‘మహా’ సస్పెన్స్‌! | Telangana Grand Alliance Suspended Adilabad | Sakshi
Sakshi News home page

‘మహా’ సస్పెన్స్‌!

Published Sat, Oct 27 2018 8:17 AM | Last Updated on Tue, Nov 6 2018 8:52 AM

Telangana Grand Alliance Suspended Adilabad - Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: ఎన్నికల సమరంలో మహాకూటమి సీట్ల పంపకాలు తేలడం లేదు. చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో సీట్ల కోసం పెద్దగా పట్టుపట్టడం లేదు. సీపీఐ కూడా ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా కన్నా, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్‌లపైనే దృష్టి పెడుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రధాన సమస్య తెలంగాణ జన సమితి (టీజేఎస్‌)తోనే ఏర్పడినట్లు మహాకూటమి వర్గాలు చెపుతున్నాయి. బుధ, గురువారాల్లో జరిగిన కూటమి చర్చల్లో ఏయే పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశంపై ఏకాభిప్రాయం వచ్చినట్లు కనిపిస్తున్నా... కోరుతున్న స్థానాలపైనే ప్రధాన పేచీ నెలకొంది. సీపీఐ, టీజేఎస్‌ కోరుతున్న సీట్లలో కాంగ్రెస్‌ కూడా బలంగా ఉండడం, అక్కడ కాంగ్రెస్‌ గుర్తు మీద పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోవడం ఇప్పుడు తలనొప్పిగా తయారైంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఏయే సీట్లు మిత్రపక్షాలకు పోతాయనే దానిపై సస్పెన్స్‌ కొనసాగుతుంది.

మూడు కోరి... రెండింటితో సరి 
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మూడు సీట్లలో పోటీ చేసేందుకు టీజేఎస్‌ ప్రతిపాదనలు ఇచ్చింది. కోదండరామ్‌ సొంత జిల్లా మంచిర్యాల కావడంతో తొలుత ఈ స్థానం నుంచి ఆయన పోటీ చేయాలని భావించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం ఈ జిల్లాలో చెన్నూరు స్థానంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాల్క సుమన్‌ను నిజమైన తెలంగాణ వాదంతోనే ఓడించాలనే పట్టుదలతో ఈసీటుపై కోదండరామ్‌ పట్టు పడుతున్నారని సమాచారం. కుమురం భీం జన్మస్థలమైన ఆసిఫాబాద్‌ నియోజకవర్గంతో పాటు పశ్చిమ ఆదిలాబాద్‌లోని ముధోల్‌ స్థానాలలో పోటీ చేయాలని  యోచిస్తున్నారు. మూడింటికి కాంగ్రెస్‌ ఒప్పుకోకపోతే చెన్నూరు, ముథోల్‌ సీట్లను మాత్రం వదులుకునేది లేదని టీజేఎస్‌ వర్గాలు చెపుతున్నాయి.

బెల్లంపల్లి సీపీఐకి..?
సీపీఐకి కోరుతున్న సీట్లలో బెల్లంపల్లి ఉన్నప్పటికీ, ఆ స్థానం కన్నా మంచిర్యాల సీటు కోసం ఎక్కువ ప్రయత్నాలు జరిగాయి. జిల్లా పార్టీ కార్యదర్శి కలవేన శంకర్‌ పార్టీ రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకుల ద్వారా ప్రయత్నాలు చేశారు. అయితే బుథవారం జరిగిన చర్చల్లో సీపీఐకి బెల్లంపల్లి సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సుముఖత వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌కే మరోసారి సీటు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆపార్టీ వర్గాలు కూడా చెప్పాయి. పార్టీకి కట్టుబడి ఉండాల్సిన నేపథ్యంలో బెల్లంపల్లి సీపీఐకి ఇచ్చినా అభ్యర్థిని గెలిపిస్తామని శంకర్‌ ‘సాక్షి ప్రతినిధి’తో మాట్లాడుతూ చెప్పారు.

మూడు స్థానాలపై   కాంగ్రెస్‌ నేతల ససేమిరా..
మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాలకు ఒక్క సీటు ఇచ్చినా ఒప్పుకునేది లేదని కాంగ్రెస్‌ నాయకులు హెచ్చరిస్తున్నారు. టీజేఎస్, సీపీఐ కోరుతున్న మూడు సీట్లలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొని ఉంది. చెన్నూరు నియోజకవర్గంలో గ్రూప్‌1 అధికారిగా రాజీనామా చేసిన బోర్లకుంట వెంకటేష్‌ నేత ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మాజీ మంత్రి బోడ జనార్ధన్‌ సైతం తనకే టికెట్టు అనే భావనతో ఉన్నారు. ఇక్కడ టీజేఎస్‌కు సీటిచ్చినా బరిలో నిలుస్తామనే భావనతో ఉన్నారు.

ముథోల్‌లో రామారావు పటేల్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్‌ టికెట్టు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాహుల్‌గాంధీ బహిరంగసభను విజయవంతం చేయడంలో వారు తీవ్రంగా కృషి చేశారు. ఇక్కడ ఎన్నారై విజయ్‌కుమార్‌రెడ్డి కూడా టికెట్టు ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయన గతంలో టీఆర్‌ఎస్‌లో ఉండి, కాంగ్రెస్‌లో చేరా>రు. బెల్లంపల్లిలో గద్దర్‌ కుమారుడు సూర్యకిరణ్‌ పోటీకి సిద్ధమైనట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో పొత్తుల లెక్కల్లో ఒక్క సీటు గల్లంతైనా, పరిస్థితి వేరేగా ఉంటుందని నాయకులు బాహాటంగానే చెపుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement