
సాక్షి, యాదాద్రి : మహాకూటమి పొత్తుల తంతు రెండు, మూడు రోజుల్లో తేలే అవకాశం ఉందన్న సంకేతాలు జిల్లా వ్యాప్తంగా కూటమి పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. పొత్తుల విషయంలో రోజురోజుకూ మారుతున్న రాజకీయ పరిణామాలతో ఇప్పటికే నీరసంగా ఉన్న ఆశావహులు మరింత టెన్షన్‌కు గురవుతున్నారు. ఒకవైపు పొత్తులు తేలక నిరుత్సాహం చెందుతూ.. మరోవైపు ప్రచారాన్ని పూర్తిస్థాయిలో చేసుకోలేక.. కేడర్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఎటూ తేల్చుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
ఇప్పటివరకు ప్రకటనల మీద ప్రకటనలతో పొత్తులు, టికెట్ల కేటాయింపు ఎప్పకటిప్పుడు వాయిదాలు పడుతుండటంతో ఆశావహుల్లో ఆందోళన, ఆతృత, కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. పైకి గంభీరంగా కనిపిస్తున్న మహాకూటమి ఆశావహులను భయం వెంటాడుతూనే ఉంది. ప్రచారం చేస్తూ కొందరు.. పైరవీలు చేస్తూ మరికొందరు టికెట్ల వేటలో అధిష్టానంపై ఆశలు పెట్టుకున్నారు. అయితే టికెట్ వస్తుందో రాదోనన్న భయంలో స్పష్టంగా కనిపిస్తోంది. పైకి కార్యకర్తలతో సీటు తమపార్టీకే కేటాయిస్తారని కొందరు నేతలు.. తమకే వస్తుందని మరికొందరు అభ్యర్థులు కేడర్‌తో చెబుతున్నా అంతర్గతంగా వారు ఆందోళనలోనే ఉన్నారు.
హాట్ టాపిక్‌గా పొత్తుల వ్యవహారం..
మహాకూటమి పొత్తులు, అభ్యర్థుల ఎంపిక వ్యవహారంపై ఇప్పుడు జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడా చూసినా హాట్ టాపిక్‌గా మారింది. జిల్లాలోని భువనగిరి, ఆలేరు, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించగా మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. మహాకూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ, టీజేఎస్‌లు జిల్లాలోని సీట్లపై కన్నువేశాయి. భువనగిరిపై టీజేఎస్, ఆలేరుపై టీడీపీ, మునుగోడుపై సీపీఐలు పొత్తుల్లో భాగంగా సీట్లు కోరుతున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ మూడు నియోజకవర్గాల్లో ఏ సీటును ఎవరికి కేటాయిస్తుందోనన్న టెన్షన్ ఇటు ఆశావహులు, అటు ఆయా పార్టీల కేడర్‌లో నెలకొంది.
పట్టువీడని కాంగ్రెస్ ?
భువనగిరి, ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ మహాకూటమి తరఫున పోటీ చేసే విషయంలో పట్టుదలగా ఉన్నట్టు తెలిసింది. అయితే మహాకూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, సీపీఐ, టీజేఎస్ తమకు పొత్తులో భాగంగా సీట్లు కేటాయించాలని పట్టుబడుతున్నాయి. అయితే ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను కూడా మహాకూటమి చర్చల్లో వెల్లడిస్తూ తమకు గెలుపు అవకాశాలు ఉన్నాయని పట్టుబడుతున్నాయి.
మరోవైపు సర్వేలపై ఆధారపడ్డ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తమ పార్టీ అభ్యర్థులతోపాటు మహాకూటమి అభ్యర్థులపై వరుస సర్వేలు చేయిస్తోంది. గెలిచే వారికి టికెట్ ఇస్తామని చర్చల్లో కూటమి పక్షాలను ఒప్పించే ప్రయత్నం చేస్తోంది.
ఆలేరు నుంచి కోదండరాం..?
అయితే టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతుండగా అదే నియోజకవర్గాన్ని టీడీపీ కోరుతోంది. మరోవైపు జిల్లాలోని మునుగోడు, ఆలేరు నియోజకవర్గాలను తమకే కేటాయించాలని సీపీఐ పట్టుపడుతోంది. భువనగిరి నియోజక వర్గాన్ని టీజేఎస్ ఆశిస్తుండగా.. ఈ నియోజకవర్గాలన్నింటిలోను కాంగ్రెస్ అభ్యర్థులే పోటీ చేస్తారని ఆ పార్టీ నాయకుడొకరు చెబుతున్నారు.
కాంగ్రెస్ హైకమాండ్ ఆరా..
భువనగిరి, ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఆపార్టీకి చెందిన ఆశావహులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. వీరందరిపై ఇప్పటికే సర్వేలు నిర్వహించడంతోపాటు రెండు రోజులుగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా బూత్ కమిటీ కన్వీనర్లకు ఫోన్‌లు చేసి ఆశావహుల పేర్లపై వివరాలను సేకరి స్తున్నారు. పార్టీ అభ్యర్థులు విజయావకాశాలపై ఆరా తీస్తున్నారు. ఫోన్‌లో ఆయన బూత్ కమిటీ కన్వీనర్లతో మాట్లాడుతూ వారి వద్ద గల ఆశావాహుల పేర్లను అడిగి తెలుసుకుంటున్నారు.
అయితే టీపీసీసీ నుంచి ఏఐసీసీ ముఖ్యనేతల వరకు ఉన్న తమ పలుకుబడి, పరిచయాలను ఉపయోగించి ఆశావహులు కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రెండు, మూడు రోజుల్లో టికెట్లు, సీట్ల కేటాయింపు తేలనున్న తరుణంలో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఆశావహులైన టీఆర్‌ఎస్ అభ్యర్థులతోపాటు ఆయా పార్టీల ఆశావహులు, పార్టీ నేతలు, కేడర్‌లో ఒకటే టెన్షన్ నెలకొంది.