భోలక్‌పూర్ ప్రచారంలో ఆజాద్
సాక్షి,సిటీ బ్యూరో: గ్రేటర్‌లో ప్రజాఫ్రంట్ అగ్రనేతల ప్రచారం జోరందుకుంది. గురువారం కూటమి అభ్యర్థుల పక్షాన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జమ్ము అండ్ కశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ అజాద్ తదితరులు వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా చేసిన ప్రచారంతో శ్రేణుల్లో నూతనోత్తేజం ఉరకలేస్తోంది. గెలుపుపై అభ్యర్థుల్లో సైతం ధీమా వ్యక్తమవుతోంది. ప్రచారంలోనూ కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ పక్షాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. మరోవైపు కూటమి నేతలు ప్రత్యేక వ్యూహంతో విభిన్న కార్యక్రమాలతోముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటిæకే రాహుల్ గాంధీ, చంద్రబాబులు సనత్‌నగర్, నాంపల్లి బహిరంగ సభల్లో ప్రసంగించగా, అంతకుముందు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి గ్రేటర్‌లోని పలు నియోజకవర్గాల్లో రోడ్ షోలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు.
నేతల భేటీలు.. రోడ్‌షోలు
రాహుల్ గాంధీ గురువారం నగర శివారు శంషాబాద్‌లోని ఓ హోటల్‌లో ప్రైవేట్ విద్యా సంస్థలు, కేజీ టు పీజీ జేఏసీ నేతలతో ప్రత్యేకంగా భేటీ ఆయ్యారు. విద్యా రంగ సమస్యలపై వారితో చర్చించారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేసే సిబ్బందికి రూ.5 లక్షల బీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మసీద్‌బండ, తారానగర్, ఆల్విన్ కాలనీ క్రాస్ రోడ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్‌షోలో ప్రసంగించారు. ఐటీ కంపెనీలు కొలువుదీరిన సైబరాబాద్‌కు సృష్టికర్త తానే నంటూ చెప్పుకొచ్చారు. గతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ఘనత తనదేనంటూ ప్రసంగించారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శనస్త్రాలు సంధించారు. బీజేపీపై మండి పడ్డారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని భోలక్‌పూర్‌లో ర్యాలీ, బహిరంగ సభల్లో గులాం నబీ అజాద్ ప్రసంగించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుని పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment