రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడే అయినా ఓ జిల్లాలో అడుగు పెట్టేందుకు ఆలోచిస్తున్నారట. పార్టీ చీఫ్గా బాధ్యతలు తీసుకుని రెండేళ్ళవుతున్నా ఒకే ఒక జిల్లాలో పర్యటించలేదు. ఆ జిల్లాలోని సీనియర్లతో పడటంలేదా? వారంటే భయమా? రేవంత్ను వారే అడ్డుకుంటున్నారా? ఇంతకీ ఆ జిల్లా ఏది? రేవంత్ పర్యటించకపోవడానికి కారణం ఏంటి?..
రెండేళ్ళ క్రితం పార్టీలోని ఉద్ధండులను కాదని, అంతకుముందే పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించింది పార్టీ హైకమాండ్. పార్టీ రాష్ట్ర చీఫ్గా రాష్ట్రమంతా తిరుగుతున్న రేవంత్ నల్గొండ జిల్లాలో మాత్రం అడుగు పెట్టడంలేదు. ఆ జిల్లాలో అడుగు పెట్టేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారట. ఒకే ఒకసారి రాహుల్ వరంగల్ సభకు సన్నాహకంగా నాగార్జునసాగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు. అది కూడా సీనియర్ నేత జానారెడ్డి సపోర్టుతో. ఆ తర్వాత మరోసారి ఆయన నల్గొండ జిల్లాలో కాలు పెట్టింది లేదు. జిల్లాకు రేవంత్ను రానిచ్చేవారేరి అని పార్టీ కేడరే సెటైర్లు వేసుకుంటున్నారట. ఇక్కడ ఉన్న సీనియర్ నేతలను కాదని... వారి అనుమతి లేకుండా.. జిల్లాలో పర్యటించే అవకాశమే లేదని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ తలపెట్టిన రాష్ట్రవ్యాప్త పాదయాత్ర జిల్లాలో లేనట్లేనా అంటే సమాధానం ఇచ్చేవారే లేరు.
కాంగ్రెస్ వర్గాల్లోనే టాక్..
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్త పాదయాత్రలో భాగంగా కొన్ని జిల్లాల్లో పూర్తి చేశారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి. నల్లగొండ జిల్లాలో మాత్రం పాదయాత్ర ఉండకపోవచ్చని కాంగ్రెస్ వర్గాల్లోనే టాక్ నడుస్తోంది. సీనియర్ నేత జానారెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డిలు టీ కాంగ్రెస్లో కీలక నేతలుగా చెలామణి అవుతున్నారు. వీరంతా నల్లగొండ జిల్లాకు చెందినవారే. జానారెడ్డి మినహా మిగతా వారంతా రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న నేతలే. వీరి అనుమతి లేకుండా రేవంత్ జిల్లాలో పర్యటించే పరిస్థితి లేదు. జిల్లాలో ఉన్న రెండు లోక్ సభ స్థానాలకు ఉత్తమ్కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో రేవంత్ పర్యటించాలంటే ఖచ్చితంగా వీరికి సమాచారం ఇవ్వక తప్పదు. ఎలాగూ వారు పాదయాత్రలో పాల్గొనే అవకాశం లేదు. అందువల్ల వారిని కాదని రేవంత్ సొంతంగా పాదయాత్ర జరిపే అవకాశం ఉండదనేది స్పష్టం. ఒకవేళ రేవంత్ సాహసంతో పాదయాత్ర చేసిన పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువుంటుందనేది ఓ విశ్లేషణ. అనవసర తలనొప్పులు తెచ్చుకోవడం కంటే నల్లగొండ జిల్లాలో పాదయాత్ర చేయకపోవడమే బెటర్ అనే ఆలోచనతో రేవంత్ అండ్ కో ఉన్నట్లు సమాచారం.
సీనియర్ల కొత్త వ్యూహం..
అయితే రేవంత్‌కు పోటీగా సీనియర్లు కొత్త వ్యూహానికి తెరలేపారని తెలుస్తోంది. ఇప్పటికే రేవంత్కు ధీటుగా పాదయాత్ర చేస్తోన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో జిల్లాలో పాదయాత్ర చేయించాలని.. భారీ హంగు ఆర్భాటాలతో దాన్ని విజయవంతం చేయాలని సీనియర్లు ఆలోచిస్తున్నారట. ఈ నేపథ్యంలో భువనగిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలో భట్టితో పాదయాత్ర చేయించేందుకు సీనియర్లు ఆలోచిస్తున్నారట. అందుకు షెడ్యూల్ కూడా తయారు చేశారని జోరుగా వినిపిస్తోంది. ఎవరైతే ఏంటీ శత్రువును దెబ్బకొట్టేందుకు ఎవరి భుజాలపై తుపాకీ పెట్టి కాల్సినా అంతిమంగా లక్ష్యం చేరడమే కదా కావాల్సింది అని సీనియర్లు భావిస్తున్నారట. భట్టి విక్రమార్క పాదయాత్రకు తోడుగా..కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఎవరికి వారే వారి నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే జిల్లా కాంగ్రెస్లో రేవంత్ నాయకత్వాన్ని బలపరుస్తున్న జానారెడ్డి మరోసారి ఆయన్ని తన నియోజకవర్గం సాగర్తో పాటు ఆయన ఆశపడుతున్న మరో నియోజకవర్గం మిర్యాలగూడకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని తీసుకొస్తారా అనే టాపిక్ ఆసక్తికర చర్చకు తెరతీసింది.
బహుశా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా ఉన్న నేత ఒక జిల్లాలో పర్యటించడానికి ఇబ్బందిపడిన సన్నివేశం గత కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుల్లో ఎవరికీ వచ్చి ఉండదు. మంచి దూకుడు మీదుండే రేవంత్ రెడ్డికి మాత్రమే నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు చుక్కలు చూపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment