నా జీవితం ప్రజాసేవకు అంకితం : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి | Nalgonda MLA Candidate Komatireddy Venkatreddy Interview With Sakshi | Sakshi
Sakshi News home page

నా జీవితం ప్రజాసేవకు అంకితం : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Published Tue, Dec 4 2018 9:15 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Nalgonda MLA Candidate Komatireddy Venkatreddy Interview With Sakshi

కాంగ్రెస్‌ నల్లగొండ అసెంబ్లీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి  

సాక్షి, నల్లగొండ : ‘వచ్చేది ప్రజా ప్రభుత్వం.... ప్రజలే పాలించుకుంటారు.. కుటుంబ పాలనకు చరమగీతం పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నా జీవితం ప్రజాసేవకు అంకితం’ అని మాజీ మంత్రి, నల్లగొండ కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఆయన ఇస్తున్న హామీలు, ప్రచార తీరుతెన్నులపై ఆదివారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చా రు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ఐదేళ్లుగా తెలంగా ణ ప్రజలు రాక్షస పాలన అనుభవించి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వచ్చేది ప్రజా ప్రభుత్వం..ప్రజలే పాలన చేసుకుం టారు. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే.. తెలంగాణ ప్రజలకు కాకుండా ఒక్క కేసీఆర్‌ కుటుంబానికే లాభపడే విధంగా కేసీ ఆర్‌ పాలన కొనసాగింది. సెక్రటేరియట్‌కు రాకుండా ప్రగతి భవన్‌కే పరిమితమై నిరంకుశ పాలన కొనసాగించారు. తెలం గాణ ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్‌తో ఉంటే నాలుగున్నరేళ్ల పాలనలో కేసీఆర్‌ రూ.2లక్షల కోట్ల అప్పులు చేశారు. ప్రతి ఒక్క మనిషిపై రూ.లక్ష అప్పు చేసి పెట్టారు. డబుల్‌ బెడ్‌రూం లని చెప్పి ఎక్కడా కట్టించిన దాఖలాలు లేవు. కేసీఆర్‌ పాలనతో విసిగి ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. 
ప్రజలకు అనుకూలంగా మేనిఫెస్టో:
వచ్చే కాంగ్రెస్‌ప్రభుత్వంలో పాలన ప్రగతి భవన్‌ నుంచి కాకుండా సెక్రటేరియట్‌ నుంచి కొనసాగుతుంది. కాంగ్రెస్‌ మేనిఫెస్టోను కూడా ఆవిధంగా రూపొందించాం. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేయడంతోపాటు రూ.5లక్షలతో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టించి తీరుతాం. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఐటీ పార్క్‌ సాధించి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పించడం, మెగా డీఎస్సీని ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలను మేనిఫెస్టోలో పొందుపర్చాం. నేను 20 ఏళ్ల కాలంలో నల్లగొండ శాసన సభ్యుడిగా, నీతి, నిజాయితీతో ప్రజా సేవ చేశాను. లంచాలు తీసుకోలేదు. కేవలం ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవే పరమావధిగా పనిచేశాను. తెలంగాణ కోసం మంత్రి పదవిని కూడా త్యాగం చేశా. నాకు పదవులు ముఖ్యం కాదు.. ప్రజలే ముఖ్యం. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే నల్లగొండలో రౌడీలే రాజ్యమేలే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే నా అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్‌ను హత్య చేశారు. మళ్లీ టీఆర్‌ఎస్‌ గెలిస్తే ప్రజల ఆస్తులకు, ప్రాణాలకు కూడా రక్షణ ఉండదు. కాబట్టి ప్రజలు రౌడీ పాలన కావాలా... కూటమి ఆధ్వర్యంలో నడిచే ప్రజాపాలన కావాలా అని ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం ఉంది. 
మోడల్‌ నియోజకవర్గంగా నల్లగొండ..
కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టుతోపాటు శ్రీశైల సొరంగ మార్గం, మెడికల్‌ కళాశాల, అండర్‌గ్రౌండ్‌ డ్రైయినేజీ పనులను సాధించాం. వాటి పనులు చివరి దశకు వచ్చాయి. ఆ తర్వాత అకారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తనపై కక్షతో నిధులు విడుదల చేయలేదు. నల్లగొండ నియోజకవర్గానికి నాలుగునరేళ్లలో నాలుగు పైసలు కూడా విడుదల చేయలేదు. నల్లగొండ నియోజకవర్గ అభివృద్ధి కోసం సొంత మేనిఫెస్టోను తయారు చేసుకున్నానన్నారు.రెండేళ్లలోపే నల్లగొండ పట్టణం చుట్టూ 20వేల ఇళ్లు కట్టించాలని నిర్ణయించాం. ఒక్కక్క ఇల్లు రూ.6లక్షలతో నిర్మిస్తాం. భారత దేశంలోనే నల్లగొండను ఒక మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా. కాబట్టి నల్లగొండ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలి. 
మండలాల అభివృద్ధికి ప్రత్యేక మేనిఫెస్టో:
నల్లగొండ నియోజకవర్గ మండలాల అభివృద్ధికి ప్రత్యేక మేనిఫెస్టోను రూపొదిస్తున్నా. ఈ ఎన్నికల్లో విజయం ఖాయమైపోయింది.. గెలిచిన తర్వాత ప్రాధాన్యక్రమంలో ఒక్కో పనిచేసుకుంటూ వెళ్తాను. నియోజకవర్గ ప్రజల అండ నాకు ఎప్పుడూ ఉంటుంది.  

మరిన్ని వార్తాలు...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement