మల్లేసన్నా గీసారీ పాయె.. అన్న పేరు లిస్ట్‌ల రాలె.. ‘ఎర్రిముకం ఏస్కొని ఎంకటేసం సెబ్తే నాకర్థం కాలె.. ‘ఈ లిస్టేంది.. పేరేంది? ’ఈడు గింతె! ఏదీ సక్కగ సెప్పి సావడు. అంతా గజిబిజి అనుకుని ‘అరె ఏందిర పొద్దున్నే గీ కొత్త లొల్లి.. ఎవరి పేరు రాలె.. ఏలిస్టుల రాలె’ అడిగిన. ఆడు పైనుంచి కిందాంక చూసి.. గింత మాత్రం తెల్వదా? అన్నట్లు చూసిండు. ‘గిదేందన్న ఊరంత ఎలచ్చన్ల ముచ్చట్లు.. కబుర్ల బాతాకానీ నడుస్తుంటే.. ఏం తెల్వనట్లు అడుగుతున్నవ్.. మన అంజన్న ఉన్నడు గద.. పాపం ఆ అన్నకె అన్యాయం చేసిండ్రు. ఈ లిస్టుల గారెంటీ పేరొస్తదని నిన్న అందరితో చెప్పుకునిండు. పది కేజీల స్వీట్లు పంచిండు. లిస్టు వచ్చింది గానీ అన్న పేరే రాలె’ అని రవంత బాదగ సెప్పిండు.. పాపం గీ ఎంకటేసమే గింత దిగాలు ముకమేస్కొని సెబ్తుంటే.. ఇంక ఆ అంజన్న గతేందో?
మీరెన్నయిన సెప్పుండ్రి.. గిట్ల టెన్షన్‌తో ఎదురు చూసుడు...అరె రాలెదె! అంటూ ఏడ్సుడు కన్న బేకార్ పని ఇంకోట్లేదు. మా సిన్నప్పుడు గింతె. పరీక్షలు రాసినంక అట్టలు.. బుక్కులు ఇసిరేసి ఎగిరేటోల్లం. గానీ రిజల్ట్ అంటే సాలు.. కాల్లు సేతులు వనకబట్టేవి. నోటీసు బోర్డుకంటించిన పేపర్ల.. పాసయినోల్ల పేర్లు ఏసేటోల్లు. గప్పుడు సూడాలె మా అవస్థ. పేరుంటదో లేదో అని గాబరా గాబరా అయ్యేటోల్లం. ఆ టైంల.. థూ ఎందిర బై ఈ బతుకు! గింత టెన్సన్ అవసరమా అనిపించేది. పెద్దోలం అవుతున్న కొద్ది ఈ వెతుకులాట పెరిగిందే గానీ తగ్గలె. నౌకరీ సెలెక్టు లిస్టుల పేరుందో లేదో.. ప్రమోషన్ల లిస్టులో పేరుందో లేదో.. రైలు రిజర్వేషన్ లిస్ట్‌ల పేరుందో లేదో.. గిట్ల చూస్కొంటే మనకు లిస్టులూ ఎక్కువే.. పరేషాన్లు ఎక్కువే! గిప్పట్కీ ఆ టెన్సన్ సైతాన్‌లా పట్టుకునే ఉంది.
ఈ ముచ్చటెందుగ్గానీ.. ఇప్పుడు ఎలచ్చన్లు గద. టికెట్ల కోసం గుంపుల్ల దూరి అంగీ గుండీలూడేల యుద్ధం చేస్తున్న పోరాటగాల్ల కస్టాలు ఇంతింత గాదులె. లిస్టులు ఇడుస్తుండ్రు అంటె సాలు గుండెదడ సురువయితది అంటుండ్రు. మొదట్లో మూతికి నెయ్యంటించి.. టికెట్ నీకే బిడ్డా అని పార్టీ పెద్దోల్లు అనగానె.. గీల్లు బాండు బాజాలేస్కొని గల్లీల తిరుగుతుండ్రు. గిప్పుడేమో లెక్కల్ ఉల్టాపల్టా అవుతున్నయ్. మొన్న టికెట్ గారంటీ అని ఎగిరినోడు.. ఇయ్యాల గప్‌చిప్ అయిపోయిండు. కొంతమంది ఇంకా గదే ఆశతో ఎదురు చూస్తుండ్రు! గిప్పుడూ పార్టీలో కొందరు పెద్దోలు.. అరె నువ్ పరేషాన్ కావొద్దు.. రేపు ఇంకో లిస్ట్ వస్తది.. గందులో నీ పేరు పక్కా పో! అంటుంటే పాపం గీ ఆశావహులు అల్లాడిపోతుండ్రు! టీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఎల్లిన ఓ సారు గులాబీ పార్టీని ఏకి పారేసి.. అదిస్తానం దగ్గర మంచి మార్కులు కొట్టేసిండు.. బేఫికర్‌గ టికెట్టు పట్టేసిండంట! ఇంక సనత్‌నగర్ లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తనని సీనియర్ సారు అంటె.. గట్ల గాదుగానీ ఈసారి మాకు గావాలె అంటూ తెలుగు తమ్ముల్లు లొల్లి మీద లొల్లి చేస్తుండ్రంట! ఈల్ల కతలు సరె.. పాపం కాంగ్రెస్‌ల ఓ పేద్ద సారు.. మొన్న మొన్నటి దాంక గీడ పార్టీని తనే ముందుండి నడిపినాయన.. గిప్పుడు టికెట్ వస్తదో రాదో అనుకుంటూ డిల్లీలో చక్కర్లు కొడ్తుండంటే ఇసయం ఎంత కస్టంగ మారింద్ర బై అనిపిస్తది. గాయన గిప్పట్కీ నాకేం పికర్‌లే టికెట్ వచ్చేది గారంటీ అంటుండు గానీ.. గింత పెద్ద మనిసి కతే గిట్లయితె ఎట్ల అంటూ చాలా మంది లోపల్లోపలె గొనుక్కొంటుండ్రు. ఏ పార్టీల చూసుకున్న గిదే దుకానం. పొద్దున్నే లేసుడు.. పేరు కోసం చూసుడు! ఇంక ఈ మంట ఎప్పుడు ఆరేదెట్లా.. కాండేట్లు జనాల్లోకి పోయేదెట్లా? ఓ..పెద్ద సార్లూ... కనీసం ఓట్లేసే రోజుకైనా మీ లిస్టు తేల్తదా.. తేలదా?
–రామదుర్గం మధుసూదనరావు
Comments
Please login to add a commentAdd a comment