
కాసాని జ్ఞానేశ్వర్ కాసాని వీరేశ్
జగద్గిరిగుట్ట: సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న బాబాయ్ కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్దతు ఇచ్చేందుకు కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కాసాని వీరేశ్ ముదిరాజ్ ఏకంగా పోటీ నుంచి తప్పుకొనేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వీరిద్దరికీ అనూహ్య పరిణామాల మధ్య ప్రధాన పార్టీల నుంచి టికెట్లు లభించాయి. బీజేపీ నుంచి అబ్బాయి వీరేశ్‌కు మొదట కుత్బుల్లాపూర్ టికెట్ ఖరారు కాగా, అదే రోజు రాత్రి 9 గంటలకు బాబాయ్ జ్ఞానేశ్వర్‌కు కాంగ్రెస్ అధిష్టానం సికింద్రాబాద్ టికెట్ ఖరారు చేసింది.
దీంతో ఇరువురూ సోమవారం ఆయా నియోజకవర్గాల్లో నామినేషన్‌ల దాఖలు చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. బాబాయ్ ప్రచార బాధ్యతలు చూసుకోవాల్సిన వీరేశ్‌కు బీజేపీ టికెట్ రావడంతో అభిమానుల్లో అయోమయం నెలకొంది. దీంతో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బాబాయ్‌కి మద్దతుగా నిలిచేందుకే వీరేశ్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కాగా కుత్బుల్లాపూర్ నుంచి ముగ్గురు బీజేపీ అభ్యర్థులు కాసాని వీరేశ్, చెరుకుపల్లి భరతసింహారెడ్డి, శ్రీనివాస్‌లు నామినేషన్‌లు దాఖలు చేశారు. వీరిలో భరతసింహారెడ్డి, శ్రీనివాస్‌ల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. పార్టీ బీ ఫారం లభించిన వీరేశ్ నామినేషన్ మాత్రమే ఓకే అయింది. దీంతో వీరేశ్ ఒకవేళ తన బాబాయ్‌కు మద్దతుగా నామినేషన్ ఉపసంహరించుకుంటే స్థానికంగా బీజేపీ పోటీలో లేనట్లే అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment