సాక్షి,సిటీబ్యూరో: ఎన్నికల ప్రచారం గ్రేటర్‌లో పతాకస్థాయికి చేరుకుంది. ఎన్నికల గడియారంలో ముల్లు వేగంగా తిరుగుతోంది. అభ్యర్థుల ప్రచార గడువు ఈనెల 5వతేదీ (బుధవారం) సాయంత్రంతో ముగుస్తున్నందున ప్రచారంలో జోరు పెంచారు. అంటే ప్రచారం ముగిసేందుకు మరో ఐదు రోజులు మాత్రమే అవకాశం ఉండడంతో అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెట్టారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు తమ సెగ్మెంట్ పరిధిలో రెండు విడతల ప్రచారాన్ని పూర్తి చేశారు. తుది అంకంలోనూ ప్రచార ర్యాలీలు, సభలు, పాదయాత్రలు, ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో హామీల వర్షంతో పాటు క్యాడర్‌కు, ఓటర్లకు భారీగా తాయిలాలు ప్రకటిస్తున్నారు. పంపకాల బాధ్యతలను కూడాఎక్కడికక్కడే నేతలకు అప్పజెప్పడం విశేషం. గ్రేటర్ పరిధిలోని సుమారు 24 నియోజకవర్గాల్లో ఇప్పుడు విభిన్న రకాల ప్రచారాలతో అభ్యర్థులు ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆపసోపాలు పడుతుండడం పట్ల సిటీజన్లు చర్చించుకునేందుకు హాట్‌టాపిక్‌గా మారింది.
అగ్రనేతలపైనే అభ్యర్థుల ఆశలు
తాము పోటీ చేస్తున్న పార్టీల అగ్రనేతల ప్రచార హోరుతో తమ గెలుపు అవకాశాలు ఇక నల్లేరుమీద నడకేనని పలువురు అభ్యర్థులు విశ్వసిస్తున్నారు. కొన్నిరోజులుగా మహానగరంలో గతంలో ఎన్నడూలేని విధంగా జాతీయ పార్టీల అగ్రనేతలు, స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో సిటీ వాతావరణం వేడెక్కింది. ప్రధానంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు నడ్డా, సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్స్ విజయశాంతి, ఖుష్బూ, టీఆర్‌ఎస్ తరఫున కేటీఆర్ తదితరుల ప్రచారంతో ఎన్నికల పర్వం రసవత్తరంగా మారింది. వీరి ప్రచారంతో తమకు ఓట్ల వర్షం కురుస్తుందని అభ్యర్థులు కోటి ఆశలు పెట్టుకున్నారు. తాజాగా శుక్రవారం మాజీ క్రికెటర్లు అజారుద్దీన్ ఎర్రగడ్డలో కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేయగా.. మరో క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్‌సింగ్ సిద్ధూ చిక్కడపల్లిలో కూటమి అభ్యర్థి తరఫున ప్రచారం చేయడం విశేషం. జాతీయ స్థాయి నేతలు సైతం రాష్ట్రం, నగరంలో అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి పథకాల వైఫల్యాలు, పాలనలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో అమలు చేసిన పథకాలు, ప్రాజెక్టులను ప్రధానంగా పేర్కొంటున్నారు. ఆయా ప్రాజెక్టు పనుల్లో జరిగిన అవినీతిని ఎలుగెత్తి చాటుతున్నారు. ఇక తమ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై హామీల వర్షం కురిపిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థి గెలిస్తే స్థానికంగా చేపట్టనున్న పనులను ప్రస్తావిస్తుండడం గ్రేటర్ ఓటర్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
అభ్యర్థుల ముందు ప్రజల కోరికల చిట్టా
‘మా కాలనీకి దొంగల భయం అధికం. కాలనీ అంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. మేమంతా మీకే మద్దతిస్తాం. కానీ పోలింగ్ కంటే ముందే మా కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలి’.. మేడ్చల్ నియోజకవర్గంలోని పలు కాలనీలు ప్రధాన అభ్యర్థుల ముందుంచిన చిట్టా ఇది. ‘మా కాలనీలో ఉదయం సాయంత్రం ఆడేందుకు అనువైన స్థలం ఉంది. కానీ వసతులే లేవు.. మట్టిలోనే అడుతున్నాం. ఈ ఎన్నికల వేళ కనీసం మీరు సిమెంట్‌తో షటిల్ కోర్టు వేయిస్తే బాగుంటుంది’.. మల్కాజిగిరి నియోకజవర్గంలో మరో కాలనీ వాసుల సూచన. ఇదంతా ఈ నెల 7వ తేదీన జరిగే ఎన్నికల ప్రచారంలో భాగంగా కాలనీలకు వెళుతోన్న ఎమ్మెల్యే అభ్యర్థుల ముందు నగర ఓటర్లు ఉంచుతున్న అభ్యర్థనలు. అయితే, అభ్యర్థులు సైతం కింది స్థాయి క్యాడర్‌ను, మధ్యవర్తులను నమ్ముకునే బదులు తమ చేతుల్లో ఉన్న కాంట్రాక్టర్లతో ఇలాంటి పనులన్నీ 24 గంటల్లో చక్కబెడుతున్నారు. మద్యం, నగదు పంపిణీకి బదులు నిర్మాణ పనులు, సీసీ కెమెరాల కొనుగోళ్ల వ్యవహారం సులువు కావడంతో వెంటనే చేసేస్తున్నారు. నగరంలో ఇప్పుడు ప్రచార పర్వంలో అభ్యర్థులతో పాటు సివిల్, మెకానికల్ ఇంజినీర్లు సైతం పాలు పంచుకుంటూ కాలనీ సంఘాల నుంచి వస్తున్న విజ్ఞప్తులపై తమ అభ్యర్థి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగానే రికార్డు సమయంలో పనులు పూర్తి చేస్తున్నారు.
బస్తీల్లో గుళ్లు, కమ్యూనిటీ హాళ్లు
ఇక బస్తీలకు వెళ్లే అభ్యర్థులకు కమ్యూనిటీ హాళ్లు, దేవాలయాల్లో సౌకర్యాల కోసం వినతులు వస్తున్నాయి. చుట్టూ ప్రహరీ నిర్మాణం, రంగులు వేయడం, హుండీ ఏర్పాట్లు వంటి కోరికలు వస్తుండడంతో వెంటవెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. మళ్లీ ఐదేళ్ల వరకు పట్టించుకునే వారుండరు.. మన కాలనీ, బస్తీలకే వచ్చి మీకేం కావాలని అభ్యర్థులు అడుగుతున్నారు. అందుకే మా సమస్యలను చెప్పి, పరిష్కారాలు చూసుకుంటున్నామని మల్కాజిగిరి నేరెడ్‌మెడ్ వాసి నాయుడు చెప్పారు. ఇక అభ్యర్థుల ప్రచారంలో రహదారులు, డ్రైనేజీ సమస్యలు కూడా భారీగానే వస్తున్నాయి. ముఖ్యంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మంచినీటి పైప్‌లైన్ల కోసం 450 కి.మీ మేర తవ్విన గుంతలు జనాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండగా, ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎప్పుడూ ఉప్పొంగే డ్రైనేజీ సమస్య ప్రచారానికి వెళుతున్న అభ్యర్థులకు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇక వన భోజనాలు, సమూహ యాత్రకు వెళ్లే గ్రూపులకు సైతం ఎమ్మెల్యే అభ్యర్థులు ఆర్థిక సహాయం చేయక తప్పని స్థితి నగరంలో నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment