సాక్షి, నల్లగొండ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీ సహా, ప్రతిపక్ష పార్టీల నేతలు గెలుపు తమదంటే తమదేనని చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సీఎం కావొచ్చు అంటూ వ్యాఖ్యలు చేశారు.
మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తొలిసారిగా నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా నకిరేకల్‌లో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి, మధు యాష్కీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం అంటున్నారు. కానీ, కాంగ్రెస్‌లో అలా కాదు.. ఎవరైనా సీఎం కావొచ్చు. తెలంగాణలో ఎవరు సీఎం అన్నది ముఖ్యం కాదు. ముందు పార్టీని అధికారంలోకి తీసుకురావడం అందరిముందున్న లక్ష్యం. నేను భవిష్యుత్తులో ఎప్పుడైనా సీఎం అవుతాను అంటూ కామెంట్స్ చేశారు.
ఇదే సమయంలో.. కేటీఆర్ నేను ఎక్కడికి వెళితే అక్కడ కుట్రతో కరెంటు కట్ చేయిస్తున్నాడు. బీఆర్ఎస్ ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థికి వందల కోట్లు పంచుతున్నారు. లక్షల సార్లు అబద్ధాలు చెప్పిన వ్యక్తి కేసీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులు, మహిళలు వివక్షకు గురయ్యారు. చేసిన రుణమాఫీ వడ్డీకే సరిపోలేదు. సంతలో గేదెలను కొన్నట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నారు. ఎల్లుండి ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోతో బయపడి గ్యాస్, యూరియా ఫ్రీ అంటాడు. నాలుగు వేల పింఛన్ భార్యాభర్తలకు ఇద్దరికీ ఇస్తాము.
కరెంటు 24 గంటలు ఇస్తున్నట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమే. సిరిసిల్ల, గజ్వేల్, సిద్ధిపేట తప్ప మిగతా 116 నియోజక వర్గాలు అభివృద్ధికి నోచుకోలేదు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు పోవడానికి రూ.600 కోట్లతో రోడ్లు వేసుకున్నాడు. నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీకి ఆ పేరు పెట్టింది కూడా నేనే. కేటీఆర్‌కు ఛాలెంజ్ చేస్తున్నా, దమ్ముంటే వీరేశంను నకిరేకల్‌లో ఓడించు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ సత్తా ఏంటో బీఆర్ఎస్‌కు చూపిస్తాం అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్‌కు రేఖా నాయక్ స్ట్రాంగ్ వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment