ఒకటి, రెండు రోజుల్లో కాంగ్రెస్‌ తొలి జాబితా | Congress MLA Candidates List Announced Next Two Days | Sakshi
Sakshi News home page

ఒకటి, రెండు రోజుల్లో కాంగ్రెస్‌ తొలి జాబితా

Published Wed, Oct 31 2018 12:58 PM | Last Updated on Sat, Nov 10 2018 11:46 AM

Congress MLA Candidates List Announced Next Two Days - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ఆకలి అయినట్టే ఉంటోంది... తినబోతే కడుపులోకి ముద్ద దిగదు.. నిద్ర పట్టదు.. కాలు ఒక చోట నిల్వదు.. సెల్‌లో యూట్యూబ్‌ చూస్తే ఊహాత్మక జాబితాలు ఎన్నెన్నో.. అందులో పేరు గల్లంతై గుండె జారి ఢిల్లీకి ఫోన్‌ కొడితే ‘ఫికర్‌ మత్‌కరోభాయ్‌’అనే సమాధానం.. ఫోన్‌ కొట్టిన ప్రతి వాళ్లకూ అదే జవాబు. ఈ నేపధ్యంలో మూడు, నాలుగు రోజులుగా  మహా కూటమి ఆశావహుల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. నవంబర్‌ ఒకటో తేదీ వరకు అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తామని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించిన నాటి నుంచి ఒకటే టెన్షన్‌. అయితే.. మహాకూటమి అధినేతలు మాత్రం వ్యూహత్మకంగానే లీకులను ఇస్తూ.. జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా రెబల్స్‌ బెడద తప్పేటట్టు లేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
 
పాలకుర్తిలో..

పాలకుర్తి నియోజకవర్గం నుంచి జంగా రాఘవరెడ్డి టికెట్‌ తనకే అనే భరోసాతో ఉన్నారు. గ్రామాల్లో ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాస్‌ రావు భార్య సుమన, బిళ్ల సుధీర్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ఇటీవల బిళ్ల సుధీర్‌రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ..  రౌడీషీటర్‌ అర్హతగా టికెట్లు కేటాయిస్తే సీనియర్‌ రౌడీషీటర్‌నైన తనకే టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తన పార్టీలోనే మరో అశావహ అభ్యర్థి పేరును ప్రస్తావిస్తూ ఆయన కంటే నేనే సీనియర్‌ రౌడీషీటర్‌ను అంటూ ప్రకటించుకున్నారు. తాను దొమ్మీలు, దొంగతనాలు చేయలేదని, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను కాపాడుకునేందుకు నేను పోరాడుతుంటే నా మీద రౌడీషీట్‌ తెరిచారని చెప్పారు.

ములుగులో ముసలం..
ములుగు నియోజకవర్గంలో దనసరి అనసూయ అలియాస్‌ సీతక్క, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య మధ్య తీవ్ర పోటీ ఉంది. . టికెట్‌ కోసం నున్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. పొదెం వీరయ్య కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ టికెట్‌ నాదే..గెలుపు నాదే అని ప్రకటిస్తున్నారు. మరో వైపు సీతక్క కూడా టికెట్, గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు.  మహాకూటమికి భద్రాచలంలో సరైన అభ్యర్థి« లేకపోవటం కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఇద్దరిలో ఎవరినో ఒకరికిని భద్రాచలం నియోజకవర్గానికి  వెళ్లాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరు కూడా ససేమిరా అన్నట్లు సమాచారం.

రేవంత్‌రెడ్డి పట్టు
సీతక్క, వేం నరేందర్‌రెడ్డికి రేవంత్‌రెడ్డి హార్డ్‌కోర్‌ టీం సభ్యులుగా పేరుంది. తెలుగుదేశం పార్టీ నుంచి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పుడే ఆయనతో పాటు వాళ్లు కూడా టికెట్‌ కమిట్‌మెంట్‌తో కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు సమాచారం. వేం నరేందర్‌రెడ్డి వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశిస్తున్నారు. ఇక్కడి నుంచి డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. ఎన్నికలు  అని కాకుండా మొదటి నుంచి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వస్తున్నారు. ఒకరకంగా ఆయన ఇక్కడ పార్టీకి బలమైన పునాదులే వేశారు. ఈనేపథ్యంలో నరేందర్‌రెడ్డికి ఇక్కడి నుంచి టికెట్‌ అంత ఈజీ కాదని పార్టీ పరిశీలకులు చెబుతున్నారు. మరో వైపు  మహాకూటమి పొత్తులో భాగంగా వరంగల్‌ పశ్చిమను త్యాగం చేసే ప్రతిపాదనలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పశ్చిమ టికెట్‌ తన అనుచరుడు నరేందర్‌రెడ్డికి ఇవ్వకపోతే, ములుగు టికెట్‌ సీతక్కకు ఇచ్చి తీరాలని పట్టుపడుతున్నట్లు  విశ్వసనీయంగా తెలిసింది.

ఇందిరకా.. విజయరామారావుకా..
స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి మాజీ మంత్రి గుండె విజయరామారావు, ఇందిర, మాదాసి వెంకటేష్‌తో పాటు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన దొమ్మాలటి సాంబయ్య పార్టీ టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు.
ఈ నలుగురిలో ఎవరికి వారు టికెట్‌ తమదే అంటే తమదేనని చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నారు.  విజయరామారావు, ఇందిరా మ«ధ్య తీవ్ర పోటీ ఉన్నట్లు సమాచారం. భక్తచరణ్‌దాసు కమిటీ ఈ ఇద్దరిలో ఒకరికి టికెట్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.  విజయరామారావుకు గనుక ఇక్కడ టికెట్‌ కేటాయిస్తే  ఇందిర అనుచరులు ఆమెపై రెబల్‌గా పోటీ చేయమని ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది.

‘దొంతి’ గెట్టెక్కినట్టే..
నర్సంపేట టికెట్‌ దాదాపు కాంగ్రెస్‌కే అని సంకేతాలు అందుతున్నాయి.  కూటమి పొత్తులో భాగంగా  వరంగల్‌ జిల్లాలో ఒక్క సీటు ఇస్తే అది నర్సంపేట ఇవ్వాలని టీడీపీ పట్టుపడుతోంది. అయితే కాంగ్రెస్‌ పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నర్సంపేటను వదులుకోవడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ఇక్కడి నుంచి దొంతికి దాదాపు టికెట్‌ ఖరారైనట్లే అనే సంకేతాలు అందుతున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, బక్క జడ్సన్, నమిండ్ల శ్రీనివాస్, డాక్టర్‌ విజయ్‌కుమార్, పరికి సదానందం టికెట్‌ ఆశిస్తున్నారు. 

రేవూరి నిర్ణయమే తరువాయి...
పొత్తు ధర్మంలో భాగంగా టీడీపీకి కనీసం ఇక్కడి నుంచి ఒక సీటు ఇవ్వాల్సి వస్తోంది. అది కూడా మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి కోసం. ఆయనేమా నర్సంపేటే కావాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో అటు టీడీపీ, ఇటు కాంగ్రెస్‌ ఆయన్ను బుజ్జగించి పక్క నియోజకవర్గానికి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.  పరకాల, వరంగల్‌ పశ్చిమ ఈ రెండు చోట్ల ఎక్కడ కావాలని అడిగినా రేవూరికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే వరంగల్‌ అర్బన్‌ జిల్లా రాజకీయ సమీకరణలు మారుతాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement