున్నాం. 

సంక్షేమానికీ పెద్దపీట  
బందోబస్తు, భద్రతా విధుల్లో ఉండే సిబ్బంది సంక్షేమానికీ పెద్దపీట వేస్తున్నాం. పోలింగ్‌ రోజున ప్రత్యేకంగా ఒక్కొక్కరికీ రూ.250 చొప్పున కేటాయిస్తున్నాం. అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రి భోజనాలకు ఈ మొత్తం ఆయా ఇన్‌స్పెక్టర్లు అందిస్తారు. వాహనాల అద్దెకు అవసరమైన నిధుల్ని జోనల్‌ డీసీపీలకు ఇచ్చాం. మరోపక్క సమస్యాత్మక వ్యక్తులను అనునిత్యం వెంటాడటానికి ప్రత్యేకంగా 100 షాడో పార్టీలు ఏర్పాటుచేశాం.

హైదరాబాద్‌ పోలీస్‌కమిషనర్‌ అంజనీ కుమార్‌ :పోలింగ్‌ కేంద్రంలో ఏం జరిగినా తెలిసిపోతుంది
‘నగర శివారు ప్రాంతాలతో పాటు ఐటీ కారిడార్‌ ఉన్న సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఉన్న 1,066 పొలింగ్‌ కేంద్రాల్లో ఏ చిన్న ఘటన జరిగినా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు క్షణాల్లో సమాచారం అందుతుంది..ఆయా పొలింగ్‌ కేంద్రాలకు గస్తీ వాహనాలు, డీసీపీ, ఏసీపీలు వస్తున్నారా, లేదా..ఎస్‌హెచ్‌ఓలు పర్యవేక్షిస్తున్నారా?  అనే విధుల సమాచారాన్ని కూడా తొలిసారిగా కొత్తగా నియమించిన లోకేషన్‌ లెవల్‌ పోల్‌ ఆఫీసర్‌(ఎల్‌ఎల్‌పీవో) తెలియజేయనున్నారు. ఏదైనా గొడవలు జరిగి క్షతగాత్రులైతే వెంటనే ఆస్పత్రులకు తరలించేలా సమీప ఆస్పత్రుల సమాచారం కూడా ఎల్‌ఎల్‌పీవోల వద్ద ఉండనుంది. ఇలా ఆయా పొలింగ్‌ కేంద్రానికి సంబంధించిన సమస్త సమాచారం ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.  పోలింగ్‌ కేంద్రాల్లో దాదాపు పదివేల వరకు సీసీటీవీ కెమెరాలు బిగించి సైబరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానించనున్నాం.

బందోబస్తుగా పదివేలమంది
సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని 1,066 పోలింగ్‌ కేంద్రాల్లో 150 వరకు సమస్యాత్మకంగా ఉన్నట్టు గుర్తించాం. సైబరాబాద్‌లో మొత్తం  2727 మంది సివిల్, 1079 మంది రిజర్వ్, 1022 మంది హోంగార్డులు, 102 మంది స్పెషల్‌ పోలీసుల సేవలు వినియోగించుకోనున్నాం.  బయటి జిల్లాల నుంచి రెండు వేల మంది పోలీసులను రప్పిస్తున్నాం. 29 కంపెనీల సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీసు ఫోర్స్‌ బలగాలు కూడా వచ్చాయి.  ఇప్పటివరకు రూ.1.83,43,225   నగదు, 300 లీటర్ల మద్యం, 3055 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నాం. పాత కేసుల్లో నిందితులైన 1696 మందిని బైండోవర్‌ చేశాం. 2389 మందికి నాన్‌బెయిలెటబుల్‌ వారంట్లు జారీ చేశాం. మొత్తం 1,356 లైసెన్స్‌లకు 1081 డిపాజిట్‌ చేశారు. అయితే 105 మందికి మినహాయింపునిచ్చాం.

ఐటీ ఉద్యోగుల పొలింగ్‌ పెంపుపై దృష్టి
ఐటీ కారిడార్‌లో ఉన్న దాదాపు నాలుగు లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేలా ఇప్పటికే అవగాహనకు శ్రీకారం చుట్టాం. ఎన్నికల సంఘంతో కలిసి సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సహాకారంతో ఐటీ కంపెనీ ఉద్యోగులతో ఈవీఎం, వీవీప్యాట్‌ల పనితీరుపై కూడా అవగాహన కలిగించాం. ఐటీ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కలిగించడంతో పాటు ఆరోజు ఆయా కార్యాలయాలకు సెలవు ప్రకటించాలని వివరించాం. -సైబరాబాద్‌ పోలీసుకమిషనర్‌ సజ్జనార్‌  

సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా - రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌  
నగర శివారు ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల వరకు ఉన్న రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంపై అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం.  3063 పోలింగ్‌ కేంద్రాలున్న రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో సమస్యాత్మకంగా ఉన్న 509 పోలింగ్‌ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాం. 

ఫ్లాగ్‌ మార్చ్‌తో ప్రజల్లో ఆత్మవిశ్వాసం  
ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ఫ్లాగ్‌మార్చ్‌ చేస్తున్నాం. భద్రతా పరంగా ఎలాంటి ఆందోళన లేదనే సంకేతాలను ప్రజలకు ఇవ్వగలుగుతున్నాం. రాచకొండలో ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు 3,700 మందితో పాటు పది కంపెనీల సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీసు ఫోర్స్‌ సేవలను తీసుకుంటున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి మరో 2,200 మంది హోంగార్డులు పాల్గొంటున్నారు. ‘మహేశ్వరం, ఆలేరు, చౌటుప్పల్, ఘట్‌కేసర్, కీసర, అబ్దుల్లాపూర్‌మెట్, యాచారం మాల్‌ తదితర ప్రాంతాల్లో 11 తనిఖీ కేంద్రాల్ని ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచాం.  42 తక్షణ స్పందన బృందాలు, 27 స్టాటిక్‌        సర్వైలెన్స్‌ బృందాలు, 27 సంచార తనిఖీ బృందాలు, 8 స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ బృందాలు పని చేస్తున్నాయి.  నియామవళిని ఉల్లంఘించిన వారిపై ఇప్పటికే 31 ఎంసీసీ కేసుల్ని నమోదుచేశాం.

రౌడీషీటర్లను బైండోవర్‌ చేశాం
కమిషనరేట్‌ పరిధిలో ఎన్నికలు సజావుగా సాగేందుకు 520 మంది రౌడీ షీటర్లని ఇప్పటికే బైండోవర్‌ చేశాం. 1205 లైసెన్స్‌డ్‌ ఆయుధాల్లో 884 డిపాజిట్‌ అయ్యాయి.  305 మంది క్రీడాకారులు, ప్రైవేటు కాపలాదారులఆయుధాల కు మినహాయింపునిచ్చాం. దాదాపు 1800 మందికి నాన్‌బెయిలబుల్‌ వారంట్లు జారీచేశాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement