విపక్షంలో టెన్షన్‌ | Great Alliances Congress Adilabad | Sakshi
Sakshi News home page

విపక్షంలో టెన్షన్‌

Published Tue, Oct 23 2018 7:52 AM | Last Updated on Tue, Oct 23 2018 7:52 AM

Great Alliances Congress Adilabad - Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: ఎన్నికల నోటిఫికేషన్‌కు మరో పదిహేను రోజులే గడువు ఉండడంతో విపక్ష పార్టీల నేతల్లో టెన్షన్‌ పెరిగిపోతోంది. నెలన్నర క్రితం అసెంబ్లీని రద్దు చేసినప్పుడే ఉమ్మడి జిల్లాలోని పది స్థానా లకు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటించగా, విపక్షాలు మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా టికెట్ల కోసం పోటీలేని నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయగా, బీఎల్‌ఎఫ్‌ పలుచోట్ల పోటీ చేసే నాయకుల పేర్లు ప్రకటించింది. అధికార పార్టీకి ప్రధాన పోటీదారుగా భావిస్తున్న మహాకూటమి నుంచి అభ్యర్థులను ఇప్పటివరకు ప్రకటించలేదు.

కనీసం కూటమి తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనే విషయంలో కూడా ఇప్పటివరకు స్పష్టత లేదు. ఉమ్మడి జిల్లాలో మూడు సీట్లు అడిగిన టీజేఎస్‌ తూర్పు, పడమరల్లో ఒక్కో సీటు అయినా ఇవ్వాలని కోరుతోంది. సీపీఐ రెండు సీట్లు అడిగి, ప్రస్తుతం మంచిర్యాల ఒక్క సీటైనా ఇవ్వాలని, లేదంటే పొత్తుతో సంబంధం లేకుండా పోటీ చేసి తీరుతామని అల్టిమేటం ఇచ్చింది. టీడీపీ నాయకులు    అధిష్టానం పైనే భారం వేసి చూస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌ నేతలు మాత్రం ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలోని పది స్థానాల్లో తామే పోటీ చేయబోతున్నట్లు చెపుతున్నారు. దీంతో విపక్షాల రాజకీయం రసకందాయంలో పడింది.

రాహుల్‌ సభతో కాంగ్రెస్‌లో పెరిగిన పోటీ
ఎన్నికల నిబంధనావళి అమలులోకి వచ్చిన తరువాత కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌గాంధీ పాల్గొన్న తొలి బహిరంగసభ భైంసాలో నాయకులు కూడా ఊహించని రీతిలో సక్సెస్‌ అయింది. ఈ సభను విజయవంతం చేయడంలో డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రధాన భూమిక పోషించగా, ముథోల్, ఖానాపూర్‌తో పాటు అన్ని నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న నేతలు తమ వంతు జనాలను తరలించారు. రాష్ట్రంలో నెలకొన్న పోటాపోటీ వాతావరణంలో సీటు దక్కించుకుంటే ఎమ్మెల్యే కావచ్చన్న ధీమా నాయకుల్లో ఉంది. ఈ నేపథ్యంలో 10 నియోజకవర్గాల్లో రెండుచోట్ల మినహా ఎనిమిది చోట్ల పోటీ నెలకొంది. నిర్మల్‌లో ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కు స్థానాల్లో మాత్రమే పోటీ లేదు.

రాహుల్‌గాంధీ సభలో ఆయన దృష్టిలో పడేందుకు నాయకులు పోటీపడ్డారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గ్రూప్‌ నుంచి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మద్ధతు తెలుపుతున్న నాయకులు, భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి వర్గాల నుంచి మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు మద్దతుదారులు ఎనిమిది స్థానాల్లో పోటీ పడుతుండడం గమనార్హం. మహాకూటమి సీట్ల సర్దుబాటే ఇంకా ఓ కొలిక్కి రాని పరిస్థితుల్లో అభ్యర్థుల తొలి జాబితా కోసం నేతలు ఎదురుచూపులు చూస్తున్నారు.

పోటీ లేని సీట్లనే ప్రకటించిన బీజేపీ..
బీజేపీ తొలి జాబితాలో ఉమ్మడి ఆదిలాబాద్‌ నుంచి కేవలం నలుగురు అభ్యర్థులనే ప్రకటించింది. ఆదిలాబాద్‌లో పాయల్‌ శంకర్, ముథోల్‌లో రమాదేవి, బెల్లంపల్లిలో కొయ్యల ఏమాజీ, బోథ్‌లో మడావి రాజు అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. ఇందులో పాయల్‌ శంకర్, రమాదేవి గత ఎన్నికల్లో పోటీ చేసినవారే. మిగతా ఆరు చోట్ల ఒకరికన్నా ఎక్కువ సంఖ్యలో నేతలు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్‌ సీట్ల ప్రకటన తరువాత ఒకటి రెండు చోట్ల టికెట్టు రాని బలమైన నేతలు బీజేపీలోకి వస్తారేమో అనే ఆశ కూడా ఆ పార్టీలో ఉంది. అయితే కొత్తగా వచ్చే వారికి టికెట్లు ఇస్తే ఒప్పుకొనేది లేదని ఇప్పటి రకు పార్టీకి సేవలు చేస్తున్న నాయకులు గొంతు విప్పుతున్నారు.

మంచిర్యాలలో గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన ముల్కల్ల మల్లారెడ్డికి తొలి జాబితాలో సీటు రాకపోవడంపై ఉమ్మడి జిల్లాలో చర్చ జరుగుతోంది. ఇక్కడ కొత్త నాయకుడికి టికెట్టు ఇప్పేంచేందుకు ఓ సామాజికవర్గం బలంగా పనిచేస్తోందని మల్లారెడ్డి వర్గం చెపుతోంది. ఆసిఫాబాద్‌లో జెడ్పీటీసీ రాంనాయక్‌ ఒక్కరే బలమైన అభ్యర్థి. ఆయనకు తొలి జాబితాలో అవకాశం దక్కలేదు. పార్టీకి సంబంధం లేని వారికి సీటిస్తే ఒప్పుకునేది లేదని రాంనాయక్‌ వర్గం అల్టిమేటం ఇస్తోంది. సిర్పూర్‌లో కూడా డాక్టర్‌ శ్రీనివాస్‌కు పోటీ ప్రస్తుతానికి ఎవరూ లేకపోయినా కాంగ్రెస్‌లో సీటు రానివారు ఎవరైనా వస్తారనే ఆశతో ఆపార్టీ నాయకత్వం ఉంది. నిర్మల్, చెన్నూరు, ఖానాపూర్‌లలో టికెట్టు ఆశిస్తున్నవారు ఎక్కువగా ఉండగా, ఎవరిని అభ్యర్థిగా ఖరారు చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
 
రెండు సీట్లపై టీజేఎస్‌ పట్టు
ఉమ్మడి ఆదిలాబాద్‌లోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుంచి రెండు సీట్లను టీజేఎస్‌ కోరుతోంది. కోదండరాం సొంత జిల్లా మంచిర్యాల కావడంతో ఇక్కడినుంచి ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నా, స్పష్టత లేదు. కోదండరాం పోటీ చేయకపోతే చెన్నూరు నుంచి దుర్గం నరేష్‌ను మహాకూటమి తరుపున బరిలో దింపాలని యోచిస్తున్నారు. అలాగే పశ్చిమాన ముథోల్‌ నుంచి పోటీ చేయాలని పార్టీ భావిస్తోంది. ఇక్కడ ముష్కం రామకృష్ణగౌడ్‌ టికెట్టు ఆశిస్తున్నారు. ఇటీవల ఈ రెండు చోట్ల పోరుసభ, ధూంధాం కార్యక్రమాలను నిర్వహించడం గమనార్హం.
 
మంచిర్యాలలో పోటీ చేసి తీరుతామంటున్న సీపీఐ
ఉమ్మడి ఆదిలాబాద్‌ నుంచి రెండు సీట్లు కోరిన సీపీఐ మంచిర్యాల సీటుపై పట్టుపడుతోంది. పార్టీ జిల్లా కార్యదర్శి కలవేణ శంకర్‌ కోసం రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఈ సీటు కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌ మంచిర్యాలను వదులుకునేందుకు సిద్ధంగా లేదని తేలడంతో స్థానిక సీపీఐ, దాని అనుబంధ సంఘం ఏఐటీయూసీ నాయకులు సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ అల్టిమేటం ఇచ్చారు. మహాకూటమి నుంచి సీపీఐకి మంచిర్యాల కేటాయించాలని కోరుతున్నామని, పొత్తులో సీటివ్వకపోయినా, సీపీఐ అభ్యర్థిని పోటీలో నిలుపుతామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ, మహాకూటమిలో సీట్ల కోసం పోటీ హోరాహోరీగా సాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement