సాక్షి, హైదరాబాద్ : చెప్పేవాడికి వినేవాడు లోకువ. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలకు ఈ సామెత సరిపోతుంది. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిని తన ఘనతగా చంద్రబాబు చెప్పుకుంటుంటే.. ఖండించాల్సిన నేతలు మౌనముద్ర వహిస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధి్దకి మూలస్తంభాలైన ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తానే కట్టానని ఎన్నికల సభల్లో బాబు దబాయించి చెబుతున్నా.. కాంగ్రెస్ నేతలు కిమ్మనకుండా కళ్లప్పగించి చూస్తున్నారు. పైగా అవన్నీ నిజమే అన్నట్టుగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తమ కొత్త మిత్రుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ శ్రేణులకు మింగుడుపడటం లేదు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధిని నేనే చేశానంటూ బాబు హైజాక్ చేస్తున్నా.. వాస్తవాలు వివరించాల్సిన పార్టీ నేతలు చోద్యం చూస్తుండటంతో తట్టుకోలేకపోతున్నాయి. పైగా హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు ఇతోధిక కృషి చేశారంటూ రాహుల్ ప్రశంసలు కురిపించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎన్నికల సభల్లో వైఎస్సార్ పేరు ప్రస్తావించని రాహుల్.. ఆయన హయాంలో జరిగిన ప్రధానమైన అభివృద్ధి పనులను బాబు తన ఖాతాలో వేసుకుంటే అవునన్నట్లు ప్రశంసించడాన్ని చూసి తీవ్రంగా ఆవేదన చెందుతున్నాయి. వైఎస్సార్ హయాంలో మం త్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్నవారు సైతం చంద్రబాబు అబద్ధ్దపు ప్రకటనలు చూసి విస్తుపోతున్నారు.
రాహుల్ సమక్షంలో బాబు అబద్ధపు ప్రకటనలను అడ్డుకునే సాహసం చేయలేకపోతున్నామని ఓ మాజీ మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. ఔటర్ రింగ్ రోడ్డుకు భూసేకరణ ప్రారంభమైందే 2005లో అయితే, దానికి చంద్రబాబుకు సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాహుల్, బాబు సంయుక్త ఎన్నికల సభలో పాల్గొన్న సదరు మాజీ మంత్రి.. బాబు అబద్ధాలను ప్రజలు హర్షించడం లేదని, ఆయన మాట్లాడుతున్న తీరు పరమ అసహ్యంగా ఉందని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ పేరు కూడా ఉచ్చరించడానికే ఇష్టపడని చంద్రబాబు.. ఇప్పుడు ఆధునిక తెలంగాణ సృష్టికర్తను తానేనంటూ చెప్పుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో కచ్చితంగా నష్టం కలిగించే చర్యేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సైబరాబాద్‌లో ఒక్క సైబర్ టవర్ నిర్మాణం మాత్రమే చంద్రబాబు హయాంలో ప్రారంభమైనప్పటికీ.. వైఎస్ హయాంలో మొదలై పూర్తి చేసిన ప్రాజెక్టులను తన ఖాతాలో వేసుకుంటున్న తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉందని ఓ రాజకీయ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు. వైఎస్‌ఆర్ హయాంలో ప్రారంభమైన ఐసీఐసీఐ నాలెడ్జ్ హబ్‌తో పాటు ఫైనాన్సియల్ డిస్ట్రిక్స్ నిర్మాణాన్ని తన ఖాతాలో వేసుకుంటూ అబద్దపు ప్రచారంతో ఓటర్లను చంద్రబాబు ఉదరగొడుతున్న తీరు కాంగ్రెస్ పార్టీలో చాలామంది నేతలకు ఏమాత్రం రుచించడం లేదు.
ఔటర్ రింగ్‌రోడ్డు భూసేకరణకు ఎన్నో అడ్డంకులు...
దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఊపిరి పోసుకున్న ఔటర్ రింగ్ రోడ్డుకు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఎన్నో అడ్డంకులు సృష్టించారు. భూసేకరణలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. దీంతో వైఎస్ ఈ అంశంపై సీబీఐ విచారణకు ఆదేశించారని, ఈ సంగతిని చంద్రబాబు మర్చిపోయినట్లు నటిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ప్రైవేట్ సంభాషణల్లో మండిపడుతున్నారు. నగరానికి నలువైపులా సుమారు రూ.6వేల కోట్లతో ఎనిమిది లేన్ల ఔటర్ రింగ్‌రోడ్డుకు వైఎస్సార్ రూపకల్పన చేశారు. సమగ్ర ప్రాజెక్టు నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలపడంతో జనవరి 3, 2006న అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. అంతేకాదు.. మొదటి దశ 24.32 కిలోమీటర్ల నిర్మాణాన్ని కేవలం రెండేళ్లలోనే పూర్తిచేసిన ఘనత వైఎస్‌ది. గచ్చిబాలి–నార్సింగి–శంషాబాద్ ఎనిమిది లేన్ల రహదారిని నవంబర్ 14, 2008న జాతికి అంకితం చేశారు. అనంతరం దశలవారీగా ఈ ప్రాజెక్టు పనులు పూర్తవుతూ వచ్చాయి. రెండేళ్ల క్రితం టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మొత్తం ఔటర్ రింగ్ రోడ్డు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. తన తాత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పేరు ఈ రోడ్డుకు పెట్టిన సంగతిని రాహుల్ విస్మరించారా లేదా బాబును బాధపెట్టడమెందుకని మౌనంగా ఉన్నారా అన్నది అర్థం కావడంలేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
మార్చి 16, 2005న అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన
హైదరాబాద్‌కు మకుటాయమానంగా నిలిచిన అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం శరవేగంగా పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచే వైఎస్సార్ కసరత్తు మొదలుపెట్టారు. అందుకు అనుగుణంగా అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి మార్చి 16, 2005న యుపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. అంతటితో వదిలేయకుండా అనుకున్న సమయంలో నిర్మాణాన్ని పూర్తి చేయించేందుకు స్వయంగా పలుమార్లు నిర్మాణంతీరును పర్యవేక్షించారు. రికార్డు సమయంలో విమానాశ్రయాన్ని పూర్తి చేయించి, మార్చి 14, 2008న అప్పటి యుపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించారు. అదే రోజున శంషాబాద్ విమానాశ్రయానికి రాజీవ్‌గాంధీ పేరు పెడుతూ ఉత్తర్వులు జారీ చేయించారు. అప్పటికి ఐదేళ్ల ముందే గద్దె దిగి, అంతకంటే ఆరేడు నెలలపాటు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు ఈ ఎయిర్‌పోర్ట్‌తో ఏ రకంగా సంబంధం ఉందని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. తన తల్లి సోనియాగాంధీ చేతుల మీదుగా శంకుస్థాపన, ప్రారంభోత్సవం జరిగిన విమానాశ్రయానికి తండ్రి రాజీవ్‌గాంధీ పేరు పెట్టిన విషయం రాహుల్‌కు గుర్తు లేదా లేక కావాలనే ఆ క్రెడిట్ చంద్రబాబుకు ఇస్తున్నారా అని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. అలాగే విమానాశ్రయం కనెక్టివిటీ కోసం మాసబ్‌ట్యాంక్ నుంచి ఆరాంఘర్ వరకు 11.633 కిలోమీటర్ల మేర దేశంలోనే అత్యంత పొడవైప ఫ్లై ఓవర్ వంతెనను నిర్మించిన ఘనమైన కీర్తి వైఎస్ ఖాతాలో ఉన్నప్పటికీ.. రాహుల్‌గాంధీ విస్మరించడం ఆశ్యర్యం కలిగిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కేవలం ఏడాదిన్నరలోనూ ఈ ఫ్లై ఓవర్ పూర్తిచేసి, అక్టోబర్ 19, 2009న జాతికి అంకితం చేశారు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.
ఐఐటీ, బిట్స్.. వైఎస్ చలువే
ఇక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), బిర్లా ఇన్‌స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (బిట్స్) వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు హైదరాబాద్‌లో ఏర్పాటు కావడానికి వైఎస్ ఎంతో చొరవ తీసుకున్నారు. ముఖ్యమంత్రి కాగానే ఆయన కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖను ఒప్పించి హైదరాబాద్‌కు ఐఐటీ తీసుకొచ్చారు. చంద్రబాబు తన హయాంలో బాసరకు ఐఐటీ అంటూ ఊరిస్తూ వచ్చారు. ఎన్‌డీఏ ప్రభుత్వంలో కీలకభాగస్వామిగా ఉన్నప్పటికీ, ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఏ ఒక్కటీ చంద్రబాబు సాధించలేకపోయారు. ఇప్పుడేమో హైదరాబాద్‌ను తానే అభివృద్ది చేశానని అబద్దాలు చెపుతుంటే కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయన్ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
ఐటీ అభివృద్దికి చర్యలెన్నో...
సైబరాబాద్ నిర్మించింది తానేనని చంద్రబాబు గొప్పగా చెప్పుకున్నప్పటికీ, వాస్తంగా జరిగింది వేరు. చంద్రబాబు హయాంలో ఒక్కసైబర్ టవర్స్ మినహా మరేమీ నిర్మాణం కాలేదు. అక్కడ హైటెక్ సిటీ నిర్మాణానికి ముందు తన అనుయాయుల చేత కారుచౌకగా స్థలాలు కొనిపించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు దిగిపోయే నాటికి 2003–04లో ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ ఎగుమతుల మొత్తం విలువ 28.75 మిలియన్ డాలర్లు మాత్రమే. అదే వైఎస్ రాజశేఖరరెడ్డి మొదటి ఐదేళ్ల పదవీకాలం పూర్తయ్యే నాటికి 2008–09లో ఏపీ నుంచి ఎగుమతి అయిన ఐటీ ఉత్పత్తుల విలువ ఏకంగా 5.1 బిలియన్ డాలర్లు. బాబు దిగిపోయేనాటికి హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలు 19 ఉండగా.. ఉద్యోగుల సంఖ్య 56 వేలు మాత్రమే. అదే వైఎస్ మొదటి టర్మ్ పూర్తయిన 2008–09 నాటికి 69 కంపెనీలు తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఏకంగా 2.52 లక్షల మంది ఐటీ రంగంలో ఉద్యోగాలు సాధించారు.
2008–09లో ఏపీలో ఐటీ ఎగుమతుల వృద్ది రేటు 24.5 శాతం ఉండగా జాతీయ వృద్దిరేటు 20.7 శాతం మాత్రమే. ఐటీని ఒక్క ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌కు పరిమితం చేయకుండా రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ సమీపంలోని పోచారంలో ఇన్ఫోసిస్‌కు 450 ఎకరాలు కేటాయించారు. ఇప్పుడు ఆ క్యాంపస్‌లో 11 వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా హైదరాబాద్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన వైఎస్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ విస్మరించడమే కాకుండా.. ఆ అభివృద్ధి పనులను తన ఘనతగా ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబును ప్రశంసించడం శోచనీయమని అభిప్రాయపడుతున్నారు. ‘చంద్రబాబు ప్రచారానికి వస్తే నెగెటివ్ అవుతుందని చెప్పాం. అయినా పార్టీ నాయకత్వం వినలేదు. తీరా ప్రచారానికి వచ్చి మాకు మరింత నష్టం చేసి వెళ్లాడు’అని ఓ కాంగ్రెస్ అభ్యర్థి ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీని రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన వైఎస్సార్‌ను గుర్తుచేయకపోవడం చాలా బాధాకరమైన విషయమని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment