
కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడ ముచ్చటగా మూడోసారి కూన శ్రీశైలంగౌడ్, కేపీ వివేకానంద్ పోటీ పడుతున్నారు. గత రెండు ఎన్నికల్లో చెరొకసారి గెలుపొందిన వీరు... మూడోసారి విజయకేతనం ఎగరేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరొందిన జీడిమెట్ల ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. ఇక్కడ కార్మిక, మురికివాడ ప్రాంతాలే అధికం. ఈ నేపథ్యంలో వీరి ఓట్లు కీలకంగా మారనున్నాయి.
2009స్వతంత్రుడికి పట్టం
మేడ్చల్ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉన్న కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ 2009లో అసెంబ్లీ సెగ్మెంట్‌గా ఏర్పడింది. దీనికి 2009లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కూన శ్రీశైలంగౌడ్ విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 15మంది అభ్యర్థులు బరిలో నిలవగా... 3,13,160 ఓట్లకు గాను 1,57,595 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 17 ఓట్లు రిజెక్ట్ కాగా, 39 ఓట్లు పోస్టల్ ద్వారా వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీశైలంగౌడ్‌కు 53,953 ఓట్లు రాగా... మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసిన వివేకానంద్‌కు 30,534 ఓట్లు వచ్చాయి. పోస్టల్ ద్వారా వచ్చిన 39 ఓట్లలో 21ఓట్లు శ్రీశైలంగౌడ్‌కే పడడం విశేషం.
2014 భిన్నమైన తీర్పు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ ఓటర్లు భిన్నమైన తీర్పునిచ్చారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా కూన శ్రీశైలంగౌడ్, టీడీపీ అభ్యర్థిగా కేపీ వివేకానంద్ బరిలోకి దిగగా... వివేకానంద్ అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 6,01,248 ఓట్లకు గాను 2,91,356 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 43 ఓట్లు రిజెక్ట్ కాగా 553 ఓట్లు పోస్టల్ ద్వారా వచ్చాయి. మొత్తం 23మంది పోటీపడగా వివేకానంద్‌కు 1,14,363 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీశైలంగౌడ్‌కు 40,283 ఓట్లు వచ్చాయి. తెలంగాణ ప్రభావం ఉన్నప్పటికీ... సీమాంధ్రులు అత్యధికంగా ఉండడంతో ఇక్కడ టీడీపీ గెలుపు సునాయాసమైంది. పోస్టల్ ద్వారా వచ్చిన 182 ఓట్లలో శ్రీశైలంగౌడ్‌కు 90 ఓట్లు వచ్చాయి.
2018ఇప్పుడెవరో!
ముచ్చటగా మూడోసారి ప్రత్యర్థులుగా బరిలోకి కూనశ్రీశైలంగౌడ్, కేపీ వివేకానంద్‌లలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. శ్రీశైలంగౌడ్ ప్రజాకూటమి అభ్యర్థిగా బరిలో నిలవగా... వివేకానంద్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2014లో టీడీపీ నుంచి గెలిచిన వివేకానంద్ ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment