సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కూటమిలో కుంపటి మొదలైంది. టికెట్ల వేటలో సీట్ల సర్దుబాటు చిక్కుముడిగా మారింది. మహాకూటమిగా జతకట్టిన కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్‌ల మధ్య సీట్ల పందేరం కొత్త వివాదాలకు తెరలేపుతోంది. ఇరుపార్టీలు పట్టుబడుతున్న నియోజకవర్గాల్లో ఆశావహుల బుజ్జగించడం అధినాయకత్వానికి అగ్నిపరీక్ష కానుంది. రాష్ట్ర స్థాయిలో పొత్తు కుదిరినప్పటికీ, సీట్ల సంఖ్యపై స్పష్టత రాకపోవడంతో కూటమి పక్షాల్లో గందరగోళం నెలకొంది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లను టీడీపీ గెలిచింది. వాటిని తమకే కేటాయించాలని ఆ పార్టీ పట్టుబడుతోంది. పొత్తు విస్తృత ప్రయోజనాల దృష్ట్యా పరిమిత స్థాయిలోనే సీట్లను ఇస్తామని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది.
పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కివచ్చినా.. ఏయే స్థానాలను ఇరు పార్టీలు పంచుకుంటున్నాయనే అంశంపై స్పష్టత రాలేదు. ఇదే రెండు పార్టీల నేతల మధ్య విభజనకు దారితీస్తోంది. 2014 ఎన్నికల్లో ఎల్‌బీనగర్‌లో టీడీపీ నెగ్గింది. అనంతరం జరిగిన పరిణామాలతో టీడీపీ ఎమ్మెల్యేలందరూ పార్టీ వీడగా స్థానిక ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాత్రం సైకిల్ దిగకున్నా పార్టీకి దూరంగానే ఉన్నారు. తాజాగా ఈ స్థానాన్ని తమకే కేటాయించాలని టీడీపీ ప్రతిపాదిస్తోంది. అయితే, తాజా మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యకు కాదు.. జిల్లా పార్టీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి కోసం ఈ సీటును టీడీపీ కోరుతోంది.
గత ఎన్నికల్లో అనూహ్యంగా కృష్ణయ్య తెరమీదకు రావడంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి రంగారెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారు. ఈసారి మాత్రం ఎలాగైనా బరిలో దిగాలని కృతనిశ్చయంతో ఉన్న ఆయన కొన్నాళ్ల క్రితమే ప్రచారాన్ని కూడా మొదలు పెట్టారు. పార్టీకి అంటిముట్టనట్లుగా ఉండడం.. పార్టీలో కొనసాగడంపై కూడా కృష్ణయ్య ఊగిసలాడుతుండడంతో రంగారెడ్డి ప్రచారంలో దూకుడు పెంచారు. దీనికితోడు కాంగ్రెస్‌తో సయోధ్య కుదరడం తనకు కలిసివస్తుందని ఆశించారు. సిట్టింగ్ కావడం వల్ల టీడీపీకే కేటాయిస్తారనే ధీమాతో ఉన్నారు.
కూటమిలో త్రిముఖం!
సీటుపై భరోసాతో ఎన్నికల ప్రచారానికి సామ రంగారెడ్డి శ్రీకారం చుట్టగా.. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కూడా ఇక్కడి నుంచి బరిలో దిగడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ప్రచారపర్వాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ స్థానాన్ని తమకే వదలాలని పట్టుబడుతోంది. రంగారెడ్డి కంటే తమ అభ్యర్థే బలంగా ఉన్నారని వాదిస్తోంది. ఇలా ఇరువురి మధ్య పీటముడి వీడకముందే.. ఆర్.కృష్ణయ్య బాంబులాంటి వార్త పేల్చారు. తాను కూడా పోటీలో ఉంటున్నట్లు ప్రకటించారు.
అయితే, ఆయన ఏ పార్టీ నుంచి బరిలో ఉంటారనేది స్పష్టం చేయలేదు. ఇప్పటికీ టీడీపీలోనే ఉన్నానని ఒకసారి.. బీసీల కోసం కొత్త పార్టీని స్థాపిస్తున్నానని ఇంకోసారి వ్యాఖ్యానించడం కలకలం సృష్టిస్తోంది. దీనికితోడు ఇటీవల రాహుల్‌గాంధీని కూడా ఆయన కలుసుకోవడం.. కాంగ్రెస్‌కు అనుకూల వ్యాఖ్యలు చేయడంతో ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచా రం జరుగుతోంది. ఇలా ఈ సెగ్మెంట్‌లో మహాకూటమిలోనే సీటు ఫైట్ జరుగుతుండడం చర్చనీయాంశంగా మారింది.
ఇక్కడా ‘ఒకటే’ పంచాయితీ
రాజేంద్రనగర్ నియోజకవర్గంలోనూ దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. తొలుత ఈసీటు కాంగ్రెస్ కోటాలో వెలుతుందని భావించినా.. కుటుంబానికి ఒకే టికెట్ నిబంధన కాంగ్రెస్ నేత కార్తీక్‌రెడ్డికి ప్రతిబంధకంగా మారుతుందని ప్రచారం జరుగు తోంది. ఈ క్రమంలోనే టికెట్ దక్కించుకోవడానికి ఢిల్లీ సా ్థయిలో తనదైన శైలిలో పావులు కదుపుతున్న కార్తీక్‌కు మహా కూటమి రూపంలో కొత్త చిక్కు వచ్చి పడింది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి విజయం సాధించిన టీడీపీ మళ్లీ తమకే ఈ సీటు కేటాయించాలని పట్టుబడుతోంది. తెలుగుదేశం సమర్పించిన జాబితాలో దీనికి చోటు ఉన్నా కాంగ్రెస్ మాత్రం ఇప్పటివరకు తలొగ్గడంలేదు.మరోవైపు టీడీపీ నుంచిటికెట్ ఆశిస్తున్న సామ భూపాల్‌రెడ్డి,గణేశ్‌గుప్తా చాపకింద నీరులా ఎన్నికల ప్రచారం సాగిస్తుండడం కాంగ్రెస్ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది.
తాండూరులో టీజేఎస్ లొల్లి!
శివార్లలోని ఎల్‌బీనగర్, రాజేంద్రనగర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఉప్పల్ నియోజకవర్గాల్లో టీడీపీతో కుదుర్చుకున్న పొత్తు తమ సీట్లకు ఎసరు తెస్తుండగా.. తాండూరులో తెలంగాణ జనసమితి(టీజేఎస్) రూపంలో కాంగ్రెస్‌ను కలవరపరుస్తోంది. మొదట్నుంచి ఈ స్థానంపై కన్నేసినా.. కుదరదని పీసీసీ నాయకత్వం తేల్చిచెప్పింది. ఇటీవల స్థానికంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు, ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు ఓడిస్తామనే ప్రతిజ్ఞలతో అధిష్టానం పునరాలోచనలో పడింది. దీనికితోడు టికెట్ల వేటలో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునేదాక వెళ్లడంతో ఈ తలనొప్పికంటే టీజేఎస్‌కు ఇవ్వడమే ఉత్తమమనే భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీటును ఆశిస్తున్న మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి మనవడు ఆదిత్య కూడా ప్రయత్నాలను ముమ్మరం చేయడంతో టీజేఎస్ ఖాతాలో వెళ్లే అవకాశం లేకపోలేదనే ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment