’అన్నా.. గీ ఆదివారం గార్డెన్ దావత్ అంట నువ్వు రావలె’ అని ఎంకటేసు అంటే నాకు సమజ్ గాలె. ఈ బిత్తిరోడు ఏదీ సక్కగ జెప్పడు గదా అనుకుని’ గార్డెన్ దావత్ ఏందిర బై.. ఇనేందుకే కొత్తగుంది’ అనడిగిన. ‘గదేనే.. కార్తీకంలో దావత్ పెడ్తరు.. అందరు కలుస్తరు గద’ అనంగనే నా బుర్ర గిర్రమంది. ‘అరె బేవకూఫ్ దాన్ని వనబోజనం అంటరు.’ అన్న. ‘గదేలేవె.. నాకేం దెల్సు ఇక్కడందరు గట్లనె అంటుండ్రు. గద్సరె గాని ఇంటోల్లందర్ని పిల్సుకు రా మల్ల’ అనెల్లిండు. కార్తీక మాసం ఒచ్చిందంటే వనబోజనాలు ఉంటయ్ గద. గీసారి ఏంది స్పెసల్ అని ఆలోచిస్తె టక్కున బల్బు ఎలిగింది. ఆ గీసారి ఎలచ్చన్లున్నయ్‌గ.. గదీ సంగతి. అరె ఈ ఎలచ్చన్లు.. వనబోజనాలు బలె కల్సి వచ్చినయ్!
⇔ వానకాలం ఎళ్లి చలికాలం సురువయ్యే టైంల వచ్చే గీ కార్తీకం అంటె ఇస్టం లేందెవర్కి. దివిల పండగ మొదలు ఇంటి ముందు మట్టి ప్రమిదల్ల దీపాలెల్గుతుంటె.. గవి మన కండ్లల్ల వెలుగుతున్నట్లె ఉంటయ్. ఇండ్లల్ల.. వీదుల్ల.. గుళ్లోన.. వెయ్యిదీపాలు.. లచ్చ దీపాలు.. కోటి దీపాలు అంటూ పోటీ పడ్తుంటె.. ఊరు ఊరంతా గా దీపాల్లెక్కన మెరిసిపోతుంటది. గింతేగాదు కార్తీకం అనగానె టక్కున గుర్తొచ్చేది వనబోజనాలె. ఊర్లో.. సిటీల అన్ని చోట్ల గీ వనబోజనాల సందడే సందడి. మొదట్లో గల్లీలో ఉన్నోళ్లు.. ఊరి చివర్న తోటల్కాడికెల్లి బోజనాల్జేసి కొంతసేపు కుశాల్‌గ కబుర్లు చెప్పుకొని ఆడిపాడి వచ్చేటోల్లు. ఊరేదైనా.. పేరేదైనా జనాలు కల్సిమెల్సి ఉండే మంచి కాలం అది. గిప్పుడు గట్ల కాదు. ఎవరికి వాల్లు సామాజిక వర్గాలుగ గుంపులు కట్టిండ్రు. వాట్సప్‌ల్ల కూడా గివి జోర్‌దార్‌గ నడుస్తున్నయ్ అంటె సూడుండ్రి. గీల్ల దిమాక్ గింతెందుకు కరాబ్ అవుతాందో గెంత బుర్ర పెట్టినా అందుత లేదు.
⇔ గిప్పుడు మా గల్లీల వనజోజనం ప్రచారం బలె జోరందుకుంది. కార్తీక మాసం.. శివనామ స్మరణం! వనబోజన ఉత్సవం.. అందరూ తరలి రావాలె! అంటూ బ్యానర్లు.. ప్లెక్సీçలు మస్తుగ కట్టిండ్రు. క్యాండేటు.. లేదా లీడర్లెంట.. పార్టీలెంట తిరిగే గల్లీ లీడరు దండాలు పెడ్తున్న పొటోలు పెట్టిండ్రు. గింతే కాదు సామాజికవర్గం పేర్లు కూడా రాసుకుండ్రు. ఏందైతే నేం మంచిగ దావత్ పెడ్తుండ్రు పున్నేనికి పున్నెం.. తినటాన్కి అన్నం అనుకుంటుండ్రు జనాలు. ఆదివారం అయితే సాలు గల్లీ ముందు బండ్లు పెడ్తుండ్రు. మల్ల జనాల్ని తీసుకెల్లాలి గాదె. అప్పట్లో తోటలుంటె.. గిప్పుడంత స్వేతా గార్డెన్.. పూజా గార్డెన్.. సువర్ణ గార్డెన్.. ఆ రిసార్టు గీ రిసార్టులు కనిపిస్తున్నయ్!
⇔ మొన్న ఓ వనబోజనం పంక్షన్‌కు కాండేటు వచ్చిండంట. బోజనాలైనంక.. ‘మెల్ల మెల్లగ వచ్చిండే.. క్రీము బిస్కట్ ఏసిండె’ పాట పెట్టంగనె పిల్లలు స్టేజిపై మస్తుగ డాన్సు చేసిండ్రంట. ఏం మిస్టేకో తెలీదు గానీ గీ లైను రాంగానె పాట బంద్. మల్లీ ‘మెల్ల మెల్లగ వచ్చిండే’ అంటూ సురు! గిట్ల నాల్గుసార్లు అయ్యేసరికి గా కాండేటు గుస్సా అయిండంట! ఏం మజాక్ జేస్తుండ్రు? నాకు దెల్వదనుకుండ్రా! గా పాటేంది? గా డాన్సేందిర బై ? నేనేం మెల్లగ రాలె బాగానె వచ్చిన. గదేదో క్రీము బిస్కట్ ఏసిండంటె ఏందర్థం? గింత జేసింది గాకుండ పెట్టిందే పెట్టి నా ఇజ్జత్ దీస్తరా చల్.. అని లేసిండంట. పాపం నిర్వాహకులు అన్నా గుస్సా జెయ్యకే.. గది ‘పిదా’ సిన్మా పాట అన్నా ఇనకుండా.. పిదా లేద్ గిదా లేద్ పదా.. అని ఎంటొచ్చినోల్లని లేప్కొని ఎల్లిపోయిండంట! నిజమే మల్ల ఎప్పుడు జనాల వద్ద రానోల్లకి గిట్ల బోజనాల కాడికొచ్చి ఓటు అడిగితె గట్లనే ఉంటది. ఇంతకీ గీ వనబోజనాల్కి పైసల్ ఎవరిస్తుండ్రని గా ఎంకటేసుల్ని అడిగిన. ఇంకెవ్రు గా కాండేట్లే! నీకు దెల్వదా? అన్నడు. అంటె గివన్నీ ఓట్లు రాబట్కునేకి కొట్టే పల్టీలన్నమాట! గీ గార్డెన్.. కాదు కాదు వనబోజనాలంటూ జనాల్ని కూడేసేది గిందుకోసమెనా? – రామదుర్గంమధుసూదనరావు
గార్డెన్ దావత్‌కు నువ్వు రావలె
Published Tue, Nov 20 2018 10:25 AM | Last Updated on Tue, Nov 20 2018 10:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment