
గాంధీభవన్ ఎదుట ధర్నా చేస్తున్న భిక్షపతి యాదవ్, కాంగ్రెస్ నాయకులు
సాక్షి,సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ‘ప్రజా కూటమి’లో సీట్ల సర్దుబాటు జరగకముందే నిరసన సెగలు కక్కుతోంది. గట్టి పట్టు గల నియోజకవర్గాలను పంపకాల్లో వదులుకోవద్దంటూ మిత్రపక్ష నేతలు ఆందోళనకు దిగుతున్నారు. మరోవైపు కూటమిలోని అంతర్గత విభేదాలు కూడా రచ్చకెక్కుతున్నాయి. మిత్ర పక్షాల మధ్య సీట్ల సంఖ్యపై అవగాహన కుదిరినా వాటి సర్దుబాటు పక్రియ ఇంకా పూర్తికాలేదు. మరో నాలుగైదు రోజుల్లో కూటమి అభ్యర్థుల జాబితా ప్రకటించనుండడంతో ఆశావహుల్లో మరింత టెన్షన్ నెలకొంది. కొందరు ఆశావహులకు తమ అగ్రనేతల నుంచి ‘గ్రీన్ సిగ్నల్’ లభించడంతో ఎన్నికల ప్రచారానికి సైతం శ్రీకారం చుట్టారు.
నగరంపైనే కాంగ్రెస్.. టీడీపీ పట్టు
నగరంలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌తో పాటు టీడీపీకీ గట్టి పట్టుంది. గత ఎన్నికల్లో టీడీపీ పదిస్థానాలు గెలుచుకుంది. అప్పట్లో గెలిచినవారిలో ఒక్కరు మినహా తొమ్మిది మంది టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీని అంటిపెట్టుకొని ఉన్న రెండో శ్రేణి నేతలు ఇప్పుడు ఆయా స్థానాలపై ఆశలు పెంచుకున్నారు. కూటమిలో ఆ పార్టీకి సర్దుబాటు చేసే 14 సీట్లలో 8 స్థానాలు నగర పరిధిలోనే ఇవ్వాలని పట్టుబడుతోంది. ఈ స్థానాలు వదులుకోవద్దని కాంగ్రెస్ నేతలు సైతం పట్టుబడుతున్నారు. దీంతో కూటమిలోని మిత్ర పక్షాల మధ్య రాజకీయం గరంగరంగా మారింది.
శేరిలింపల్లిపై కాంగ్రెస్ ్ఠ టీడీపీ
పంపకాలపై పలు అసెంబ్లీ స్థానాలు ఆందోళనకు కారణమువుతున్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని వదులుకోవద్దంటూ ఆదివారం కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ గాంధీ భవన్ వద్ద ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ కార్యకర్త, గోపనపల్లికి చెందిన రంగస్వామి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. అక్కడే విధి నిర్వహణలో ఉన్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే మసీద్‌బండకు చెందిన బాలరాజు బ్లేడుతో చేయి కోసుకున్నాడు. సయ్యద్ అనే యువకుడు గాంధీభవన్ పైకెక్కి దూకుతానంటూ బెదిరించాడు. పోలీసులు చాకచక్యంతో అతడిని కిందకు దించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మరోవైపు ఇదే నియోజకవర్గంలో టీడీపీలోని రెండు వర్గాలు బాహాబహీకి దిగాయి. ఎన్నికల ప్రచారానికి దిగిన అనంద్ ప్రసాద్ వర్గాన్ని ‘మువ్వ’ వర్గం అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరెగింది. గత ఆదివారం మల్కాజ్‌గిరి అసెంబ్లీ స్థానాన్ని తెలంగాణ జన సమితికి కేటాయించవద్దంటూ కాంగ్రెస్ శ్రేణులు గాంధీభవన్ ముందు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్‌లో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపిస్తామని, ఈ స్థానాన్ని పంకాల్లో వదులుకోవద్దని విజ్ఞిప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment