సాక్షి ప్రత్యేక ప్రతినిధి–న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇకపై పూర్తిగా టీడీపీ అధినేత గుప్పిట్లోకి వెళ్లనుందా? చంద్రబాబు కనుసన్నల్లోనే ఆ పార్టీ నేతలు పని చేయాల్సిన పరిస్థితి తలెత్తనుందా? ఢిల్లీ కేంద్రంగా చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలను చూస్తుంటే ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఇటీవల సమావేశమైన చంద్రబాబు ఆయనతో కలసి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. ముఖ్యంగా తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని మహాకూటమి గెలిస్తే ముఖ్యమంత్రి పదవిని తాను సూచించే వ్యక్తికి ఇవ్వాలని ప్రతిపాదించినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలియవచ్చింది. ఈ ఎన్నికల్లో కూటమిని గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని, ప్రతి పైసా తానే ఖర్చు చేస్తానని కూడా ఆయన రాహుల్‌కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కూటమి గెలిస్తే ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలన్న విషయంలో మాత్రం తన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని చంద్రబాబు కోరారని, రాహుల్‌తో భేటీకి ముందే ఏఐసీసీ నేతలు అహ్మద్ పటేల్, కొప్పుల రాజుతో చంద్రబాబు పలు దఫాలుగా చర్చించారని సమాచారం.
ఆ తర్వాత రాహుల్ గాంధీతో సమావేశమైనప్పుడు ఫలానా సామాజిక వర్గానికి చెందిన నేత అయితే ముఖ్యమంత్రి పదవికి బాగుంటుందని చంద్రబాబు ప్రతిపాదించారు. అహ్మద్ పటేల్, కొప్పుల రాజు నుంచి సమాచారం ఉండటంతో రాహుల్ కూడా చంద్రబాబు ప్రతిపాదనకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. మొదటి నుంచి కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా ఉన్న బలమైన సామాజికవర్గం వారిని కాదని, వేరే సామాజికవర్గం నేత పేరును చంద్రబాబు ప్రతిపాదించిన విషయం ఇప్పుడు ఢిల్లీలోని కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నా ఏఐసీసీ సీనియర్ నేత ఒకరు తన సన్నిహితులతో దీన్ని పంచుకోవడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ‘తెలంగాణ ఎన్నికల ప్రక్రియనే కాదు... కాంగ్రెస్ పార్టీని కూడా చంద్రబాబు హైజాక్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో’అని మధ్యప్రదేశ్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యత లేకపోవడం, రాహుల్ సలహాదారుడిగా చెప్పుకుంటున్న ఓ నాయకుడు రాష్ట్ర రాజకీయాలను తప్పుదారి పట్టించడం వల్లే ఇలాంటి దురదృష్టకరమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయని గతంలో ఉమ్మడి ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జిగా పనిచేసిన దక్షిణాది రాష్ట్రాల నేత ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతిలో బీజం...
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంశంతోపాటు కూటమి గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలన్న అంశంపై టీడీపీ మూడు నెలల క్రితమే బీజం వేసింది. తెలంగాణ ఎన్నికలకు ఖర్చు పూర్తిగా భరిస్తానన్న నిర్ధారణకు వచ్చిన చంద్రబాబు... ఢిల్లీలో ఓ కాంగ్రెస్ నాయకుడు, తాను సీఎంగా ప్రతిపాదించబోయే వ్యక్తిని పిలిపించుకుని చర్చలు జరిపారు. ఆ కాంగ్రెస్ నేత ఇటీవల అమరావతిలో చంద్రబాబును కలిసినట్లు వార్తలు వెలువడిన సంగతి విదితమే. కాంగ్రెస్ నాయకత్వంలో ఏర్పడే కూటమి గెలుపు బాధ్యతను తీసుకుంటానని వారిద్దరి సమక్షంలో చంద్రబాబు చెబుతూ ఢిల్లీలోని అధిష్టానం పెద్దలకు ఈ సంగతి చెప్పి ఒప్పించాలని ఆ నేతను కోరారు. అయితే దీన్ని రహస్యంగా ఉంచాలని లేనిపక్షంలో కాంగ్రెస్‌కు మొదటి నుంచి మద్దతుగా ఉన్న ఓ బలమైన సామాజికవర్గం నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని అనుకున్నారు. ఆ తరువాత మళ్లీ రాహుల్‌తో సమావేశం సందర్భంగా చంద్రబాబు తన ప్రతిపాదనను బయటపెట్టి అంగీకారం తీసుకున్నారు. దీనివెనుక ఓ ప్రముఖ పత్రికాధిపతి ప్రమేయం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలే ఉటంకిస్తున్నాయి. రాహుల్‌గాంధీకి సన్నిహితుడిగా ముద్రపడ్డ ఢిల్లీ నేత హైదరాబాద్‌లో పలుమార్లు ఆ పత్రికాధిపతితో సమావేశమయ్యారు. వచ్చే శాసనసభ ఎన్నికలకు ఏ పార్టీ ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలన్న విషయంలో సదరు పత్రికాధిపతి సలహాలు కూడా తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బలమైన సామాజికవర్గం ఎందుకు వద్దు...
ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి గెలిస్తే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేదా జానారెడ్డిలో ఒకరికి ముఖ్యమంత్రి పదవి దక్కుతుందన్నది ఇప్పటిదాకా కాంగ్రెస్ వర్గాల్లో ఉన్న ప్రచారం. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రవేశంతో వారిద్దరికీ సీఎం పదవి అంత తేలిక కాదన్నది ఢిల్లీ కాంగ్రెస్ నాయకుల మనోగతంగా ఉంది. ఈ ఎన్నికలకు అవసరమైన మొత్తాన్ని ఖర్చు చేసేందుకు వారిద్దరిలో ఎవరూ ముందుకు రాలేదని, అందువల్ల ఆ బాధ్యత తీసుకున్న చంద్రబాబు మాటే చెల్లుబాటు అవుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఒకరు తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ ఒకరితో చెప్పారు. కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా నిలుస్తున్న సామాజికవర్గాన్ని కాదని వేరొకరికి సీఎం పదవి కట్టబెట్టాలన్న ఆలోచన వెనుక అనేక వ్యూహాలు ఉన్నాయని ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు అంటున్నారు. తెలంగాణలో చంద్రబాబుపై ఉన్న ఓటుకు కోట్లు కేసును రద్దు చేయడం లేదా విచారణ జరిపి ఆయన ప్రమేయం లేదని తేల్చడం వాటిలో ఒకటని కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. దీనికితోడు ఏపీ ఎన్నికల్లో ప్రచారానికి తెలంగాణ సీఎం నియామకాన్ని వాడుకోవాలన్నది బాబు మరో వ్యూహం. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు, ఆయన సన్నిహితుల ప్రయోజనాలకు పెద్దపీట వేయడం మూడోది.
మీరు ఆ మూడు రాష్ట్రాలు చూసుకోండి
‘మీరు రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను చూసుకోండి. తెలంగాణ ఎన్నికల వ్యవహారం, దానికి సంబంధించిన ఖర్చు అంతా నాకే వదిలేయండి. కూటమిని గెలిపించే బాధ్యత నేనే తీసుకుంటా’ రాహుల్ గాంధీతో భేటీలో చంద్రబాబు మొదట చెప్పిన డైలాగ్ ఇది. ఈ ప్రతిపాదనతో రాహుల్ ఊపిరి పీల్చుకున్నట్లు కనిపించడంతోనే చంద్రబాబు తన అస్త్రాన్ని బయటపెట్టినట్లు సమాచారం. కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి బాధ్యత తీసుకుంటానని, ఎంత డబ్బు ఖర్చు అయినా తానే భరిస్తానని చంద్రబాబు చెప్పడంతో రాహుల్ రిలీఫ్‌గా ఫీల్ అయ్యారని కాంగ్రెస్ నేతలు ప్రైవేట్ సంభాషణల్లో చెబుతున్నారు. ఏపీ ఇంటెలిజెన్స్ సిబ్బందితో సర్వే చేయించానని, పరిస్థితి బాగుందని కూడా చంద్రబాబు చెప్పారు. దీంతో అప్పటికే తన దగ్గరకు వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను రాహుల్ చంద్రబాబుకు అందించి పరిశీలించాల్సిందిగా సూచించినట్లు తెలిసింది. ఆ జాబితాలో ఆరు, ఏడు మార్పులు సూచించడంతోపాటు ఇప్పటికే ఖరారైన 14 సీట్లకు అదనంగా రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గాలను టీడీపీకి కేటాయించాలని రాహుల్‌కు ఓ దూత ద్వారా లేఖ పంపారు.
టీ కాంగ్రెస్ నేతల ఆందోళన
ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. టీఆర్‌ఎస్‌ను ఓడించడానికి టీడీపీ తో పొత్తు పెట్టుకోవాలని అనుకున్నామేగానీ ఇక్కడ మొత్తం ఎన్నికల వ్యవహారాన్ని చంద్రబాబు చేతిలో పెట్టాలని తాము కోరుకోలేదని ఓ సీనియర్ నేత అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను చంద్రబాబు చేతికి ఇవ్వడంపై కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే టీడీపీ సహకారంతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆ సీనియర్ నేత ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ కాంగ్రెస్... కేరాఫ్ చంద్రబాబు!
Published Tue, Nov 6 2018 1:24 AM | Last Updated on Tue, Nov 6 2018 4:43 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment